KTR | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో రేవంత్‌రెడ్డి అంతరాత్మకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, మాగంటి సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి సునీతకు బీఆర్ఎస్ అండగా నిలిచిందన్నారు. సునీతాగోపీనాథ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పని చేశారన్నారు. వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు.
కర్నాటక నుంచి మనుషులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారన్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. రాయించి, వేయించుకున్న ఓట్లతో జూబ్లీహిల్స్‌లో గెలిచారన్నారు. విషాదంలో ఉన్న హరీశ్‌రావు అంకితభావంతో పని చేశారని, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం అందరి కృషి చేద్దామన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా పూర్తి అండగా ఉంటామన్నారు. ఎవరికి సమస్య వచ్చినా తెలంగాణ భవన్‌కు రావొచ్చునన్నారు. డిసెంబర్‌లోగా సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడుతామన్నారు. బూత్‌లవారీగా పటిష్టంగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్‌లో 407 బూతుల్లో ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున పార్టీని పటిష్టం చేసుకోవాలన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని.. ప్రజా సమస్యలపై పోరాటం ఇప్పటి నుంచే మొదలుపెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలన్నారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్‌లో సాంకేతికంగా మాత్రమే కాంగ్రెస్ గెలుపని.. జూబ్లీహిల్స్‌లో నైతిక గెలుపు సునీత, బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. బీఆర్ఎస్ నేతలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18వేల ఓట్లు మాత్రమే వచ్చాయని.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 75వేల ఓట్లు సంపాదించామని తెలిపారు. మైనారిటీల మద్దతు కోల్పోతున్నామని కాంగ్రెస్ గుర్తించిందని.. బీఆర్ఎస్కు భయపడి అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని, బీఆర్ఎస్ను చూసి కాంగ్రెస్ పార్టీ గడగడలాడిపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ ఒక వైపు, బీఆర్ఎస్ పార్టీ ఒంటరి పోరాటం చేసిందన్న హరీశ్.. అధికార దుర్వినియోగంతో గెలిచిన విషయం రేవంత్‌రెడ్డికి తెలుసునన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. త్వరలోనే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని, తమను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. కేటీఆర్, తలసాని సహా తామంతా కలిసి కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికలకు సిద్ధంగా ఉందామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.