Headingley Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. అండర్సన్ – తెండూల్కర్ ట్రోఫీలో హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియా పేసర్లు విఫలమవ్వగా.. 371 పరుగుల లక్ష్యాన్ని స్టోక్స్ సేన అలవోకగా ఛేదించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్(2-51), ప్రసిధ్ కృష్ణ(2-92)లు హడలెత్తించగా.. లంచ్ తర్వాత ఆశలు చిగురించాయి. కానీ, బెన్ డకెట్(149) బజ్ బాల్ విధ్వంసానికి జో రూట్(53 నాటౌట్) సూపర్ ఫిఫ్టీతో రాణించాడు. వికెట్ కీపర్ జోష్ టంగ్(44 నాటౌట్) ధనాధన్ ఆడడంతో స్టోక్స్ సేన సునాయసంగా విక్టరీ కొట్టింది. దాంతో, టీమిండియా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలనుకున్న శుభ్‌మన్ గిల్ సేన ఆశలు ఆవిరయ్యాయి.
రసవత్తరంగా సాగుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపిన హెడింగ్లే టెస్టులో టీమిండియాకు షాకిచ్చింది ఇంగ్లండ్. రెండో ఇన్నింగ్స్‌లో 400 ప్లస్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్న గిల్ సేన.. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. 371 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు కళ్లెం వేయలేకపోయారు భారత పేసర్లు. ఐదో రోజు తొలి సెషన్లో స్టోక్స్ సేన ఆధిపత్యం చెలాయించగా.. రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్లతో చెలరేగారు. లంచ్ తర్వాత ఓపెనర్ జాక్ క్రాలే(65)ను ఔట్ చేసి ప్రసిధ్ కృష్ణ(2-69) తొలి బ్రేక్ ఇవ్వగా.. వరుణుడి బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్(2-25) రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బ తీశాడు.
THE BAZBALL WAY 🔥
Both of England’s highest successful chases in men’s Tests have come under Stokes & McCullum, and both against India! pic.twitter.com/gz49J7o1Np
— ESPNcricinfo (@ESPNcricinfo) June 24, 2025
సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ బెన్ డకెట్(149)ను వెనక్కి పంపిన అతడు.. ఆ తర్వాత హ్యారీ బ్రూక్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే.. బెన్ స్టోక్స్(33 నాటౌట్) వికెట్ కాపాడుకున్నాడు. శార్దూల్ విజృంభణతో 253కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితిలో పడింది. టీ బ్రేక్ సమయానికి స్టోక్స్ సేన 269 పరుగులు చేసింది. అయితే.. ఆఖరి సెషన్లో జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్లకు యత్నించిన స్టోక్స్.. గిల్ చేతికి చిక్కాడు. కానీ, జో రూట్(53 నాటౌట్) మాత్రం పట్టుదలగా వికెట్ కీపర్ జోష్ టంగ్(44 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో అతడు 4, 6, 4 బాదగా ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో శుభ్‌మన్ గిల్(147), రిషభ్ పంత్(134), యశస్వీ జైస్వాల్(101)ల సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 471 రన్స్ చేసింది టీమిండియా. అనంతరం ఓలీ పోప్ శతకానికి.. హ్యారీ బ్రూక్ అర్ధ శతకం తోడవ్వగా ఆతిథ్య జట్టు భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే.. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో స్టోక్స్ సేన నడ్డివిరిచాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(137), రిషభ్ పంత్(118)ల సెంచరీలతో మ్యాచ్‌పై పట్టుబిగించినట్టు కనిపించిన గిల్ సేన.. జోష్ టంగ్ విజృంభణతో ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అలవోకగా 400 రన్స్ కొట్టాల్సిన టీమిండియా.. రాహుల్ వికెట్ కుప్పకూలింది. 31 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు పడడంతో మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లింది.