Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ) : రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్‌లైన్ సోమవారంతో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక మళ్లీ మాట తప్పుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుభరోసాతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించారు. మార్చి 31 వరకు ఈ పథకాలన్నింటినీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ, సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ నెలాఖరు వరకు రైతులందరికీ రైతుభరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ గడువు సోమవారంతో ముగియనున్నది. రైతుభరోసాపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతున్నదనే అసంతృప్తి రైతుల్లో ఉన్నది. తొలుత ఎకరానికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి, దీనిని రూ.12వేలకు తగ్గించారు. గత వానకాలం రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ సీజన్లో పంటల సమయంలోనే రైతుభరోసా జమ చేస్తామని చెప్పిన సర్కారు.. కోతలు మొదలైనా ఇవ్వడం లేదు. దీంతో రైతుల్లో సర్కారు హామీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాసంగి సీజన్ రైతు భరోసా పంపిణీ ప్రారంభించి రెండు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా పైసలు జమచేసింది. మొత్తం 70 లక్షల మంది రైతులు ఉండగా, 52 లక్షల మందికే పంపిణీ చేసింది. ఇంకా 18 లక్షల మంది రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ యాసంగిలో రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రూ.4,166 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రైతులకు రూ.4,834 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది.
కాంగ్రెస్ సర్కారు హయాంలో రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ ప్రహసనంగా తయారైంది. కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా పథకం ఉద్దేశాన్నే దెబ్బతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసాను పంటలు కోతకు వచ్చినా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు వేసే సమయంలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడంతో విత్తనాలు, ఎరువులు, కూలీలు తదితర అవసరాలకు ఆ పైసలు ఉపయోగపడేవి. కానీ, ఇప్పుడు రైతుభరోసా ఆసల్యంగా జమ చేస్తుండటంతో మొత్తం భారం తమపైనే పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతుభరోసా అందకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్తున్నారు.
మార్చి 31లోపు రైతుభరోసా పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో బ్యాంకులకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఉన్నాయి. దీంతో రైతుల ఖాతాల్లో రైతుభరోసా వేయడం సాధ్యంకాదు. సోమవారం బ్యాంకులకు సెలవు దినం అయినందున రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేయడం సాధ్యమయ్యే పనికాదు. దీంతో బ్యా ంకుల సెలవులను సాకుగా చూపే అవకాశం ఉన్నది. దీంతో ప్రభుత్వం తప్పించుకునే ప్లాన్‌లో భాగంగానే మార్చి 31 గడువు పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.