హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీసీ బిడ్డలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ ఒక్క నాయకుడికైనా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలను ఉద్ధరిస్తామని చెప్తున్న రేవంత్‌రెడ్డివి నక్క వినయాలు, దగాకోరు రాజకీయాలని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో శనివారంబీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసిన పొన్నాల విలేకర్లతో మాట్లాడారు. ‘54శాతం ఉన్న బీసీ ప్రజల గురించి ఇప్పుడా మాట్లాడేది? బీసీ డిక్లరేషన్ ప్రకటించడానికి మొదట సూర్యాపేట, తర్వాత మిర్యాలగూడ, నల్లగొండ.. ఫైనల్‌గా షాద్‌నగర్ అనుకొని.. చివరికి బీసీ అభ్యర్థులు లేని కామారెడ్డిలో సభ పెట్టడం దేనికి సంకేతం? మీరా బీసీల చిత్తశుద్ధి గురించి మాట్లాడేది?’ అంటూ మండిపడ్డారు. నిజామాబాద్‌లోని 9 నియోజకవర్గాల్లో ఒక్క బీసీ అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వకుండా.. అక్కడ బీసీ డిక్లరేషన్ చేయడం.. రేవంత్, కాంగ్రెస్‌పార్టీ మోసపూరిత బుద్ధికి నిదర్శనమని అన్నారు. బీసీ డిక్లరేషన్‌కు కమిటీ వేసి, దానికి అధ్యక్షుడిగా బీసీని పెట్టి.. క్యాంపెయిన్ కమిటీలో బీసీయేతరులను నియమించడం దారుణమైన మోసమని విమర్శించారు.
దొంగ సర్వేల పేరు చెప్పి రేవంత్‌రెడ్డి డబ్బుల కోసం సీట్లు అమ్ముకోవడం వల్ల బీసీ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని పొన్నాల ఆరోపించారు. ‘తెలంగాణలో 34 మంది బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పి.. కేవలం 23 ఇచ్చి, అందులో ఒకటి క్యాన్సిల్ చేసి, ఓడిపోయే ఐదుచోట్ల బీసీలకు టికెట్లు కేటాయిస్తవా? ఈ చొప్పున నువ్వు బీసీలకు ఇచ్చింది మొత్తం 17 సీట్లేగా రేవంత్‌రెడ్డి? ఇక ఏ ముఖం పెట్టుకొని బీసీ డిక్లరేషన్ అంటున్నావ్’ అంటూ నిలదీశారు. ‘మొత్తం దొంగ సర్వేల పేరుతో, డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది నువ్వు కాదా? 38 చోట్ల కొత్తవాళ్లకు ఏ సర్వేల పేరుతో టికెట్లు ఇచ్చావ్? అందులో ఐదురోజులు, మూడు రోజుల ముందు కూడా జాయిన్ అయిన వాళ్లు లేరా? అప్పుడవన్నీ దొంగ సర్వేలే కదా? ఇవన్నీ బీసీ బిడ్డలు గమనించి ఓటు వేయాలి’ అని పొన్నాల పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతున్నది కాబట్టే తాను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సీఎం కేసీఆర్ 23 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారని చెప్పారు. ఐదుగురు బీసీలకు రాజ్యసభ, 8 మందికి ఎమ్మెల్సీలు, 55 మందికి వివిధ కార్పొరేషన్ల పదవులు ఇచ్చి, దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని పొన్నాల చెప్పారు. నక్క వినయాలు ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి.. బీసీలకు సీఎం కేసీఆర్ చేస్తున్న మంచిని, చేస్తున్న ఖర్చును అధ్యయనం చేయాలని సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్ చేయడం అంటే.. హంతకుడు సంతాసభ పెట్టినట్టు ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు. పొన్నాలతో సహా ఎందరినో నమ్మించి మోసం చేసిన మోసగాడు రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకులను ఓర్వలేనోళ్లు.. బీసీలను ఉద్దరించడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. 9 ఏండ్లుగా బహుజన బిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, 50వేల కోట్ల రూపాయలు కేవలం బీసీలకు ఖర్చు చేశారని చెప్పారు. కుల వృత్తులకు ప్రాణం పోసి, వారికి ఆత్మగౌరవ భవనాలు కట్టారని చెప్పారు. ఇప్పుడు రేవంత్ పల్లకి మోస్తున్న బీసీ నేతలు మరోసారి ఆలోచన చేయాలని అన్నారు. బీసీ వర్గానికి చెందిన ముగ్గురు పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్లోకి ఎందుకొచ్చారో ఆలోచన చేయాలన్నారు.