ఇవాళ దీపావళి.. ప్రపంచం చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన రోజు ఇది. ప్రజలను అష్టకష్టాల పాలుచేసిన నరకుడి నుంచి విముక్తి కలిగిన రోజు. యాదృచ్ఛికమో మరొకటో తెల్వదుగాని సరిగ్గా నరక చతుర్దశి రోజే చీకటి మాటొకటి వినబడింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదం.. అసలు జననినాదమే కాదని, అదొక రాజకీయ స్లోగన్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికంగా తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేకుండె అని నిన్నటిదాకా మాట్లాడిన రేవంత్ నేడు మరొక అడుగు ముందుకేసి అసలురంగు బయటపెట్టుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నింటినీ సమైక్యపాలకులు సవ్యంగానే ఇచ్చారని, వాటికోసమే అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.
24 గంటల కరెంటు అక్కర్లేదు.. రైతుబంధు అక్కర్లేదు.. ధరణి అక్కర్లేదు.. ఆ కాంగ్రెస్ మాటలకు పరాకాష్ఠలాంటి కొనసాగింపు ‘తెలంగాణ రాష్ట్రం అక్కర్లేదు’. మనిషి తెలంగాణవాడే కావచ్చు, కానీ మాటమాత్రం మనదికాదు. పలికిస్తున్నది వేరేదో ఉన్నది. 60 ఏండ్ల చీకటిని పోగొట్టుకున్నామని సంబురపడేలోపే మరో అంధకారం కమ్ముకుంటానంటున్నది.
మరి దీపావళితో ఆ చీకటిని అంతం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నవంబర్ 30న తెలంగాణకు అసలైన దీపావళిని అందిద్దామా?
Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజు.. వేలమంది ఆత్మబలిదానాలను దారుణంగా అవమానించిన రోజు.. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్న దుర్దినం. మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస, ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గాయపర్చిన రోజు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్ని హద్దులు దాటేశారు. ఉద్యమ సమయంలో సమైక్యవాదుల సంకలో జొర్రి తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కువ పెట్టిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏండ్ల తర్వాత కూడా తన బుద్ధి మారలేదని నిరూపించుకొన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధానాన్ని ప్రశ్నిస్తే.. రేవంత్ ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరమే లేకుండెనని ప్రకటించారు. మొన్నటికి మొన్న టెక్నికల్‌గా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించిన ఆయన.. శుక్రవారం తన ముసుగును మొత్తం తీసేశారు. ఓ టీవీ చానల్లో మాట్లాడిన రేవంత్ గొంతులో నుంచి సమైక్యవాదుల భాష స్పష్టంగా బయటకు వచ్చింది.
భగభగ మండిన ఉద్యమానికి చెద అంటించే ప్రయత్నం తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ ఏంటని రాష్ట్రంలో ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అని. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం అవి అసలు విషయమే కాదని తేల్చేశారు. సమైక్య పాలకులు ఏనాడో తెలంగాణకు నీళ్లు, నిధులు ఇచ్చారు, నియామకాలు జరిపారని సెలవిచ్చారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనేది కేవలం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాజకీయ ఎజెండా మాత్రమేనని భాష్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎన్నడూ నీళ్ల గురించి కానీ, నిధుల గురించి కానీ, నియామకాల గురించి కానీ ఆలోచించనేలేదని చెప్పుకొచ్చారు. సమైక్యవాదుల పాలన అద్భుతమని, తెలంగాణకు వారు అన్నీ ఇచ్చారనేలా మాట్లాడారు. ఈ మాటలు తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సమైక్యవాదులు కూడా ఇప్పటివరకు ఎవరూ అనలేదు. కలిసి ఉందాం అన్నారేగాని.. తెలంగాణకు గొప్పగా సేవలు చేశామని చెప్పలేదు. మొదటిసారి రేవంత్‌రెడ్డి తెలంగాణలో సమైక్య పాలన అద్భుతంగా సాగిందని చెప్పారు. తెలంగాణ కోసం అనేక భారీ ప్రాజెక్టులు కట్టారని, హైదరాబాద్ అభివృద్ధికి లెక్కలేనన్ని నిధులు ఇచ్చారని, ఖాళీలు కనిపించకుండా ఉద్యోగాలు భర్తీచేశారని సెలవిచ్చారు.
