సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మింట్ కాంపౌండ్‌లో టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఉంది. ఇందులో నాలుగు బ్లాక్‌లు ఉండగా, బీ బ్లాక్‌లో సీఎండీ చాంబర్ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో కొత్త సీఎండీగా జితేష్ వీ పాటిల్ దక్షిణ డిస్కంకు వచ్చారు. గతంలో పనిచేసిన ముషారఫ్ ఫరూఖిని థర్డ్ డిస్కం సీఎండీగా ప్రభుత్వం నియమించింది. థర్డ్ డిస్కంకు ఎక్కడ ఆఫీసు ఉండాలనేది ఇప్పటికీ నిర్ణయం జరగకపోవడంతో రెండు డిస్కంలు ప్రస్తుతం మింట్కాంపౌండ్లోనే కొనసాగుతున్నాయి. అయితే అసలు పంచాయతీ సీఎండీల చాంబర్ల వద్ద జరుగుతోంది. దక్షిణ డిస్కం సీఎండీ చాంబర్లో ప్రస్తుతం కొత్తగా వచ్చిన పాటిల్ కాకుండా థర్డ్ డిస్కం సీఎండీ ముషారఫ్ కూర్చుంటున్నారు. దీంతో గతంలో దక్షిణ డిస్కం సీఎండీ వద్దకు వచ్చే ఉద్యోగులు, ఇతరులంతా చాలా పెద్ద సందిగ్దంలో ఉంటున్నారు.
ప్రస్తుతం మింట్‌కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనే రెండు డిస్కంల సీఎండీల చాంబర్లు కొనసాగుతున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా జితేశ్ వి పాటిల్ గతనెల నియామకం కాగా.. ఇక్కడ సీఎండీగా పనిచేస్తున్న ముషారఫ్ ఫరూఖిని థర్డ్ డిస్కం సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాటిల్‌కు చాంబర్ ఇవ్వకపోవడంపై పెద్ద దుమారం రేగుతోంది. దక్షిణ డిస్కం సీఎండీ చాంబర్ ఇప్పటికే మనుగడలో ఉండగా అక్కడ కొత్తగా ఏర్పాటైన థర్డ్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఉండటం చర్చకు దారితీసింది.
బదిలీ అయినప్పటికీ ముషారఫ్ ఆ చాంబర్‌ను వదలిపెట్టకుండా తన పాత సీటునే అంటిపెట్టుకుని ఉండడమేంటంటూ మింట్ కాంపౌండ్‌లో చర్చ జోరుగా జరుగుతోంది. పాటిల్‌కు మాత్రం కార్పొరేట్ ఆఫీసులోని బీ బ్లాక్‌లో 3వ అంతస్తులో ఒక చాంబర్‌ను కేటాయించారు. ఆయన అక్కడినుంచే తన పాలనావ్యవహారాలు కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన థర్డ్ డిస్కంకు ఇంకా పేరుకూడా ఖరారు కాకపోగా..అందుకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడనుంచి నిర్వహించాలనే విషయంలో విద్యుత్‌శాఖ పెద్దల దగ్గర చర్చ జరిగిందని తెలిసింది.
డిప్యూటీ సీఎం, ఎనర్జీ సెక్రటరీలతో ఎస్పీడీసీఎల్ సీఎండీగా అప్పట్లో ముషారఫ్ కూర్చొని గతంలోనే కొత్త డిస్కంకు ఎక్కడ కేటాయించాలనే దానిపై చర్చించారని, అందులో భాగంగా కార్పొరేట్ ఆఫీసులో ఏ, సీ బ్లాక్‌లు మొత్తం ఎస్పీడీసీఎల్కు, బీ బ్లాక్ మొత్తం థర్డ్ డిస్కంకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బీ బ్లాక్‌లోనే ఉన్న దక్షిణ డిస్కం సీఎండీ చాంబర్‌ను అలాగే కొనసాగిస్తూ దానిని థర్డ్ డిస్కంకు కేటాయించారని ఆఫీసు ఉద్యోగులు చెబుతున్నారు.
డైరెక్టర్ కారణంగానే సీటు పంచాయితీ..!
