హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): అవకాశం దొరికిన ప్రతిసారీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావుపై బూతులు కురిపించే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చివరికి అసెంబ్లీలోనూ తన తీరు మార్చుకోలేదు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభలోనూ బజారు భాష వాడారు. దురుసు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దిగజారుడు వ్యాఖ్యలు, పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగడం, అక్కసు వెళ్లగక్కిన తీరు రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామిక వాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ ప్రక్షాళనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు మాటలు, అవాస్తవాలు, కట్టుకథలతో సుదీర్ఘ ప్రసంగం చేయడం, ఇష్టారీతిన మాట్లాడటాన్ని చూసి ప్రజలు సైతం అసహ్యించుకుంటున్నారు.
బుల్డోజర్లను అడ్డుకుంటాం
శుక్రవారం ఉదయం శాసనసభలో క్వశ్చన్ అవర్‌లో మూసీ పునర్వవ్యస్థీకరణ ప్రాజెక్టుపై అధికార, మిత్రపక్ష, ప్రతిపక్ష సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు సైతం పలు ప్రశ్నలు అడిగారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా పేర్కొనడం, పరిహారం వివరాలు, గోదావరి నీళ్లను ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పేదల ఇండ్లు కూల్చవద్దని, మొండిగా వ్యవహరిస్తే బుల్డోజర్లను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
మొన్న నమస్కారం.. నేడు మరిచిన సంస్కారం
మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల సభకు హాజరుకాగా, సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఐదురోజులు తిరగకముందే సంస్కారం మరిచారు. ప్రతిపక్ష నేతకు గౌరవమిస్తామని, మాట్లాడినంత సమయం ఇస్తామని చెప్పిన సీఎం, మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. హరీశ్‌రావు లెవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూటిగా సమాధానాలు ఇవ్వాల్సిందిపోయి అసత్యాలు, అడ్డగోలు వాదనలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తామని తాను ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని సభ సాక్షిగా అసత్యాలు పలికారు. డీపీఆర్ ఫైనల్ చేశారా? నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అని ప్రతిపక్ష సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలకు ప్రజలను తప్పుదోవపట్టించేలా సమాధానం ఇచ్చారు. నదీ మార్గంలో షాపింగ్‌మాల్స్ కడతామని, నైట్ బజార్లు ఏర్పాటు చేస్తామని, రియల్ ఎస్టేట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంచనా వ్యయంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేశారు. గోదావరి నీటిని ఎక్కడి నుంచి తరలిస్తారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ప్రతిపక్ష సభ్యులపై అక్కసు వెళ్లగక్కారు. మూసీలోని విషం కంటే ప్రతిపక్ష సభ్యుల కడుపులోని విషం ఎక్కువని, వారి చూపు మంచిదికాదని, అయినా కండ్లద్దాల మాటున దాచుకుంటున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఫాంహౌస్‌లు కట్టుకున్నారని నిందారోపణలు చేశారు.
సభ సాక్షిగా బీజేపీకి వంత
కేంద్రంలోని బీజేపీ పెద్దలకు వత్తాసు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, శాసససభలోనూ వంత పాడారు. గుజరాత్లో చేపట్టిన సబర్మతీ రిజర్వాయర్, ఉత్తరప్రదేశ్‌లో తలపెట్టిన గంగానదీ ప్రక్షాళన, ఢిల్లీలో ఆ పార్టీ ఇచ్చిన యమునా నదీ ప్రక్షాళన హామీని సమర్థించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులు గొప్పవని, తమ పార్టీ ఏనాడూ వ్యతిరేకించలేదంటూ కమలం పార్టీని ఆకాశానికెత్తారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డిఫెన్స్ భూములు ఇచ్చేందుకు అంగీకరించారని, ఇప్పటికే 55 ఎకరాలు అప్పగించేందుకు సిద్ధం అయ్యాయని, మరో 50 ఎకరాలు సైతం ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. సబర్మతీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మైత్రిని రేవంత్‌రెడ్డి బయటపెట్టారని అంటున్నారు.
స్పీకర్ వైఖరిపై విమర్శలు
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సుమారు గంటపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేసినా స్పీకర్ వారించకపోవడం చర్చనీయాంశమైంది. రూల్స్‌కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్‌లో గంటపాటు ఒకే అంశంపై ప్రసంగించినా అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సభ్యుల హక్కులు కాపాడాల్సిన శాసనసభాపతి అనుచిత వ్యాఖ్యలు చేసినా సీఎంను వారించకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక దశలో ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వబోనని కుండబద్దలు కొట్టిన తీరు చూసి ప్రజాస్వామిక వాదులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇరుపక్షాల హక్కులు కాపాడాల్సిన స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడం, సీఎం పేరెత్తిన వెంటనే మైక్ కట్ చేసిన తీరుపై మండిపడుతున్నారు. దీంతో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే త మ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ సభ్యు లు సభ నుంచి బయటకు వచ్చారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రతిపక్ష సభ్యులపై వివక్ష చూపుతున్నారంటూ తప్పుబడుతున్నారు.