హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ‘కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొమ్మిదన్నరేండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం. ఆరోగ్యం బాగాలేదంటే.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే మాక్ అసెంబ్లీ పెడదాం. మంత్రుల బృందాన్ని పంపిస్తా. కాదు.. కూడదు అంటే.. నేను కూడా చర్చకు వస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమంటూ సవాలు విసిరి కేటీఆర్ చేతిలో భంగపడిన మరునాడే.. సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సవాల్‌కు దిగడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు, ఏపీ కృష్ణా నీళ్ల దోపిడీపై ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు బుధవారం ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన నష్టం కన్నా ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ నష్టం జరిగిందని చెప్పారు.
హైదరాబాద్‌లో 20 శాతం వరకు సీమాంధ్ర ప్రజలు ఉంటున్నందున నగరానికి ఉమ్మడి కోటా హకు నుంచి తాగునీటిని తీసుకొని ఉంటే బాగుండేదని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమ్మడిపాలమూరు జిల్లా కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి జూరాల సోర్సుగా ఉమ్మడి ఏపీలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో ఇచ్చారని, కానీ దాన్ని తర్వాత శ్రీశైలానికి మార్చారని అన్నారు. కృష్ణా జలాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే ఒడిసిపట్టి ఉంటే ఏపీ నిర్మించిన పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాలకు మనం వాడుకున్నాకే నీళ్లు వెళ్లేవని తెలిపారు. నీళ్లు లేక వ్యవసాయానికి జరిగే నష్టం గురించే ఆలోచిస్తున్నామే కానీ, అగ్గువకు దొరికే విద్యుత్తును మనం నష్టపోతున్నామని, రూ.10కి యూనిట్ విద్యుత్తును కొనాల్సి వస్తున్నదని చెప్పారు.
వరద జలాలు, మిగులు జలాలను రంగారెడ్డికి తీసుకెళ్తే నష్టమేమిటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వరద జలాల్లో లెక తేలాక, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్న తరువాత బురద ఉందో.. వరద ఉందో తేలుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం కుంగింది కాబట్టి దిగువకు వెళ్లే నీళ్లను చూసి వరద జలాలుంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అనుకుని ఉండవచ్చునని వివరించారు. ఎవరేం కట్టాలంటున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దామని అన్నారు. న్యాయపరంగానే బనకచర్లపై పోరాడుతున్నామని, అందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని, అందరి దగ్గరికీ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు.
ఎవరికీ తాను ఎలాంటి సవాల్ విసరలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మాట మార్చారు. తొమ్మిదేండ్లు కేసీఆరే అధికారంలో ఉన్నారని, కానీ ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ వల్లే సర్వం నాశనమైందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా, గోదావరి నదీ జలాల్లో జరిగిన అన్యాయంపై చట్టసభల్లో చర్చిద్దామని, వాస్తవాలను ప్రజలకు వివరిద్దామని, ప్రధాన ప్రతిపక్ష నేతను లేఖ రాయమని మాత్రమే సూచించానని, తాను సవాల్ విసరలేదని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు లోబడి ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, అయితే ప్రమాదకరంగా మారిన నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయబోమని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.