ఇద్దరు సీఎండీల సీటు పంచాయితీకి పూర్తిగా దక్షిణ డిస్కం డైరెక్టర్ ఒకరు కారణంగా తెలుస్తోంది. విద్యుత్ శాఖలో సీఎండీల చాంబర్లతో పాటు ఇతర కార్యాలయాలకు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుకు కావలసిన సామగ్రి ఏంటనే అంశాలపై సదరు డైరెక్టర్‌కు 15 రోజుల క్రితమే మౌఖికంగా ఆదేశాలు వచ్చాయి. కొత్త సీఎండీలు రాకముందే ఈ పనులు పూర్తిచేసి ఏ, సీ బ్లాక్‌లు పూర్తిగా ఎస్పీడీసీఎల్కు కేటాయించి బీ బ్లాక్‌లో కొత్త డిస్కంలో నియమితులయ్యే అధికారులకు చాంబర్ల ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే డైరెక్టర్ చేస్తున్న ఆలస్యం కారణంగా ఈ పంచాయితీ మొదలైంది. సీఎండీ చాంబర్ ఏర్పాటును పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారికి బాస్‌గా ఉన్న ఈ డైరెక్టర్ గతంలో తనను కీలక బాధ్యతల నుంచి తప్పించారన్న కోపంతో కొత్త, పాత డిస్కంల సీఎండీల మధ్య గొడవ పెట్టడానికే ఇలా చేస్తున్నారంటూ మింట్ కాంపౌండ్‌లో మాట్లాడుకుంటున్నారు.
తాను బదిలీ అయినప్పటికీ…!
ఇదిలా ఉంటే సీఎండీల బదిలీలు జరిగిన తర్వాత దక్షిణ డిస్కంలో ట్రాన్స్ఫర్స్ జరగడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. అదికూడా పాత సీఎండీ ముషారఫ్ పేరుతో వ్యక్తిగత ఆర్డర్లు రావడంతో దీని వెనక ఏం జరిగిందంటూ, ఈ వ్యవహారంలో ఎన్ని లకారాలు చేతులు మారాయోనంటూ మింట్‌లో చర్చించుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా చేయాల్సినవి మినహాయిస్తే ఆఫ్‌లైన్‌లో చేయదగిన పనులన్నింటినీ ఇంకా పాతతేదీల్లోనే చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు పాత సీఎండీ తాను బదిలీ అయిన తర్వాత చేసిన బదిలీల విషయంలో సాంకేతికంగా చాలా అంశాలు ఈ బదిలీలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఒక సీనియర్ ఇంజనీర్ చెప్పారు.
బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ..
సికింద్రాబాద్ కన్స్ట్రక్షన్ డీఈగా గతనెల 28వ తేదీన జయరాములు రిటైరయ్యారు. అక్కడ డీఈ సర్వీసులో ఉండగానే 26వ తేదీతో మరో డీఈ చంద్రశేఖర్‌కు పోస్టింగ్ ఇచ్చారు. బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ సీఎండీ బదిలీతో ఆగమేఘాల మీద పాత తేదీతో ఉత్వర్వులివ్వడం వివాదాస్పదమైంది. కొత్త సీఎండీ చేయాల్సిన బదిలీలను పాతసీఎండీతో చేయిస్తున్నారంటూ హెచ్ఆర్ విభాగంపై విమర్శలు వస్తున్నాయి. వివిధ కంపెనీల, అపార్ట్మెంట్ల, వెంచర్లకు సంబంధించిన ఫైల్స్‌ను కూడా పాత తేదీలతో క్లియర్ చేస్తున్నారంటూ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగులంతా చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరిలోనే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని సీఎండీ ముషారఫ్ ప్రయత్నించినా విద్యుత్ ఉద్యోగులందరూ ధర్నా చేయడంతో అవి ఆగిపోయాయి.
తిరిగి జూన్, జూలైలలో చేస్తామని చెప్పినప్పటికీ సీఎండీల బదిలీలు జరగగానే కొత్త సీఎండీకి చెప్పకుండానే పాత సీఎండీ హెచ్ఆర్ విభాగం చేసిన సూచనల మేరకు ఈ బదిలీలకు తెరదీశారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తాము కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ బదిలీలు చేపట్టామని, గతనెల 25నే స్పౌజ్కేసెస్, హెల్త్ గ్రౌండ్స్ వంటి ప్రత్యేక పరిస్థితులు కలిగిన ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ చేసినట్లు డిస్కం పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కౌన్సిలింగ్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా దాదాపు ఎనిమిదిమంది కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలు చేశామని, అవి కూడా మొత్తం నాన్‌లోకల్ పోస్టులేనని చెప్పినప్పటికీ.. సికింద్రాబాద్ కన్స్ట్రక్షన్ డీఈ బదిలీపై రాద్దాంతం జరుగుతోంది.