ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి?
జిల్లాల ఇన్చార్జి మంత్రులపైనే అభ్యర్థుల భారం
స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనన్న సంకేతాలు
పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో
ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం
కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి తత్వం బోధ పడిందా? 18 నెలల పాలనలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని తెలిసే ముఖ్యమంత్రి తెలివిగా వ్యవహరించారా? అందుకే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతల నుంచి తప్పుకొన్నారా? నిధులు, బాధ్యతలన్నీ జిల్లాల ఇన్చార్జి మంత్రుల మీదకే తోసేశారా? అంటే కాంగ్రెస్ శ్రేణులు ‘అవును’ అనే అంటున్నాయి! పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని వేలెత్తి చూపుతున్నాయి.
18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతల నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం నిధులు ఇవ్వడం 3వ పేజీలో
లేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని, ఊర్లలో తిరిగే పరిస్థితి లేదని, ఎమ్మెల్యేలు తేల్చి చెప్పటంతో సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యలను జిల్లా ఇన్చార్జి మంత్రులకు అప్పగించారనే ప్రచారం జరుగుతున్నది. ‘స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్చార్జి మంత్రులదే! నిధులు, బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నయి. జిల్లాల ఇన్చార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదు. ఇది సరికాదు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? వెంటనే జిల్లాల్లో పదవులను భర్తీ చేయండి’ అని సీఎం రేవంత్ చెప్పటంతో ఇన్చార్జి మంత్రులు కంగుతిన్నట్టు తెలిసింది. జిల్లాల్లో స్థానిక మంత్రులను కాదని, తాము ఏం చేయగలమని? మార్కెటింగ్ కమిటీ, టెంపుల్ కమిటీల్లాంటి చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులనే వారు భర్తీ చేయనివ్వడం లేదని, ఎమ్మెల్యేలకు, మంత్రులకు పొసగడం లేదని మధ్యలో స్థానికేతరులం తలదూర్చి ఏం చేయగలమని ఇన్చార్జి మంత్రులు వాపోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేక కాంగ్రెస్ చతికిలపడిన విషయం తెలిసిందే! ఈ స్థానాన్ని మళ్లీ నిలుపుకొనేందుకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పక్కన పెట్టి ఆర్థికంగా స్థితిమంతుడైన, విద్యా వ్యాపారి వూటూరి నరేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది. ఏ ఒక ఓటునూ జారవిడుచుకోవద్దనే లక్ష్యంతో ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. వీరు కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ కార్యవర్గం, ఎన్ఎస్యూఐ నేతలను, పార్టీ కార్యకర్తలను మొత్తం కలిపి 14 వేల మందిని ఎమ్మెల్సీ నియోజకవర్గంలోకి చొప్పించారు.
వీరితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నకలకు ముఖ్యమంత్రి స్థాయిలో కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాలలో బహిరంగ సభలు పెట్టారు. చిట్ట చివరగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయని, ఏం చేసినా కాంగ్రెస్ ఓటమిని ఆపలేకపోయారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ‘ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందని మీరు అనుకుంటేనే మాకు ఓటు వేయండి’ అని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు నివ్వడం వల్లే పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించినట్టు తర్వాత సమీక్షల్లో బయటపడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కీలకమైన మహాలక్ష్మి పథకం అమలు చేయకపోవటంతో మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, హైడ్రా కూల్చివేతల కారణంగా పేదల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మరోవైపు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం రూపాయి కూడా నిధులివ్వ లేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని, ఊర్లలో తిరిగే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అన్నివైపులా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల అభ్యర్థుల బాధ్యతను ఇన్చార్జి మంత్రుల మీదికి నెట్టేసినట్టు తెలిసింది.