హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 57వ సారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మీడియాకు ఫొటో విడుదల చేశారు. అధిష్ఠానం వద్ద ఆశీస్సులు తీసుకునేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచిన నవీన్యాదవ్ను ఢిల్లీకి తీసుకెళ్లినట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో సీఎం బృందం చర్చించినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఊపుతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని, ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదని పార్టీ నాయకత్వానికి చెప్పినట్టు తెలిసింది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి బృందం పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్‌ను కూడా రేవంత్‌రెడ్డి బృందం కలిసింది. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.