Revanth Reddy | వికారాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేశారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సన్నాహక సమావేశాల్లో పలు అంశాలపై అర్థంలేని ఆరోపణలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాదని.. కృష్ణానదీ జలాలు ఇప్పట్లో రావని, ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి రాష్ర్టాన్ని సాధించినా ఇప్పటికీ తెలంగాణలో నీళ్లు రావడంలేదని అబద్ధాలు పలికారు. అయితే రెండేండ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుండడం, అన్నదాతల కండ్లల్లో ఆనందం పీసీసీ అధ్యక్షుడికి కనిపించకపోవడం గమనార్హం. అదేవిధంగా ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా సాగునీరందించడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ ముందు నుంచి చెప్పడంతోపాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకురావడంతోపాటు పనులను ముమ్మరం చేసిన సమయంలోనే కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారు. ఆ కేసులతో గత కొన్నేండ్లుగా ఆ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయన్న వాస్తవాలను దాచిపెట్టిన రేవంత్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
అయితే వాస్తవానికి ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించడం అసాధ్యమని తెలిసినా అప్పటి కాంగ్రెస్ పాలకులకు ఇక్కడి ఆ పార్టీ నేతలు చెప్పక ఆ ప్రాజెక్టు నిర్మాణం పేరిట జేబులు నింపుకొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుతో ఏండ్లు గడిచినా చుక్క సాగునీరు జిల్లాకు రాకపోయినా కాం గ్రెస్ నేతలు రూ. కోట్లలో అవినీతికి పాల్పడిన విషయాలను రేవంత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రాణహిత- ప్రాజెక్టును ప్రారంభించిన ఎనిమిదేండ్లకాలంలో ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు ప్యాకేజీల్లో కేవలం ఒక్క ప్యాకేజీలో మాత్రమే రూ. 26 కోట్ల పనులు జరుగడం గమనార్హం. ఈ ప్రాజెక్టుతో జిల్లాకు ఎక్కువ దూరం నుంచి నీరు రావాల్సి ఉందని, అధిక లిఫ్టులతో అధిక మోటర్లు ఎత్తిపోస్తేనే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరు వస్తుందని.. ఇందుకు ఎక్కువ కాలం పడుతుందని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.
అయితే ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 695 కిలోమీటర్ల దూరంతో నీరు వస్తుంది…అదే పాలమూరు ఎత్తిపోతల పథకంతో 130 కిలోమీటర్ల దూరంతోనే జిల్లాకు నీటిని తీసుకు రావొచ్చు. ప్రాణహిత ప్రాజెక్టుతో సాగునీరందించడం సాధ్యం కాదని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టుకు అప్పటి పాలకులు మొత్తం రూ. 194 కోట్లను విడుదల చేయగా, కేవలం రూ.26 కోట్ల పనే జరిగిందని, మిగతా రూ.164 కోట్లను సర్వే, మొబిలైజేషన్ పేరుతో గత పాలకులు జేబులు నింపుకోవడం గమనార్హం. ప్రాణహిత ప్రాజెక్టుకు 23, 24, 25, 26 ప్యాకేజీల నిర్మాణానికి రూ.4200 కోట్లకు టెండర్లు పిలువగా, 23వ ప్యాకేజీ కింద మాత్రమే రూ.26 కోట్ల పని జరిగిందని, మిగతా ప్యాకేజీల్లో ఒక్క పైసా పని కూడా జరుగకున్నా కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు సమాచారం. అంతేకాకుండా 2008లో ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కూడా ఒక్క ఎకరమైనా భూ సేకరణ చేయకపోవడం గమనార్హం.
శరవేగంగా సాగుతున్న పాలమూరు ప్రాజెక్టు పనులు
జిల్లాకు తాగు, సాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగు, సాగు నీరందించనున్నారు. అయితే తాగునీటిని అందించే పనులు వేగంగా జరుగుతుండగా.. రెండో దశ పనులకు కేంద్రం పర్యావరణ అనుమతులివ్వడంతో సాగునీటిని అందించే పనుల్లోనూ వేగం పుంజుకున్నది. ఇప్పటికే ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరందించేందుకు కాలువల నిర్మాణానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగు, సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువల తవ్వకం పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5180 కోట్ల మేర మంజూరు చేసింది.
ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగునీటిని అందించేందుకు 100 కిలోమీటర్ల మేర కాలువలను నిర్మించనున్నారు. కాలువల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1000 చెరువులను నీటితో నింపడంతోపాటు జిల్లాలోని 912 హబిటేషన్లకు తాగునీటిని అందించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అయితే 2015లోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా, ఏపీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేయడంతో పనులు నిలిచిపోయాయి. ఇటీవల తాగునీటికి సంబంధించిన పనులను చేపట్టేం దుకు సుప్రీంకోర్టు అనుమతులివ్వడంతో పనులు జోరందుకోగా, తాజాగా సాగునీటి పనులు చేపట్టకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసుకు సంబంధించి ఈఏసీ పరిశీలన అనంతరం పర్యావరణ అనుమతుల జారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన దృష్ట్యా సాగునీటిని అందించే పనులు కూడా జోరందుకున్నాయి.