హైదరాబాద్, ఫిబ్రవరి5 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి దగా చేశారని, చట్టపరంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామనడం మోసపూరితమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు మాటతప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బీసీ డిక్లరేషన్‌ను అమలుచేయకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో మరో సంగ్రామం తప్పదని హెచ్చరించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 14 నెలల్లో ఒకరికీ రుణాలు ఇవ్వలేదని, ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించలేదని, ముఖ్యమైన పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం తగ్గిందని, బీసీ విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. నేడు ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో పాల్గొనాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలెను సంఘం నేతలతో కలిసి ఆహ్వానించారు.