హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అదేవిధంగా పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై హైకమాండ్ నుంచి క్లారిటీ తీసుకోనున్నారు. అయితే గత నెల 23న పీసీసీ అధ్యక్షుడితోపాటు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధిష్ఠానంతో చర్చించారు.
అది ఒక కొలిక్కి రాకపోవడంతో మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. అయినా కేబినెట్ విస్తరణపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వెనుతిరిగారు. అయితే రేవంత్.. రాహుల్ గాంధీని కలవాలనుకున్నా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడితో రాహుల్ రెండుసార్లు చర్చలు జరపడం గమనార్హం. పైగా మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్‌ను కలవగా, రేవంత్‌కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసుమంతైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏమిటని గుసగుసలు వినిపించాయి. మరి ఈసారైనా రాహుల్ ఆయనకు సమయం ఇచ్చేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 45వ సారి కావడం గమనార్హం.