‘ప్రతీ ఇంటి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఇస్తనన్నవు.. ఏమైంది? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తానన్నవు.. ఎప్పుడిస్తవు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు పంపిణీ చేస్తవు? ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తానని రాహుల్‌గాంధీతోనే చెప్పించినవు కదా… ఆ పథకం ఎప్పుడు మొదలుపెడుతున్నవు? పదేండ్లలో కేసీఆర్ నిర్మాణాలు చేపడితే… 22 నెలల్లో నువ్వు హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నవు! మీ హైడ్రా బుల్డోజర్లకు పేదల ఇండ్లే కనిపిస్తున్నయా? పెద్దోళ్ల జోలికి ఎందుకు పోతలేరు?’
-జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు
‘ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలలుగా ఫైలు ఆయన దగ్గరనే ఉన్నది. కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఎందుకిస్తలేరు కిషన్రెడ్డీ? కాళేశ్వరం కేసు సీబీఐకిస్తే 48 గంటల్లో అరెస్టు చేస్తనన్నరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ రోజు ఈ నెల 11లోపు కేసీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేస్తరా.. కిషన్రెడ్డీ?
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం తేలిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల్లోనే కాంగ్రెస్ చేతులెత్తేసినట్టు తేటతెల్లమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారహోరుకు అధికార పార్టీ తట్టుకోలేకపోతున్నదని అర్థమవుతున్నది. ‘పదేండ్లు మీరేం చేశారో… రెండేండ్లు మేం ఏం చేశామో… జూబ్లీహిల్స్ ప్రజల ముందు తేల్చుకుందాం!’ అని మొన్నటిదాకా సవాల్ చేసిన ముఖ్యమంత్రి మూడు రోజుల కిందట జరిగిన రహమత్‌నగర్ రోడ్‌షోలో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ‘ఆరు గ్యారెంటీల అమలు సంగతేంది? హైడ్రాతో పేదోళ్లకు ఈ గతేంది?’ అంటున్న కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.
అటు తిరిగి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఎప్పుడు అరెస్టు చేస్తారంటూ చర్చను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి… జాతీయ ఒప్పందమో! రేవంత్-కిషన్ మధ్య పరస్పర అవగాహననో!! సీఎం వేసిన ప్రశ్నలకు తెల్లారేసరికి కిషన్‌రెడ్డి ఆగమేఘాల మీద స్పందించారు. ఇక అంతే… రెండు జాతీయ పార్టీలు మిలాఖతై… జూబ్లీహిల్స్‌లోని పేదోళ్లకు అమలు కావాల్సిన పథకాలపై చర్చను గాలికొదిలారు, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నీళ్లొదిలారు. గత 22 నెలలుగా ఏ అంశాలతో రాజకీయ పబ్బం గడుపుకున్నారో సరిగ్గా జూబ్లీహిల్స్ ప్రచార ముగింపు ఘట్టంలోనూ రెండు పార్టీలు అవే అంశాలను ఎజెండాకు ఎత్తుకోవడమంటేనే రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందమేమిటో తేటతెల్లమవుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాదాపు రెండేండ్ల తర్వాత మోగిన నగరా… ఇంకో మూడేండ్ల పాలన ఉన్న తరుణంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. చేసింది చెప్పుకోవడానికి, చేసేది ప్రజల ముందు విప్పడానికి బలమైన వేదిక. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ సారథిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలేమిటి? ఇప్పుడు రాజకీయవర్గాల్లోనే కాదు… జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో ఇదే చర్చ జరుగుతున్నది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆది నుంచి ఒకే విధానం, నినాదంతో ముందుకు పోతున్నది.
ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి రోజు నుంచి పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఒకవైపు చెప్తూనే… మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. హైడ్రాతో పేదల గూడును కూల్చుతున్న రేవంత్ సర్కారును నిలదీస్తున్నారు. కేటీఆర్ రోడ్‌షోల్లో కూడా ఈ రెండు ప్రధానమైన ప్రజల ఎజెండాపైనే మాట్లాడుతున్నారు. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు, ఆరోపణల్లో నిజముందా? అబద్ధముందా? అసలు ప్రభుత్వపరంగా సమాధానమేమిటో సీఎం, మంత్రుల ప్రసంగాల్లో చెప్పాలి. కానీ, దాదాపు రెండు నెలలకుపైగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు… ఇప్పటివరకు అధికారికంగా నాలుగైదు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇవి మినహా మిగిలిన రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతుండటం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలతోపాటు జూబ్లీహిల్స్ జనం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎదురుచూస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్కడా సీఎం, మంత్రులు ఆ ఊసే ఎత్తడం లేదు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సినీ కార్మికుల సన్మానసభలో పాల్గొన్నప్పుడు వారికి ఆర్థికపరమైన హామీ ఇచ్చారు. కానీ, రోడ్‌షోల్లో ఆరు గ్యారెంటీల గురించి ప్రస్తావించడంలేదు. ఉచిత బస్సు ప్రయాణంలాంటి ఒక్క పథకాన్ని మాత్రమే చెప్పుకున్నారు. మిగిలిన ప్రసంగమంతా… కేసీఆర్, కేటీఆర్‌ను దూషించడం తప్ప రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేందేమిటి? రానున్న మూడేండ్లలో ఏం చేయబోతున్నామనేది మాత్రం చెప్పడంలేదని నియోజకవర్గ ప్రజలే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కనీసం రెండు నెలలుగా ముగ్గురు మంత్రులు హడావుడి చేసి రూ.180 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారేగానీ ఆ పనులను ప్రారంభించలేదు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ చేసింది… చేయాల్సింది ఏమీలేకపోవడంతో ఏం చెప్పుకోవాల్నో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇందుకు సీఎం రోడ్‌షోలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మొదటి రోడ్‌షోలో పీజేఆర్‌ను వాడుకున్న రేవంత్‌రెడ్డి… రెండోరోజు కేసీఆర్, మోదీ ఒకటంటూ రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు. ప్రజల్లో స్పందన లేకపోవడంతో ఏ అంశాలను లేవనెత్తుకోవాల్నో కూడా అర్థం కాని పరిస్థితి. రహమత్‌నగర్ రోడ్‌షోలో రూటు మార్చారు. కేటీఆర్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని తేలడంతో ఆరు గ్యారెంటీలు, హైడ్రా అంశాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేసు కేసులను తెరపైకి తెచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు.
ఇందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గంటల వ్యవధిలోనే స్పందించారు. షేక్‌పేట రోడ్‌షోలో సీఎం రేవంత్ ఒకడుగు ముందుకేసి.. ‘కిషన్రెడ్డీ.. నువ్వు నాకు సమాధానం చెప్పడం కాదు… కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను ఎందుకు అరెస్టు చేయడంలేదో మోదీ, అమిత్‌షాతో చర్చించాలి’ అమూ వ్యాఖ్యానించారు. దీంతో అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చర్చ జరగాల్సిన అంశాలేమిటి? ఈ కేసుల అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత 22 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమాన్ని మరిచి కేవలం ఈ కేసులతోనే కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ ప్రభుత్వానికి అండగా నిలిచిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో రాజకీయ పబ్బం కోసం మరోసారి కేసులను తెరపైకి తెచ్చినట్టు స్పష్టమవుతున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.