హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామన్న ఆవేదన పట్టణ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు. మరోవైపు, బీజేపీని ప్రజలు నమ్మడం లేదని అంటున్నారు. బీజేపీ, ఎంఐఎం కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని పుర ప్రజలు బలంగా నమ్ముతున్నారని, దీంతో పురపాలక ఎన్నికల్లో త్రిముఖ పోరు ప్రసక్తే లేదని, ద్విముఖ పోరు మాత్రమే ఉన్నదని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరులోనూ బీఆర్ఎస్దే పైచేయిగా ఉన్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నదని సర్వేలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత సర్వేల్లోనూ, పార్టీపరంగా నిర్వహించిన సర్వేల్లోనూ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నట్టు తేలిందని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడం, జాబ్ క్యాలెండర్ వేసి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీని నెరవేర్చకపోవడంతో పట్టణ ప్రాంత యువత, మహిళలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టుకోసం సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగి వరుస సభలు పెట్టినా ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పందన రాకపోవడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. మంత్రులను రంగంలోకి దింపినా, ఎమ్మెల్యేలు కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని, అనేక చోట్ల స్థానికులు వారిని నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని ఉదహరిస్తున్నారు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులు, హిందుత్వ ఎజెండా, స్థానిక సమస్యలపై చార్జ్షీట్ల విడుదల తదితర అంశాలతో ప్రచారం చేయగా, ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అందుకే ప్రచారంపై పెద్దగా దృష్టిపెట్టలేదని, ఆఖరికి బీజేపీ మంత్రులు, ఎంపీలు ఉన్న చోట కూడా ప్రచారాన్ని మమ అనిపించారని అంటున్నారు. పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయన్న ప్రచారం జరుగుతున్నదన్నారు. ఇందుకు తాజా ఘటననే ఉదహరిస్తున్నారు. అనుమానాస్పదంగా మారిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ దగ్ధం వ్యవహారం ఎన్నికల సమయంలో బీజేపీకి ఆయుధం వంటిదని, కానీ బీజేపీ మంత్రులుగానీ, నేతలుగానీ ఈ అంశంపై పెద్దగా స్పందించకపోవడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు.
బీజేపీ బలహీనపడటంతో ఆ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మళ్లుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డిలో అంతర్మథనం మొదలైనట్టు చెప్తున్నారు. అందుకే బీజేపీకి హైప్ తెచ్చేందుకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారని అంటున్నారు. అయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి త్రిముఖ పోరు అంటూ కొత్త రాగం అందుకున్నారని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, ఎంఐఎం సైతం రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతున్నదని అంటున్నారు. ముస్లిం సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నచోట కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించేందుకు ఎంఐఎం బరిలో నిలిచిందని అంటున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కారు గుర్తుకు పడకుండా కొంత మేర చీల్చవచ్చని భావిస్తున్నట్టు చెప్తున్నారు. అయినా పట్టణ ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడిన దక్షిణ తెలంగాణ ప్రజలు రెండేండ్లు తిరుగకముందే తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం సాధిస్తారని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, బీజేపీ ఎంపీ గెలిచిన మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అనేలా హోరాహోరీగా తలపడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పరిపాలను స్వయంగా చూసిన నేపథ్యంలో పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయవద్దని పట్టణ ప్రజలు నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పట్టణ ప్రగతి పనులను వివరిస్తూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చేసిన ప్రచారం బీఆర్ఎస్కు కలిసి వస్తున్నదని భావిస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డలకు తులం బంగారం, అంగన్వాడీల వేతనాల పెం పు, ఎలక్ట్రిక్ సూటీలు తదితర హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో వివరించిన తీరు తో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు.