Middle East crisis : ఇరాన్లో ఇంకా దాదాపు 9,000 మంది భారతీయులు ఉన్నట్లు సూచన. దీంతో వారందరి భద్రతపై ప్రస్తుతం సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులందర్నీ ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ దీనిపై ప్రకటన చేశారు. ఇరాన్లో చిక్కుకున్న 9,000 మంది భారతీయుల్ని వెనక్కి తెచ్చేందుకు భారతీయ సంస్థలు నిరంతరం పని చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఇరాన్లో విద్యార్థులు, నౌకా సిబ్బంది, వ్యాపారస్తులు, యాత్రికులు, ఉపాధి కోసం వెళ్లిన వారు.. ఇలా వివిధ రంగాలకు చెందిన వారు 9,000 మంది ఉన్నారు. ఇప్పటికే వేల మంది ఇండియాకు చేరుకున్నప్పటికీ మిగిలినవారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వారు ఇరాన్ నుంచి బయటపడేందుకు అవసరమైన సాయం చేస్తున్నామని రణధీర్ అన్నారు. నేరుగా ఇండియాకు రాలేనివారు ఇరాన్‌కు దగ్గరగా ఉన్న అజర్బైజాన్, అర్మేనియా ద్వారా ఇండియా రావొచ్చని తెలిపారు. ఈ దేశాల నుంచి ఇండియాకు విమానాలున్నాయని వెల్లడించారు. వీరు ఇరాన్‌ను వీడేందుకు, ఇతర దేశాలకు చేరేందుకు అవసరమైన వీసాల మంజూరు, ఇతర అనుమతులు త్వరగా వచ్చేలా చూస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇరాన్లో ఉన్న విద్యార్థులతోపాటు ఇతర భారతీయ పౌరులకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా రణధీర్ తెలిపారు.
భారతీయ విద్యార్థులతో ఇరాన్ రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, తగిన సమాచారం అందిస్తోందన్నారు. వారి రక్షణ, భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో 2,000 మంది వరకు మరణించి ఉంటారని ఒక అంచనా. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది.