హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తున్నదని, నిధుల వాటాలో కోత విధిస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి గంటసేపు గొంతు చించుకొని మాట్లాడారు. కానీ, ఎకడా కూడా, కనీసం పొరపాటున అయినా ‘ప్రధాని మోదీ’ పేరుగానీ, బీజేపీ పేరుగానీ ఉచ్ఛరించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఆ పథకం పేరు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ) చట్టంగా కేంద్రంలోని మోదీ సర్కారు మార్చింది. గతంలో నిధుల వాటా 90:100 నిష్పత్తిలో ఉండగా, దానిని 60:40 నిష్పత్తికి మార్చింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా అధినాయకత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టాల్సిన రేవంత్రెడ్డి.. ప్రధాని మోదీ పేరు, బీజేపీ పేరు అసలే ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చ సంద ర్భంగా ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి సుమారు గంటపాటు చేసిన ప్రసంగంలో ఎకడా మోదీ ఊసెత్తలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక వ్యవస్థగా విమర్శించారే తప్ప, ఆ నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ శక్తిని పేరు పెట్టి విమర్శించడానికి ఆయన వెనుకాడటంపై ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రసంగంలో యూపీఏ హయాం నాటి గొప్పదనాన్ని కీర్తించిన ముఖ్యమంత్రి.. ప్రస్తుత మార్పులు పేదల పాలిట శాపంగా మారాయని అభివర్ణించారు. మహాత్మాగాంధీ పేరు తీసేయడం అన్యాయమని వాపోయారు. దీని వెనుక ఆర్ఎస్ఎస్ భావజాల కుట్ర దాగి ఉన్నదని మాత్రం అనలేకపోయారు. నిధుల వాటా బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటున్నదని విమర్శించారు. కేంద్ర సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనలు మహిళా సాధికారతకు గొడ్డలిపెట్టు అన్నారే తప్ప.. మరుమాట మాట్లాడలేకపోయారు. ఇన్ని విమర్శలు చేసిన రేవంత్.. ఈ మార్పులకు కారణమైన మోదీ సరార్ను లేదా కమలదళాన్ని నేరుగా ఎందుకు నిలదీయలేదు? అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసేటప్పుడు రాజకీయ స్పష్టత ఉండాలి కదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మోదీని పెద్దన్నగా సంబోధించే రేవంత్రెడ్డి.. బీజేపీతో లోపాయికారి ఒ ప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా? అనే అ నుమానాలను విశ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు.
ప్రధాని మోదీకి మైండ్ టెస్ట్ చేయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడం సరికాదని చెప్పారు. దేశంలో అనేకమంది గాంధీ అని పేరు పెట్టుకున్నారని గుర్తుచేశారు.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, ఆ పథకానికి గాంధీజీ పేరును తొలగించరాదని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఉపాధి హామీ పథకంపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. జీ రామ్ జీ చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉన్నదని, దీని వల్ల మహిళా కూలీలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ పథకానికి గతంలో కేంద్రమే వంద శాతం నిధులు ఇచ్చేదని, ఇప్పుడు 125 పనిదినాల్లో 75 రోజులకే కేంద్రం నిధులు ఇస్తుందని, మిగిలిన 50 రోజుల నిధుల భారం రాష్ట్రంపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.