Kaleshwaram Project | హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరంలో లక్ష కోట్లు మునిగిపోయాయనడం తప్పు. రూ. 94 వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మామ, ఆయన సతీమణి గీత తండ్రి సూదిని పద్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తో తెలంగాణ వస్తదనే నమ్మకం కలగడంతోనే బీఆర్ఎస్ పెట్టిన తొలినాళ్లలో పార్టీలో చేరి కేసీఆర్ వెంట ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక గతంలోలా ఏదో కోల్పోతున్నాం, మనది ఎవరో తీసుకెళ్తున్నారనే బాధ పోయిందని చెప్పారు. తెలంగాణకు సీఎం ఎవరైనా అది తాత్కాలికమేనని, రాష్ట్రం శాశ్వతమని అన్నారు. ఇటీవల ఓ డిజిటల్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు.
తెలంగాణ కావాలనే కోరికతోనే 2001లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరినట్టు సూదిని పద్మారెడ్డి తెలిపారు. తెలంగాణ కోసమే ఆయన వెంట నడిచానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జయశంకర్ సార్‌తో స్ఫూర్తి పొందానని, కేసీఆర్‌తో తెలంగాణ వస్తుందనే నమ్మకం తనకు కలిగిందని చెప్పారు. అయితే, వ్యక్తిగత కారణాలతో 2008 తర్వాత రాజకీయాల నుంచి వైదొలగినట్టు పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణను ఎలా తెచ్చుకోవాలి, ఎలా సాధించుకోవాలనే చర్చ నడిచేదని పద్మారెడ్డి తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలపై పద్మారెడ్డి స్పందిస్తూ.. ప్రస్తుత రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు మునిగాయనడం తప్పని, రూ. 94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగం చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన వివాహం యాదగిరిగుట్టలోనే అయిందని, అప్పటికీ, ఇప్పటికీ అక్కడ భారీ మార్పు వచ్చిందని చెప్పారు. యాదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మన నీళ్లు, నిధులు ఎవరో తీసుకెళ్తున్నారనే ఆందోళన ఉండేదని, రాష్ట్రం సిద్ధించాక ఏదో కోల్పోతున్నామని, మనది ఎవరో తీసుకెళ్తున్నారనే బాధ పోయిందని ఆ ఇంటర్వ్యూలో పద్మారెడ్డి తెలిపారు. మన నిధులు, నియామకాలు, మన నీళ్లు మనమే వాడుకుంటున్నామనే ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణకు సీఎంగా ఎవరున్నా అది తాత్కాలికమేనని, తెలంగాణ శాశ్వతమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు తాను బీఆర్ఎస్లో ఉండగా తన అన్న జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో కీలకంగా ఉండేవారని పద్మారెడ్డి గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ఆయనతో చాలాసార్లు వాదించేవాడినని, తెలంగాణ కోసం ఆయన సరిగ్గా కృషి చేయడం లేదేమోనని అనుమానించేవాడనని పేర్కొన్నారు. అయితే, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అప్పటి ఇబ్బందుల గురించి చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకపోవడం ఇబ్బందిగా ఉందని చెప్పేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వంలోని పార్టీలన్నీ అంగీకరించాలని, అందుకు చాలా ఇబ్బందులు ఉండేవని అన్నారని, కానీ కేసీఆర్ దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో, ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని వివరించారు.
హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుత రాజకీయాలు, అధికారం గురించి పద్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపు కోసం పోటాపోటీగా హామీలు ఇస్తున్నారని, అయితే ఎవరూ వాటిని నిలబెట్టుకునే పరిస్థితి లేదని చెప్పారు. హామీలు ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలపై మాట్లాడుతూ అవి ఎవరు చేసినా సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. రేవంత్, నేను ఇద్దరం కలిసి పనిచేశాం
రేవంత్‌రెడ్డి, తాను బీఆర్ఎస్లో కలిసి పనిచేశామని పద్మారెడ్డి గుర్తుచేసుకున్నారు.
2002లో రేవంత్‌రెడ్డి మహబూబనగర్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారని, 2006 తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని గుర్తుచేసుకున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తా బీజేపీతో సైద్ధాంతికంగా విభేదిస్తానని ఆ ఇంటర్వ్యూలో పద్మారెడ్డి తెలిపారు. ఆ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని, అది తనకు నచ్చదని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్పులు జరపడాన్ని ఆయన ఖండించారు.