హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): శాంతియుత నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీస్ లాఠీచార్జి ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు పరాకాష్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునేలా, అశోక్‌నగర్ వీధుల్లో నిరుద్యోగ బిడ్డల రక్తం కారేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దమనకాండకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. నాడు రాహుల్‌గాంధీని రప్పించి, అమలుకానీ హామీలు గుప్పించి అధికార పీఠమెక్కిన రేవంత్‌రెడ్డి.. నేడు అదే నిరుద్యోగుల పాలిట యమకింకరుడిలా మారడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. లైబ్రరీలోకి చొరబడి మరీ నిరుద్యోగులపై లాఠీచార్జి చేయించారని మండిపడ్డారు.
నాడు నిరుద్యోగుల పక్షాన నిలిచినట్టు నటించిన వారు.. ఇప్పుడు అధికార గర్వంతో కండ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు ఆశ చూపి అడియాస చేశారని మండిపడ్డారు. మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి, తీరా దాన్ని దగా డీఎస్సీగా మార్చి నిరుద్యోగుల గొంతు కోశారని విమర్శించారు. నిరుద్యోగులపై జరిగిన ఈ హేయమైన దాడికి సీఎం రేవంత్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై పడిన ప్రతి లాఠీ దెబ్బకు, వారి కండ్లలో చిందిన ప్రతి రక్తపు చుకకూ ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తక్షణమే నిర్బంధాలను ఆపి, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.