హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ) : మరీ ఇంత దుబారానా? డబ్బులు మంచినీళ్లు లెక్క ఖర్చు చేయడమా? ప్రజాధనం అంటే పట్టింపే లేనట్టున్నది. లేకపోతే.. గేట్ల దగ్గర నీడ కోసం రూ.31లక్షలేంటి, కిటికీ కర్టెన్లకు రూ.33లక్షలేంది.? ఎన్నో గెస్ట్ హౌస్‌లు ఉన్నా మరోకొత్తదానికి మూడున్నర కోట్లకుపైగా వెచ్చించడమేంటి.? మొన్నటికి మొన్ననే ‘కాంగ్రెస్ కుటుంబ ఫుట్‌బాల్ మ్యాచ్’ కోసం వంద కోట్ల ప్రజల సొమ్మును దుబారా చేసిన విషయమై జనం ఛీదరించుకుంటున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అదింకా మరువకముందే కనీసం రెండు రోజులైనా గడువక ముందే మళ్లీ అనవసరపు పనులకు కోట్లకు కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కార్ కేవలం రెండేండ్ల పాలనలో రికార్డు స్థాయిలో సుమారు రూ.3 లక్షల కోట్ల రుణాలు సమీకరించి రాష్ర్టాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన విషయమై రందీతో ఉన్న ప్రజలు, ఇంకా ఇంకా వృథా ఖర్చులు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావసరాలు తీర్చడంలో దిగజారుతూ, ‘లగ్జరీ’ వెంపర్లాటలో దూసుకుపోతున్న తీరుపై ముక్కున వేలేసుకుంటున్నారు. ఆడంబరాలకు వెచ్చించే సగంలో రాష్ట్ర అవసరాలకు కేటాయిస్తే సగానికిపైగా సమస్యలు తీరుతాయని మొత్తుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అతిథిగృహాలు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పేదల ఇండ్ల నిర్మాణంపై కనిపించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో అతిథులకోసం అనేక గెస్ట్‌హౌస్‌లు ఉన్నా బేగంపేట్‌లోని ప్రభుత్వ పాత సెక్యూరిటీ భవనాన్ని స్టేట్ గెస్ట్‌హౌస్‌గా మార్పు చేసేందుకు సోమవారం రూ.3.63కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రూ.7 కోట్లతో గెస్ట్‌హౌస్ నిర్మాణం జరుగుతుండగా, ఇంకోటి ప్లాన్ చేయడంపై జనం నవ్వుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని గెస్ట్‌హౌస్‌లు, ప్రభుత్వ భవనాలు నిరుపయోగంలో ఉండగా, కోట్ల ప్రజాధనంతో మరోకొత్తదానికి ప్రతిపాదనలు చేయడంపై మండిపడుతున్నారు. ఒకవైపేమో పేదలకు అట్టహాసంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లకు దిక్కులేదు, నిర్మాణాలు జరుగుతుంటే నిధుల విడుదల పట్టింపులేదుగానీ ఆర్భాటానికి మాత్రం ఆలోచించని తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతిభవన్‌ను (Pragathi Bhavan) అధికారిక నివాసంగా ఉపయోగించుకోవడమే కాక, సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజాభవన్‌ను ప్రగతిభవన్ మార్చగా ఇద్దరు మంత్రులకు ఆవాసమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సచివాలయంతోపాటు (Secretariat) జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లోనే సమావేశాలు నిర్వహిస్తూ అతిసమీపంలోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రూ.7 కోట్లతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓవైపు దాని పనులు నడుస్తుండగానే తాజాగా బేగంపేట్‌లోని పాత సెక్యూరిటీ భవనాన్ని స్టేట్ గెస్ట్‌హౌస్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టడం గమనార్హం. కాగా, అప్పుడప్పుడు వచ్చిపోయే అతిథుల కోసం కోట్లలో ఖర్చు చేసే ప్రభుత్వ పెద్దలు, పేదల ఇండ్ల కోసం ఆలోచించకపోవడంపై మండిపడుతున్నారు. కేవలం నిధుల కొరతతోనే మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరై, 3.05 లక్షలు మాత్రమే లబ్ధిదారులకు కేటాయింపులు జరిగి, అందులోనూ రెండు లక్షల గృహాలు మాత్రమే ముక్కుతూ మూల్గుతూ పనులు జరుపుకోవడమే ఉదాహరణగా చెబుతున్నారు.
