కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మూడు రోజుల క్రితం కోల్‌కతా వేదికగా తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించినా ఇంకా భారత్‌లోనే ఉంది. గల్ఫ్‌లో ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు దేశాల్లో గగన తలాలు మూసివేయడంతో ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో విమాన సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపేశాయి. వెస్టిండీస్ చేరుకునేందుకు గాను ఆ జట్టు దుబాయ్ మీదుగా వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతానికి అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో విండీస్ జట్టు భారత్‌లోనే ఆగాల్సి వచ్చిందని క్రికెట్ వెస్టిండీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తాము ఐసీసీ, సం బంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, తమ జట్టు భారత్‌లోనే సురక్షితంగా ఉందని వెల్లడించింది.