Revanth reddy | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): ‘రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిని చేయటం దుర్మార్గం. ఆయన కోసం ఏమైనా చేస్తా.’ ‘రాహుల్ గారూ మా ఇంటికి రండి. మా ఇంటిని మీ ఇంటిగా అనుకోండి’.. పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి తన స్వామిభక్తిని చాటుకున్నారు. కానీ ఇదంతా కపటప్రేమ అని తేలిపోయింది.
రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా గాంధీ భవన్లో నిర్వహించిన ‘సత్యాగ్రహ దీక్ష’కు రేవంత్ హాజరు కాలేదు. దీంతో ఇన్నాళ్లపాటు ఆయన చెప్పినవన్నీ కట్టుకథలేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ రాహుల్ గాంధీ కోసం ఏమైనా చేస్తానంటూ భీరాలు పలికిన రేవంత్‌రెడ్డి.. దీక్షకు రాకపోవటమేంటని? పార్టీలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకే రేవంత్ నటిస్తున్నారని, వాస్తవానికి రాహుల్‌పై ఎలాంటి అభిమానం లేదని దీక్ష సందర్భంగా నేతలు మాట్లాడుకోవటం గమనార్హం.