నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్‌గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి ఇన్చార్జి మంత్రి సీతక్కకు అందించండి. కామారెడ్డి వరద నష్టంపై 15రోజుల్లో హైదరాబాద్‌లో నేనే సమీక్ష నిర్వహిస్తాను. మీరు సరైన ప్రతిపాదనలతో రండి. మీకు ఏం కావాలో అడగండి. వరదల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం చాలా తక్కువగా జరిగిందని యంత్రాంగం చెబుతోంది. వీలైనంత ఎక్కువగా కేంద్రం ద్వారా డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నం చేయండి. కేంద్రం పట్టించుకోకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవీ సెప్టెంబర్ 4న కామారెడ్డి సమీకృత కలెక్టరేట్లో వరదలపై ప్రభుత్వ యంత్రాంగంతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు.
కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 26 నుంచి 29 వరకు భారీ వరదలు తలెత్తాయి. ఫలితంగా కనీవినీ ఎరుగని విధంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలతో అపార నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.251.36 కోట్లు నష్టం సంభవించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. సెప్టెంబర్ 4న స్వయంగా సీం రేవంత్ వచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంతో పాటుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించారు.
వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాలు సరిగ్గా రెండు నెలల తర్వాత అక్టోబర్ చివరి వారంలో క్షేత్ర స్థాయికి వచ్చి పరిశీలన చేశాయి. వరద మిగిల్చిన ఆనవాళ్లను, తాత్కాలిక మరమ్మతులను చూసి వెళ్లిపోయారు. ఓ వైపు సీఎం వచ్చి వెళ్లారు. మరోవైపు కేంద్ర బృందాలు పరిశీలన చేశాయి. రోజులు గడిచాయి. వరద మిగిల్చిన విషాద ఘటనకు రెండున్నర నెలలు అవుతోంది. కొండంత నష్టం వాటిల్లితే మరమ్మతుల పేరిట గోరంత సాయం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతు లు దులుపుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రభు త్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుపానుతో సుమారుగా రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుది అంచనాల్లో 33శాతం మేర దెబ్బతిన్న పంటలకు మాత్రమే సాయం చేసేందుకు నివేదికను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఇసుక మేటలతో కూరుకుపోయిన పొలాలను శుభ్రం చేసి ఇవ్వాలని సీఎం ఆదేశాలిచ్చారు. కానీ ఎక్కడి ఇసుక కుప్పలు అక్కడే పడి ఉన్నాయి. కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు శిథిలమై దర్శనం ఇస్తున్నాయి. వాగులు, వంకలపై తెగిన దారులను తాత్కాలికంగా మట్టి పోసి నడిపిస్తున్నారు. వర్షాలు కేవలం విపత్తును మాత్రమే కాకుండా ప్రభుత్వ లోపాలను ప్రస్ఫుటం చేసింది. రూ.10కోట్లతో తాత్కాలిక మరమ్మతులతోనే రోడ్లు, ఇతర సదుపాయాలు కొనసాగాయి. ఇచ్చిన హామీలు కాగితం మీదే మిగిలాయి. ఈ పరిస్థితి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.
వరద నష్ట నివారణలో దొందూ దొందే అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇరుపార్టీలకు 8 మంది ఎంపీలున్నప్పటికీ కామారెడ్డి జిల్లాకు ఒరిగిన ప్రయోజనం శూన్యం. కామారెడ్డికి వరదలు వస్తే సాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడంలేదు. విపత్తు నివారణ చట్టం ప్రకారం కేంద్రం నుంచే నిధులు రాబట్టాలంటూ అధికార యంత్రాంగానికి హితవు పలకడం విడ్డూరం.
మా గ్రామంలో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బండ రాళ్లతో పొలాలు నిండిపోయాయి. వాటిని తొలగించుకోవాలంటే రైతులకు తలకు మించిన భారం అవుతుంది. ఇప్పటి వరకు సాయం అందకపోవడం విడ్డూరం. వరద వల్ల సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
– దివిటి రమేశ్, పొల్కంపేట, కామారెడ్డి జిల్లా
నాగారం శివారులో కాసుల కత్త వద్ద నాక్కూడా పొలం ఉంది. వరదకు డ్యామేజీ అయ్యింది. వందల ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకు పోయినప్పటికీ తీసే వాళ్లే లేరు. సీఎం వచ్చి ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకునే నాథులు లేకుండా పోయారు.
– ముదాం సాయిలు, మాజీ ఎంపీపీ