మెస్సీ వస్తున్నాడు, రాష్ట్రం మెరిసిపోబోతున్నది అన్నట్టుగా షో చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అదంతా తుస్ అనే తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. ప్రఖ్యాత ఆటగాడి కోసం వంద కోట్లు ఖర్చు చేయడం, ఆట పేలిపోవడంతో రాష్ట్ర సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అందునా చీకటి సూర్యుల చెమట కష్టం సింగరేణి ఆస్తి నుంచి కూడా పది కోట్లు సమీకరించి వృథాగా వెచ్చించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం కూడా తెలిసిందే. కేవలం ఆయన మనుమడు, సోదరుడి కుమారుడు, మరో ఎమ్మెల్యే కొడుకు, అటు పార్టీ అధినాయకుడు రాహుల్ సహా ఆయన అల్లుడు, కోడళ్ల రాక& ఇలా కేవలం వాళ్ల కోసమే అన్నట్టుగా నిర్వహించిన మ్యాచ్‌కు ప్రజాధనాన్ని పెంకాసుల్లా విదల్చడంపై జనమంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
కోట్లు ఖర్చుచేసి సర్వహంగులతో నిర్మించిన సచివాలయంలో చిన్నాచితకా పనులకు రేవంత్సర్కార్ మళ్లీ లక్షల రూపాయలు వెచ్చించడంపై జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గేట్లవద్ద నీడ కోసం పైకప్పు ఏర్పాటుకు రూ.31లక్షలు, మూడు అంతస్తుల్లో కిటికీలకు తెరల (విండో కర్టెన్లు) ఏర్పాటుకు రూ.33 లక్షలు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడుతున్నారు. సచివాలయం పశ్చిమంవైపు బ్లాక్‌లో ఏడో అంతస్తులోగల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాలు, 8వ అంతస్తులో డైనింగ్ హాలు, 9వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాలు తదితరవాటిల్లో రోలర్ బ్లైండ్స్, కర్టెన్స్ (కిటికీలకు అమర్చే తెరలు) ఏర్పాటుకు రూ.9లక్షలు, 7వ అంతస్తులో మల్టీపర్పస్ హాలు, 9వ అంతస్తులో బాంకెట్ హాలు కిటికీలకు రోలర్ బ్లైండ్స్, కర్టెన్లకు మరో రూ.24 లక్షలు మంజూరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ విడివిడిగా సోమవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న సర్కారు, అధికారుల సమావేశ మందిరాలు, బాంకెట్ హాళ్లలో మరమ్మతులకు నీళ్లప్రాయంగా ఖర్చుచేయడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఇప్పటికే సందర్భం వచ్చినప్పుడల్లా ‘అప్పులు పుట్టడం లేదు, రుణాలు ఇవ్వడం లేదు, ఎక్కడికెళ్లినా చెప్పులెత్తుకెళ్లే వాళ్లలా చూస్తున్నారని..’ బీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడుతూ రేవంత్ అండ్ టీం పబ్బం గడుపుకొంటున్న ముచ్చట తెలిసిందే. అయినా పార్టీ సరదాలు, కుటుంబాల ఆటవిడుపుల కోసం మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా, తలకు మించి ఖర్చులు పెడుతూ రాష్ర్టాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అధికారం చేపట్టిన రెండేండ్లలోనే రేవంత్ ప్రభుత్వం 2.88 లక్షల కోట్ల రుణ సమీకరణతో పాటు అడ్డగోలు బడ్జెటేతర రుణాలు కూడా సమీకరించి రికార్డు సృష్టించింది. కాగా, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేసిన రూ.2.8 లక్షల కోట్ల అప్పుతో కలిపి రూ.3.9 లక్షల కోట్ల అప్పులు చేస్తే రేవంత్ సర్కార్ మాత్రం ఎడాపెడా సమీకరించిన రుణాలతో కేవలం రెండేండ్లలోనే రాష్ట్రంపై రుణభారం రూ.6.8 లక్షల కోట్లు పెరగడం ఆందోళనకరమైన విషయం. ఇంతలా ఇంత అప్పులు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్ల పాలనలో ఇప్పటి వరకు భారీ ప్రాజెక్టులుగానీ, కీలకమైన పథకం గానీ ప్రవేశపెట్టింది లేకపోవడం గమనార్హం.