హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): వేదిక ఏదైనా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు, అర్ధసత్యాలు, మొండి మాటలు, తొండి కూతలను వీడటం లేదు. పంద్రాగస్టు ప్రసంగంలోనూ అవే పచ్చి అబద్ధాలను వల్లెవేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 16 పేజీల ప్రసంగం లో పాత అబద్ధాలనే చదివారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.8 లక్షల కోట్లే అప్పు చేసిందని తాజాగా పార్లమెంట్ లిఖిపూర్వకంగా సమాధానం ఇచ్చినా, రూ.8.21 లక్ష ల కోట్ల అప్పు చేశారని రేవంత్ మళ్లీ బుకాయించారు. రైతుల పథకాల అమలు, బీసీల రిజర్వేషన్, కుల గణన, ఉద్యోగాల కల్పన, హైడ్రా అంశాల్లోనూ అబద్ధాలే చెప్పారు.
రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధం: మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8 లక్షల 21 వేల 651 కోట్ల రూపాయలను అప్పులు, బకాయిలుగా మిగిల్చి వెళ్లారు. ఇందులో రూ.6 లక్షల 71 వేల 757 కోట్ల అప్పులున్నాయి. ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.40 వేల 154 కోట్లున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్తు ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ. లక్ష 9 వేల 740 కోట్లున్నాయి.
వాస్తవం: ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ వాటాగా వచ్చిన అప్పు రూ.70 వేల కోట్లు. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో చేసిన అప్పు అక్షరాలా రూ.2.8 లక్షల కోట్లు. ఈ విషయాన్ని ఇటీవలే పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన ఆస్తుల విలువ రూ.4.16 లక్షల కోట్లు అని కూడా పార్లమెంట్‌కు తెలిపారు. చేసిన అప్పుతో కేసీఆర్ ప్రాజెక్టులు, సచివాలయం, కలెక్టరేట్లు కట్టించారు.
రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధం: ‘కుల గణనతో బలహీనవర్గాల వందేండ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న శాసన సభ ఆమోదించింది. బిల్లుపై ఏడాదిపాటు శాస్త్రీయమైన, లోతైన కసరత్తు చేశాం. 1.12 కోట్ల కుటుంబాలను సర్వే చేశాం.
వాస్తవం: కులగణనకు చట్టబద్ధత లేదు. అది చెల్లదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదు. ఈ అంశం సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నది. నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీలను ఉపవర్గీకరణ చేసుకోవచ్చని, రాష్ర్టాలకు ఆ అధికారం ఉన్నదని తీర్పునిచ్చింది. తాజా జనాభా లెక్కలు కాకుండా 2011 నాటి ఎస్సీ జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి మమ అనిపించారు. కులగణన సక్రమంగా ఉంటే కులగణన గణాంకాలు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదమే లభించలేదు.
మరి రిజర్వేషన్ ఎక్కడ అమలుచేసినట్టు?
రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధం: రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద జూన్ 16 నుంచి 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల 70 లక్షల 11 వేల 184 మంది రైతుల ఖాతా ల్లో వేశాం. సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నాం.
వాస్తవం: ప్రభుత్వ లెక్కల ప్రకారమే మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. కానీ, రూ.20 వేల కోట్ల పైచిలుకే అయింది. ఇంకా రూ.10 వేల కోట్ల పైచిలుకు రుణమఫీ చేయాలి. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా పథకం కింద ఇస్తామని హామీ ఇచ్చి ఎకరాకు రూ.12 వేల చొప్పునే వేశారు. ఇందులో ఒక వానకాలం రైతుభరోసా ఎగ్గొట్టారు. గత వేసవిలో కేవలం కొంతమందికి ఇచ్చారు. సన్నాలకు బోనస్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇంకా రూ.1,200 కోట్లు రైతులకు బోనస్ బాకీ ఉన్నది. మూడు నెలలైనా కాంగ్రెస్ సర్కారు చెల్లించడం లేదు.
రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధం: 20 నెలల్లో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీచేశాం. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అత్యంత పారదర్శకతతో, వివాదరహితంగా, వేగంగా వ్యవహరించి నియామక పత్రాలు అందించాం. గ్రూప్-1, 2, 3.., డీఎస్సీ పరీక్షలను నిర్వహించాం. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టించాం.
వాస్తవం: రేవంత్‌రెడ్డి చెప్పిన 60 వేల ఉద్యోగాల్లో 5-6 వేలు మినహా అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. కాంగ్రెస్ హయాంలో కేవలం నియామకపత్రాలు అందించి 60 వేల ఉద్యోగాలిచ్చినట్టు బిల్డప్ కొడుతున్నది. 6,000 డీఎస్సీ పోస్టులకు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానిని కాంగ్రెస్ సర్కారు రద్దుచేసి అదనంగా 5,000 పోస్టులు జోడించింది. బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించడం, కొన్నింటి ఫలితాల ప్రకటన కూడా జరిగింది. కాంగ్రెస్ వచ్చి కేవలం నియామకపత్రాలు అందించింది. ప్రైవేటులో లక్షల ఉద్యోగాల కల్పన ఆ దేవుడికే తెలియాలి. కొత్త పెట్టుబడులు రాకుండా, కొత్త పరిశ్రమలు ఏర్పడకుండా లక్షల ప్రైవేటు ఉద్యోగులు వస్తయా?
రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధం: బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నమవుతున్నాయి. ఆ దుస్థితి హైదరాబాద్‌కు రావద్దని, చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలనే ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చాం. 13 పార్కులు, 20 సరస్సులను హైడ్రా కాపాడింది. రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించింది. ఎంత భారీ వర్షం పడినా ట్రాఫిక్ సమస్యను త్వరగా పరిష్కరించి వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పనిచేస్తున్నది.
వాస్తవం: బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరుతో పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గంచెరువు ఎఫ్టీఎల్లో ఉన్నా హైడ్రా దాని జోలికి వెళ్లడం లేదు. కాంగ్రెస్ నేతల ఇండ్లు, విల్లాలు చెరువుల్లో ఉన్నా పట్టించుకోదు. హైదరాబాద్‌లో గంట వాన పడితే రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. ఆఫీసు నుంచి ఐదు గంటలకు బయలుదేరిన ఉద్యోగులు అర్ధరాత్రి వరకు కూడా ఇంటికి చేరలేని దుస్థితి నగరంలో దాపురించింది.