మరి ఉద్యమం ఎందుకొచ్చినట్టు?
మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పి తీరాలి. వందల మంది తెలంగాణ యువకులు ఎందుకు ఆత్మబలిదానాలు చేశారో చెప్పి తీరాలి. 1956 నుంచే తెలంగాణలో ఏదో ఒకచోట తెలంగాణ ఉద్యమం ఎగసి పడని సందర్భం లేదు. మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు పుష్కలమైన నీళ్లు అందితే, కావాల్సినన్ని నిధులు లభిస్తే, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు ఇక్కడివారితోనే భర్తీ అయితే.. 50 ఏండ్లపాటు ఉద్యమం అలుపెరుగకుండా ఎందుకు సాగిందో రేవంత్ చెప్పి తీరాలి. సమైక్య పాలకులు తెలంగాణలో పెద్దపెద్ద ప్రాజెక్టులు కట్టి పుష్కలంగా నీళ్లు ఇస్తే.. పాలమూరు నుంచి లక్షలమంది గోడుగోడున ఏడుస్తూ బతడానికి బొంబాయి ఎందుకు పోయేవారో రేవంత్ చెప్పి తీరాలి.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా కేంద్రం ఎందుకు ప్రకటించిందో చెప్పి తీరాలి. సమైక్య రాష్ట్ర సచివాలయంలో 90 శాతం ఉద్యోగులు ఆంధ్రావారే ఎందుకు ఉండేవారో చెప్పి తీరాలి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలు వేసి లెక్కలు తేల్చేవి. ఆ కమిటీలన్నీ వేసింది నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే. మరి తెలంగాణకు సమైక్య పాలకులు అన్నీ ఇస్తే.. ఆ కమిటీలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో రేవంత్ చెప్పి తీరాలి. మిగులు రాష్ట్రమైన హైదరాబాద్‌ను ఆంధ్రతో కలిపినప్పుడు.. లోటు రాష్ట్రమైన ఆంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నిధులు ‘బాగానే’ ఇచ్చారని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. ఆ నిధులు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పి తీరాలి అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
ఆ ప్రాజెక్టులు ఎవరికోసం కట్టారు?
నాగార్జునసాగర్, శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులు సమైక్యపాలకులే నిర్మించారని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మరి వాటివల్ల లాభపడింది ఎవరు? నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కుట్రతో మార్చి నిర్మించి అత్యధిక భాగం నీళ్లు సమైక్య పాలకుల ప్రాంతానికి తరలించుకుపోయారు. అక్రమంగా నీళ్లు తరలించుకుపోయేందుకే శ్రీశైలం ప్రాజెక్టును వాడుకున్నారు తప్ప.. ఏనాడూ అక్కడ సరిగా కరెంటు ఉత్పత్తి చేసి తెలంగాణకు ఇవ్వలేదు. కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పరిస్థితీ అంతే.. తెలంగాణలో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా పూర్తిచేసిన పాపాన పోలేదు. వాళ్లు వదిలేసి వెళ్లిన ప్రాజెక్టులన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసింది. రేవంత్‌రెడ్డికి మాత్రం సమైక్యవాదుల పాలనే అద్భుతంగా కనిపిస్తున్నది.
