హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యనేత పేరుకే విదేశాల్లో ఉన్నా.. మనసంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచే మంత్రివర్గ సహచరులపై నిఘా పెట్టారన్న చర్చ జరుగుతున్నది. మంత్రుల కదలికలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, ఏ మంత్రి ఎక్కడికి వెళ్తున్నారు? ఎవర్ని కలుస్తున్నారు? రాజకీయ పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా? వంటి అంశాలపై నిరంతరం ఆరా తీస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు మంత్రులు సైతం ‘ఆయన పేరుకే అమెరికాలో ఉన్నా.. మాపై ఓ కన్నేసి ఉంచుతున్నాడు. ఆయన మనసంతా సచివాలయం చుట్టే తిరుగుతున్నది’ అంటూ తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.
‘మీరు నిఘా నేత్రంలో ఉన్నారు. మీ ప్రతి కదలిక రికార్డు చేయబడుతున్నది’ సీసీ కెమెరాలు ఉన్నచోట ఇలాంటి హెచ్చరిక బోర్డులను చూస్తుంటాం. ఇప్పుడు మంత్రుల పరిస్థితి ఇలాగే ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వాస్తవానికి మంత్రులు ఇతరులపై నిఘా పెడుతుంటారు. కానీ, ఇందుకు విరుద్ధంగా ప్రతి మంత్రినీ ముఖ్యనేత నిఘా నేత్రంలో బంధించినట్టు ప్రచారంలో ఉన్నది.
ఆయన ప్రతిసారీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలా ప్రత్యేకంగా నిఘాకు ప్రణాళిక రూపొందిస్తారని చెప్తున్నారు. ఈసారి కూడా ఏ మంత్రి వద్ద ఎవర్ని పెట్టాలనేది ముందే నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు తన సొంత మనుషులను కూడా ఈ నిఘా టీమ్‌లో సభ్యులుగా చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా మంత్రుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వ్యవస్థ ద్వారా సమాచారాన్ని ముఖ్యనేతకు చేరవేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యనేత, మంత్రుల మధ్య సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా పలువురు సీనియర్ మంత్రులతో ముఖ్యనేతకు పొసగడం లేదనేది తరచూ బయటపడుతున్న గొడవలతో రుజువు అవుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి రావడం ముఖ్యనేతకు సవాల్‌గా మారిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. దీంతో ముఖ్యనేత అభద్రతా భావానికి లోనయ్యారని చెప్తున్నాయి.
అందుకే పలువురు మంత్రులపై అనుమానం పెట్టుకున్నారని తెలిసింది. గతంలో సీఎంల విదేశీ పర్యటనల సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తుకుతెచ్చుకుని ఆందోళనకు గురైనట్టు సమాచారం. అందుకే తాను విదేశీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ, ఇతర అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సీఎం, పీఎం స్థాయి వ్యక్తులు ఎక్కువ రోజులు విదేశీ పర్యటనలు పెట్టుకోరు. మహా అ యితే రెండు, మూడు లేదంటే నాలుగు రోజుల్లో తి రిగి వచ్చేస్తారు. కానీ, ముఖ్యనేత ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లో
పర్యటిస్తున్నారు.
సాధారణంగా సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పు డు ప్రభుత్వ బాధ్యతలను హోం మినిస్టర్ లేదా డి ప్యూటీ సీఎం పర్యవేక్షిస్తారు. అయితే, ఇక్కడ హోం శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు. దీంతో ఆ బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వహించాలి. కానీ, ఇక్కడే ముఖ్యనేత ప్రభుత్వ బాధ్యతలను డిప్యూటీ సీఎంకు చేరువకానివ్వకుండా ఎత్తుగడ వేశారనే విమర్శలున్నాయి.
తాను లేనప్పుడు భట్టి మనసులో కొత్త ఆలోచన రాకుండా చేసేందుకు ఆయనను నైని బొగ్గుగని వివాదంలో ఇరికించారని ప్రచారం జరుగుతున్నది. దీనికి తగ్గట్టే బొగ్గు గనికి సంబంధించి ఆరోపణలు, ప్రెస్మీట్లు, రివ్యూలు, కౌంటర్లతోనే సరిపోతున్నది. మరో పోటీదారుగా భావించే బాంబుల మంత్రిని వెంట పెట్టుకొని వెళ్లారని, ఇతర మంత్రుల్లో ఒకరిద్దరిని తాజాగా వివాదాల్లో ఇరికించారని చెప్పుకొంటున్నారు. మిగతావారిపై నిఘా పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.