సంగారెడ్డి, ఏప్రిల్ 9 ( నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది సాగుభాష అయితే, సీఎం రేవంత్‌రెడ్డిది సావు భాష అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో కేసీఆర్ పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, నీటి తీరువా రద్దు గురించి మాట్లాడి తక్షణ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పేగులు మెడలో వేసుకుంటా, సంపుత, తొక్కుత, బట్టలూడదీస్త.. అంటూ సావు భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఆదర్శ్‌రెడ్డి బుధవారం రామచంద్రాపురంలోని తన నివాసం నుంచి పటాన్చెరు మండలం గణేశ్‌గడ్డ సిద్ధివినాయక ఆలయం వరకు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ పని అయిపోయిందని, ఆ పార్టీ అగ్రనేతలైన సోనియా, రాహుల్‌గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం బీసీ ధర్నాకు రాహుల్‌ను రేవంత్ రప్పించలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేయటం ఇంకా గమ్మత్తైన విషయమని పేర్కొన్నారు. సీఎం, హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి కేసులు పెడితే భట్టి విక్రమార్క కేసులు ఎత్తివేయడం చూస్తే విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టారని భట్టి విక్రమార్క హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయమన్నాడని, తప్పుడు కేసులు పెట్టినందుకు సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాడు తెలంగాణను నిలబెటితే, నేడు రేవంత్ పడగొట్టిండని హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి కాంగ్రెస్‌కు అప్పగించారని, రేవంత్‌రెడ్డి తన అసమర్థ పాలనతో తెలంగాణను తిరోగమనం వైపు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో జీఎస్టీ గ్రోత్‌రేట్ 12 శాతం ఉంటే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో 5శాతానికి చేరుకుందని విమర్శించారు. ఇలా రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని తెలిపారు. ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనలను కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్క తుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంగారెడ్డిజిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి మాట్లాడుతూ కేసీఆర్ తన హయాంలో తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చిదిద్దినట్టు చెప్పారు. తెలంగాణలో ఒక్కొక్క సమస్యను పరిష్కరించి రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు కేసీఆర్ నడిపించారని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నదని, ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, మెట్టుకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.