అది 60 ఏండ్ల ట్యాగ్‌లైన్
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రతి ఉద్యమానికి ఒక ట్యాగ్‌లైన్ ఉన్నది. అది ఆ ఉద్యమపు అంతిమ లక్ష్యమై ఉంటుంది. దాని సాధనకోసమే అలుపెరగని పోరాటాలు జరుగుతూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమానికీ ట్యాగ్‌లైన్ ఉన్నది. అదే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. ఇది ఒక రాజకీయ పార్టీ సృష్టించిన నినాదం కాదు. తెలంగాణ ఉద్యమంలో నుంచి అగ్నిపర్వతం బద్ధలైనంత భీకరంగా ఉద్యమకారుల నోటి వెంట వచ్చిన పొలికేక. ఏనాడైతే సీమాంధ్రతో హైదరాబాద్ రాష్ర్టాన్ని కలిపారో.. ఆనాడే ఈ నినాదం పుట్టుకొచ్చింది. కేసీఆర్ టీఆర్ఎస్ను ప్రారంభించకముందునుంచే ఈ నినాదం తెలంగాణ నలుమూలల ప్రతిధ్వనించింది. ప్రొఫెసర్ జయశంకర్ కాలికి బలపం కట్టుకొని తెలంగాణ మూల మూలనా తిరుగుతూ ప్రజలకు ఉద్భోదించింది. ఈ నినాదాన్నే టీఆర్ఎస్, కేసీఆర్ మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు స్వయంగా ఆయన పుట్టుకపై కూడా అనుమానాలు కలిగేలా ఉన్నాయని ఉద్యమకారులు అంటున్నారు. ఉద్యమంపై కనీసం జ్ఞానం కూడా లేదంటే.. ఆయన పరిస్థితి ఏమిటో అర్థమవుతుందని విమర్శిస్తున్నారు.
మోదీని మించిన ద్వేషం
ప్రధాని మోదీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పలుమార్లు అవమానించేలా మాట్లాడారు. కానీ, ఆయన రాష్ట్ర ఏర్పాటు విధానం సరిగ్గా సాగలేదనే చెప్పారు. రేవంత్ మాత్రం అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. ఇది తెలంగాణ సమాజానికి శరాఘాతమే. కనీసం తాను తెలంగాణ వాసిగా ఆలోచించినా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదేమోని ఉద్యమకారులు అంటున్నారు. తన జీవితం, ఆలోచనలన్నీ సమైక్యవాదుల భిక్ష అనేలాగా వ్యాఖ్యానించడం ఆయన బానిస బతుక్కు ఉదాహరణ అని మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ పోటీ చేయకపోవడం, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దత్తుగా నిలవడం వెనుక వలసపాలకుల ఆలోచనలను అమలు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు.
తాజాగా రేవంత్ వ్యాఖ్యలు సమైక్యవాదుల ప్రణాళికను బహిర్గతం చేశాయి. అందరూ అనుమానిస్తున్నట్టుగానే తాను కాంగ్రెస్‌లో చేరడం.. పీసీసీ అధ్యక్షుడు కావడం.. అభ్యర్థుల ఎంపికలో అదేస్థాయిలో వ్యవహరించడం.. చివరకు ఉద్యమ ట్యాగ్‌లైన్ ఉనికినే ప్రశ్నించటం.. వీటన్నింటినీ కలిపి చూస్తే.. సమైక్యవాదులతో కలిసి రేవంత్ మాస్టర్ ప్లానే వేసినట్టు అర్థమవుతుందని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు. తన గురువు చంద్రబాబు ఆలోచనలను తెలంగాణలో ఆచరణలో పెట్టడానికే పీసీసీ పదవి దక్కించుకొని స్వరాష్ట్ర వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఆ ‘చేతి’లోకి వెళితే తెలంగాణ ఉంటుందా?
