హనుమకొండ, మార్చి 3 : వేసవి ఆరంభంలోనే విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరెంటు వినియోగం భారీగా పెరుగుతున్నది. చలికాలం ముగిసి ఎండలు ఎక్కువవుతుండడంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు తదితర గృహ వినియోగ పరికరాల వినియోగం అధికం కావడంతో డిమాండ్ సైతం గణనీయంగా పెరిగింది. దీంతో టీజీఎన్పీడీసీఎల్ చరిత్రలో మంగళవారం అత్యధిక స్థాయిలో 6,441 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే ఎండల తీవ్రత ప్రారంభమవడంతో వినియోగం పెరిగిందని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎసీలు, గ్రామాల్లో గృహ, సాగు మోటర్ల వినియోగంతో పాటు పరిశ్రమల కార్యకలాపాలు కూడా డిమాండ్ పెరుగుదలకు కారణమవుతున్నాయి.
మరింత పెరిగే అవకాశం..
రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకావం ఉంది. అయితే సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌ను తట్టుకునేందుకు ఇప్పటికే సీఎండీ వరుణ్‌రెడ్డి అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. అలాగే ఆయా సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు వేసవి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సబ్ స్టేషన్లలో లోడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయడంతో పాటు సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫీడర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడమే కాకుండా ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఫీడర్లలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లను సైతం వేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ సేవలను మరింత బలోపేతం చేసినట్లు పేరొన్నారు.
సరికొత్త రికార్డు..
ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డు నమోదైంది. గత ఏడాది మార్చి 11న 5,816 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఉండగా, ఈసారి ఫిబ్రవరి 28వ తేదీనే 6,057 మెగావాట్లుగా నమోదైంది. అలాగే గత రెండు మూడు రోజులుగా ఇది మరింత పెరుగుతున్నది. మార్చి 1న 6,267, 2న 6,273, మంగళవారం 6,441మెగావాట్ల విద్యుత్ డిమాండ్ చేరుకుంది.
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా
ప్రస్తుత వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచే గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున సంస్థ, యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.
-కర్నాటి వరుణ్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ
