Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన అంటూనే కాంగ్రెస్ సర్కారు తన వైఫల్యాలపై అదే ప్రజలు అడిగే ప్రశ్నలకు బెదురుతున్నది. బదులుచెప్పే ధైర్యంలేక అడ్డదారిలో పోలీసులతో ‘ఎఫ్ఐఆర్’ ఫైల్ చేయిస్తున్నది. ప్రజాస్వామిక హక్కుల కోసం గొంతెత్తేవారిని వేధిస్తూ పోలీసు పాలన సాగిస్తున్నది. సోషల్‌మీడియా యాక్టివిస్టులపై అడ్డగోలుగా కేసులు బనాయిస్తున్నది. అదునుచూసి అరెస్టు చేయిస్తున్నది. ప్రజలు తమ ఆవేదన వెళ్లగక్కినా.. ఎవరైనా వెలుగులోకి తెచ్చినా.. వాటిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా.. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినా కేసులు పెట్టిస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి సామాన్య ప్రజలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ప్రశ్నించేవారిని ఎవ్వరినీ వదలడం లేదు. అదును దొరికితే చాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులూ వెనుకాడటం లేదు.
ముందే కేసులకు సిద్ధమై..
ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరై ప్రజల తరఫున అధికారపార్టీ నాయకులను ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టేందుకు ముందే సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు పెట్టారు. హైదరాబాద్‌లో తమను కిడ్నాప్ చేసేందుకు కొందరు యత్నించారని ఫిర్యాదు చేసేందుకువెళ్లిన పీర్జాదిగూడ మాజీ మేయర్, బీఆర్ఎస్ నాయకుడు జక్కా వెంకట్‌రెడ్డితోపాటు పదిమందిపై ఉల్టా కేసులు నమోదు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలంటూ ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై కేసు పెట్టారు. తప్పుడు పత్రాలతో స్థలం కబ్జా చేయడానికి యత్నించారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దంపతులపై రాజకీయ ప్రోద్బలంతో ఘట్కేసర్ ఐటీ కారిడార్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై జనగామలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
2023 నవంబర్ 30న కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తే 2024 జూన్ 3న 188, 130 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పినట్టుగా పోలీసులు ఆడుతున్నారనే విమర్శలు నిజమని స్పష్టమవుతున్నది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులపై అక్రమంగా కేసులు బనాయించారు. పెద్దపల్లి జిల్లాలో సల్వాజీ మాధవరావు అనే బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతలు నాలుగు సార్లు దాడులు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు నిర్వహించారన్న కాంగ్రెస్ ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.
ఆయన నెత్తుటి గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. నారాయణపేటలో ఎమ్మెల్యే ఎవరో తెలియడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ఇర్ఫాన్‌పై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్ట్ పెట్టారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్పై సోషల్ మీడియాలో మార్ఫిం గ్ వీడియోలు పోస్ట్ చేశారని నర్సింహులపేట లో గుగులోత్ హచ్చు, చిదిమిళ్ల యుగంధర్, గుగులోత్ లక్పతి, వాంకుడోత్ అశోక్, సుమంత్‌పై కేసులు నమోదయ్యాయి.
యాక్టివిస్టులే టార్గెట్‌గా కేసులు
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉం టూ, ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్న వారినే ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ‘ఎక్స్‌లో కొణతం దిలీప్ ఓ పోస్టు పెట్టారు.. చర్యలు తీసుకోగలరు’ అనే రెండు పదాలను ఫిర్యాదులో ఓ కాంగ్రెస్ నాయకుడు రాస్తే దానిపై ఎలాంటి విచారణ చేయకుండానే దిలీప్‌పై కేసు నమోదు చేశారు. కొణతం దిలీప్‌పై ప్రస్తుతం 12 కేసులు నమోదయ్యాయి. ఇక బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై నమోదైన 10కి పైగా కేసుల్లో సోషల్ మీడియావే 3 ఉన్నాయి. మరో సోషల్ మీడియా యాక్టివిస్టు గౌతమ్ పోతగోనిపై 8 కేసులు, అశోక్‌రెడ్డిపై 3 కేసులు.. నల్లబాలు అనే అకౌంట్ మీద మరో 3 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల బండి సంజయ్ ఫిర్యాదు మేరకు నలుగురు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసు నమోదు చేశారు.
తినే పళ్లెం తీసేసి..
2025 మార్చి 19.. మధ్యాహ్నం పొలానికి వెళ్లొచ్చిన 77 ఏండ్ల వృద్ధ దంపతులు అప్పుడే అన్నం తినేందుకు ఇంట్లో కూర్చున్నారు. కష్టసుఖాలు పంచుకుంటూ తలో ముద్ద తింటున్నారు. అంతలోనే ‘ఏయ్ వెంకటయ్యా.. ఇటురా.. లెవ్.. నువ్వేనా సీఎంను తిట్టింది’ అంటూ వచ్చీ రాగానే తినే పళ్లాన్ని పక్కకు నెట్టి అత్యంత దారుణంగా రెక్కలు మడిచి వాహనంలో వేసుకొని పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఆ బాధిత వృద్ధుడి పేరు దర్శనం వెంకటయ్య. పేద, దళిత రైతు. మహబూబాబాద్ జిల్లా, ఇనుగుర్తి మండలం, చిన్నముప్పారం గ్రామం. అతనికి మూడెకరాల అసైన్డ్ భూమి ఉండేది.
అందులోనే వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడు. ఆ భూమిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లాక్కున్నది. ఆ భూమిని తనకు తిరిగి ఇప్పించాలని మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అధికారులకు గోడు వెళ్లబోసుకున్నాడు. హైదరాబాద్‌కు వచ్చిపోతున్న క్రమంలో ఓ యూట్యూబ్ చానల్లో రేవంత్ సర్కారు తీరుపై వెంకటయ్య మండిపడ్డాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కడుపుమండి వెంకటయ్య మాట్లాడిన మాటలు ఈ ప్రభుత్వానికి నచ్చలేదు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.