ఇంతటి విషం కక్కుతున్న రేవంత్‌రెడ్డి చేతిలోకి వెళితే తెలంగాణ అస్థిత్వం ఉంటుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. వలస పాలకులతో అంటకాగుతున్న రేవంత్చేతిలో తెలంగాణను పెడితే.. తిరిగి వలస పాలకుల ఆధిపత్యంలోకి వెళ్లడమేనని ఆందోళన వ్యక్తమవుతున్నది. తలెత్తుకుని బతుకుతున్న తెలంగాణ ప్రజలు మరోసారి బానిసలుగా బతకాల్సిన అగత్యం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా ఇప్పటికీ రెండు రాష్ర్టాల మధ్య నీళ్ల విషయంలో పంచాయతీలు పూర్తిగా పరిష్కారం కాలేదు. కృష్ణా నీటిలో మనవాటా మనకు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో రేవంత్ చేతిలోకి తెలంగాణ వెళ్తే.. ఆయన గురువులైన సమైక్యవాదులు ఏది అడిగితే అది రాసిస్తాడని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడితే మళ్లీ కరువులు, కష్టాలు తప్పవని అంటున్నారు.
తెలంగాణ ద్రోహి రేవంత్
రేవంత్ ఇలా మాట్లాడటం దుర్మార్గం. సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తిన ఉద్యమ ద్రోహి. తెలంగాణ ప్రజలన్నా..ప్రజల ఆకాంక్షలన్నా ఆయనకు గిట్టదు. స్వరాష్ట్రం కోసం సబ్బండవర్గాలు తండ్లాడినయ్. తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ దారుణంగా దెబ్బతీశాడు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవమానించాడు. ప్రజ లు ఇలాంటి కుట్రలను చేదించాలి. రేవంత్‌రెడ్డి వంటి కుట్రదారులను ఓడించాలి.
– జీ దేవిప్రసాద్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
బూట్లు నాకినోడికేం తెలుస్తుంది?
తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైనే నీళ్లు, నిధు లు, నియామకాలు. ఇ ది తెలియకుండా సమై క్య పాలకుల బూట్లు నాకినోళ్లకు తెలంగాణ నినాదాలేం తెలుస్తాయి? 610 జీవో సాధన ఉద్యోగాల కోసం కాదా? పదోన్నతులు రాక, ఆంధ్రా ఉద్యోగులకే పట్టం కడితేనే 48:52 నిష్పత్తి ఫెయిర్ షేర్ కోసం పోరాడింది నిజం కాదా? 2011 తర్వాత జరిగిన ఉద్యమమే ఫ్రీ జోన్‌కు వ్యతిరేక పోరాటం. ఇదే తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంగా ఎగిసిపడి స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసింది. ఉద్యమకారులంతా రేవంత్‌రెడ్డిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.
-మామిళ్ల రాజేందర్, టీఎన్జీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు.
ఇప్పటికీ రేవంత్ సమైక్యవాదే
రేవంత్‌రెడ్డి విచక్షణ కోల్పోయాడు. రేవంత్ ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదు. కాబట్టే ఉద్యమం ఎందుకు జరిగిందని ఎట్లా తెలుస్తుంది? ఉద్యమకాలంలో రేవంత్‌రెడ్డి సమైక్యవాదిగానే ఉన్నాడు. ఇప్పటికీ సమైక్యవాదిగానే మాట్లాడుతున్నడు. నీళ్లు అప్పుడే ఇచ్చి ఉంటే మరి అనాడు తెలంగాణ ఎందుకు పచ్చగలే దు?ఈ పంటలు ఎందుకు పండలేదు? నిధులు ఇచ్చి ఉంటే ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు.
-మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి
కేసీఆర్ చెప్పే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఎజెండా. ప్రజలెప్పుడూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఆలోచన చేయలె. సీమాంధ్ర పాలకులు నీళ్లియ్యలేదా? నాగార్జునసాగర్, కోయిల్‌సాగర్, శ్రీశైలం, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి.. ఈ రోజున్న ప్రాణహిత చేవెళ్ల, అర్ధంతరంగా ఆగిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలుగూడా అప్పుడే మొదలైనయ్ గదా? హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించిన్రు గదా? కాస్త ఎనుకో ముందో ఎప్పటికప్పుడు నియామకాలు జరుగుతూనే వచ్చినయ్. వాటికోసమైతే తెలంగాణ అవసరం లేదు.
-టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి