హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పోలింగ్‌కు ముందే ఓటమి ఖాయం కావటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నది. ప్రత్యర్థి పార్టీల నేతలను, ముఖ్యంగా అధికార పార్టీ పెద్దలను రాయలేని భాషలో బూతులు తిడుతూ మీడియాలో హైలైట్ కావటానికి రోజురోజుకూ దిగజారుతున్నారు. మొన్నటికి మొన్న ఓయూ విద్యార్థులను తాగుబోతులని, రైతులను బిచ్చగాళ్లని తూలనాడారు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌పై అసభ్యకర భాషలో తిట్లు మొదలుపెట్టారు.
రెండు రోజుల క్రితం మక్తల్ సభలో సీఎం కేసీఆర్‌పై దూషణలపర్వానికి దిగిన ఆయన, కామారెడ్డి సభలో మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు. సీఎం కేసీఆర్‌ను అవమానించేలా రాయలేని భాషలో మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చివరికి ఆయన మాటలను సొంత పార్టీ నేతలు కూడా సమర్థించడం లేదు. ఇలాంటి కుసంస్కారి తమ అధ్యక్షుడు కావడం తమ ఖర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేత తెలంగాణ రాజకీయాలకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.