KTR | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ అన్నారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వమని విమర్శించారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసాన్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని అన్నారు. మోదీ, చంద్రబాబు ఆడిస్తున్నట్లు కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదని అన్నారు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారని ప్రశ్నించారు.
వాళ్ల బాస్ చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ రెడ్డి ఆడుతాడు
కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ 5 ఫీట్లు హైట్ పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు
అదే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు 93 వేల కోట్లు పెట్టి కడితే.. లక్ష కోట్లు తిన్నారని ప్రచారం చేసాడు
93 వేల కోట్లు ఖర్చయినా… pic.twitter.com/GaBGI3axUt
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025
దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని కేటీఆర్ అన్నారు. కానీ, పదేళ్లలో మనం చేసిన పనులను ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయామని తెలిపారు. ‘మోసపోతే గోసపడతాం’ అని కేసీఆర్ ముందే హెచ్చరించారని.. ఆయన చెప్పినట్లే ఇవాళ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయని అన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు, యూరియా ఎలా వచ్చాయి? కాంగ్రెస్ రాగానే ఎందుకు కరువయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సత్తా లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కేసీఆర్ ఆపలేదని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన రాష్ట్రాన్ని ‘క్యాన్సర్ పేషెంట్’ అంటూ రేవంత్ పరువు తీస్తున్నాడని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు మరోసారి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలని కోరారు.