హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌ను అన్ని విధాలా ధ్వంసం చేసి కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. భూములన్నీ కాజేసి హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్న రేవంత్‌రెడ్డి.. మోదీ చేతిలో పెట్టి రెండో రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? రైతుబంధు, రైతుబీమా, బోనస్‌లు అందక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు జరుపుకొంటున్నారా? అంటూ నిలదీశారు. ‘రెండేండ్ల పాలనలో ఏం జరిగింది?’ అనే అంశంపై తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన హైదరాబాద్ సోమాజిగూడలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ..
ఎన్నికల ముందు తెలంగాణ ప్రజల గౌరవాన్ని అర్రాస్ పాట పాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజాదర్బార్ పేరిట నిత్యం ప్రజలను కలుస్తానని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చివరకు సీఎం సొంత గ్రామానికి జర్నలిస్టులు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. రెండేండ్ల పాలనలో చేసిన రూ.2.5 లక్షల కోట్ల అప్పులను ఏ పథకానికి వినియోగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు రెండేండ్లలో తెలంగాణ రైజింగ్ కాదని తెలంగాణ క్లోజింగ్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. రెండేండ్లలో కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల ఆస్తులు రైజింగ్ అయ్యాయి తప్ప పేదలు, రైతులు, నిరుద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజల కలలు క్లోజింగ్ అయ్యాయని విమర్శించారు. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు వెళ్తున్నాయని, డ్రగ్స్ దందాను మహారాష్ట్ర పోలీసులు వచ్చి గుర్తించేదాకా ఈగల్ టీమ్ మొద్దు నిద్రపోతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాల్లో వసతులు కల్పించకుండా పిల్లల చావులకు కారణమవుతున్న వాళ్లు.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కడతామనడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నట్టు ఇతర దేశాలతో కాదు.. అవినీతి, అక్రమాలతో పోటీ పడుతున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్ వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్ పాపారావు, రైతు వేదిక చైర్మన్ పులి రాజు, ప్రముఖ కళాకారుడు మద్దెల సందీప్, ముస్లిం రైట్స్ ఫోరం కన్వీనర్ జమ్లుద్దీన్, యూసుఫ్, మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు పిల్లి నాగరాజు, బస్తీ సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మహిళా నేతలు అమ్మాజి, అశోక కుమారి, బీసీ సంఘాల గ్రేటర్ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసి, చరిత్రను పాతరేసి భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రానికి రెండో రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నరు. విశ్వనగరాన్ని నిర్వీర్యం చేసి మోదీ చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నరు. విలీనం పేరుతో అసలైన హైదరాబాద్‌ను తెలంగాణ పేరిట వేరు చేసి.. ఉత్తరాది వాళ్లకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గుడి పాలనలో క్లోజింగ్ తెలంగాణగా మారుతున్నది. బుద్ధిజీవులమని చెప్పుకొంటున్న కొందరు రెండేండ్ల కాంగ్రెస్ విధ్వంసాన్ని చూస్తూ తటస్థంగా
ఉంటామంటున్నరు.
– పల్లె రవికుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అంధకారంలోకి వెళ్లింది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారు. విద్యాశాఖ, హోం శాఖలకు మంత్రులు లేక పట్టించుకునే వారు లేరు. మంత్రులు ఏ శాఖకూ న్యాయం చేయలేకపోతున్నారు. విజన్-2047 అని చెప్పుకొంటున్న ప్రభుత్వానికి గద్వాల, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఇప్పటికీ పిల్లలు బడికి పోలేని స్థితిలో ఉన్నారని తెలుసా? పాలనను వికేంద్రీకరణ చేయాల్సి ప్రభుత్వం మున్సిపాలిటీలను హైదరాబాద్‌లో చేరుస్తున్నది. ఇది అత్యంత ప్రమాదకరం.
– వెంకట్‌రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు గ్రహణం పట్టింది. అన్ని వర్గాలను మోసం చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నరు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, కనీసం ఒక్క చీరను కూడా ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నరు. రెండేండ్లయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందరినీ అన్ని రకాలుగా మోసం చేశారు. అబద్ధానికి అంగీ, లాగు తొడిగితే రేవంత్‌రెడ్డి అయితే.. అవి రెండూ తీసేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు అవుతుంది.
– సుమిత్రానంద్, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు
రెండేండ్లు కాంగ్రెస్ పాలనలో పబ్లిసిటీ ఫుల్.. పరిపాలన నిల్ అన్నట్టు ఉన్నది. ఎంబ్లమ్, తెలంగాణ తల్లి విగ్రహం మార్చి ప్రజల మనోభావాలు, అస్థిత్వాన్ని అవమానించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి, పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే ఆ ప్రాంగణానికి తాళం వేసిన మూర్ఖుడు రేవంత్‌రెడ్డి. అమరదీపానికి రేవంత్ ఏనాడూ నివాళి అర్పించలేదు. డైవర్షన్ పాలిటిక్స్‌తో సీటు కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నడు.
– వాసుదేవరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎక్కడచూసినా ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల వల్ల ప్రజల సంతోషంగా ఉన్నరు. ప్రజల చేతిలో నిత్యం డబ్బులు తిరగుతూ ద్రవ్యోల్బణం హెచ్చు స్థితిలో ఉండేది. అభివృద్ధి అటెకెక్కి అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.
– పాపారావు, విశ్లేషకులు