Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95% చిన్న సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల లోపు భూమి ఉన్నవాళ్లే. అంటే మూడు నాలుగు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది’. ఇదీ అప్పుడు అమెరికాలో, ఇప్పుడు ఓ టీవీ చానల్లో కరెంట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కరెంట్‌పై రేవంత్‌రెడ్డి మళ్లీ అవే విషపు వ్యాఖ్యలు.. అవే కుట్రలు చేస్తున్నారు. వ్యవసాయానికి 3 గంటలు ఇస్తే సరిపోతుందని మూడు నెలల క్రితం అమెరికాలో తన కుట్ర కోణాన్ని బయటపెట్టిన ఆయన, తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అంటే పొరపాటున అన్నారేమో అనుకోవచ్చు, కానీ అదే మాట మళ్లీ అంటే అది పొరపాటు కాదు.. కుట్ర అనేది స్పష్టమైంది. శుక్రవారం ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని తేల్చి చెప్పేశారు. గత జూలై 10న అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొన్న ఆయన తెలంగాణలో వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్‌పై రాష్ట్ర రైతాంగమంతా ఆగ్రహం వ్యక్తంచేయటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ నాయకుడి మాటలను వక్రీకరించారని బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ, రేవంత్ మళ్లీ అదే మాట మాట్లాడి.. తాను అమెరికాలో సోయిలో ఉండే ఆ మాటలు అన్నట్టు తేటతెల్లం చేశారు.
కరెంట్‌పై కాంగ్రెస్ కుట్ర
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, ప్రజలు పడ్డ కరెంట్ కష్టాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూపుమాపారు. అప్పుడు కరెంట్ ఉంటే వార్త అయితే.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అనే పరిస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయరంగాలు అభివృద్ధి బాట పట్టాయి. రైతుల కష్టాలు తీరాయి. రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కష్టాలు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ర్టాన్ని కర్ణాటక బాటలో నడిపేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడుతున్నారు. కర్ణాటకలో రైతులకు 7 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం భగ్గుమంటున్నది. తమను నాశనం చేసేందుకు రేవంత్ కంకణం కట్టుకున్నాడని రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి పాలనతో తమను గోస పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక రాష్ట్రంలోనూ పగ చల్లారలేదా అని నిలదీస్తున్నారు. ఎద్దు ఎవుసం తెలియని రేవంత్‌రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో తాము పడ్డ కరెంట్ కష్టాలు ఏం తెలుసని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గంటలో ఎకరం భూమి ఎట్ల పారిస్తడో చెప్పాలంటే నిలదీస్తున్నారు. మూడు గంటల కరెంట్‌తో ఏం పండిస్తడో చేసి చూపాలంటూ ప్రశ్నిస్తున్నారు. మూడు గంటల కరెంట్ తమ ఎండ్ల పెయ్యి కడిగేందుకు కూడా సరిపోదని, ఇక పంటలేలా పండించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నారు.