సిద్దిపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు పర్యటించారు. అక్కడ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని, రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. ‘గజ్వేల్‌లో ఎన్నికలు వచ్చాయి. మనకు అన్నం పెట్టిన వాళ్లకు, మనకు పని చేసిన వాళ్లకు, మనల్ని మంచిగా చూసుకున్న వాళ్లకే ఓటేయాలి. సద్దితిన్న రేవు తలవాలి’ అని చెప్పారు.
కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి ప్రధాత అని హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌లో బీఆర్ఎస్ను మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పారు. ‘కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే..? ఇప్పుడు ఎట్లుంది..?
ఆలోచించండి. ప్రజ్ఞాపూర్-గజ్వేల్ రోడ్డు అప్పుడు ఎట్లుండే..? ఆ రోజు గజ్వేల్ దవాఖాన పందులకు నిలయంగా ఉండేది. ఈ రోజు 250 పడకల ఆసుపత్రి తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించింది కేసీఆర్. గజ్వేల్‌కు ఆర్డీవో ఆఫీస్, రైలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఊర చెరువు, పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్ కాదా..? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,00,116 అందించి మేనమామలా ఆదుకున్నది కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్‌తోపాటు 13,000 అందించిన ఘనత కేసీఆర్‌ది’ అన్నారు.
‘మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ బిడ్డల కోసం గురుకులాలు స్థాపించి చదువుల విప్లవం తెచ్చింది కేసీఆర్. ఒకప్పుడు గజ్వేల్‌లో మూడు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి పోయి.. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందించారు. బిందెలు పట్టే కష్టం లేకుండా చేసి, మహిళల కష్టాలు తీర్చింది కేసీఆర్. రైతుబంధు ఎందుకు వేయలేదు అంటే ఎలక్షన్ అయ్యాక ఇస్తా అంటున్నాడు రేవంత్. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ 11 సార్లు రైతుబంధు ఆపలేదు. ఇంటింటికీ బియ్యం, మందులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఇప్పటికీ రెండు రైతుబంధులు ఎగ్గొట్టిండు. ఇది మూడోది. ఎగ్గొట్టిన రెండు, ఇప్పుడు రావాల్సిన ఒకటి కలిపి మూడు రైతుబంధులు వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నాం. కావాలంటే మాకు అభ్యంతరం లేదని ఎలక్షన్ కమిషన్‌కు మేమే లేఖ ఇస్తాం. 11వ తేదీలోగా రైతుబంధు వేయకపోతే రైతులు నిన్ను చీల్చి చెండాడుతారు’ అని హరీష్‌రావు హెచ్చరించారు.
‘త్యాగాలతో, ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చాలు బూతులు మాట్లాడే బూతుల పిత. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తుండు. సర్వనాశనం చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పెన్షన్ అడిగితే లాగుల తొండలు వదులుతా, హామీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి బుద్ధి.. కుక్క తోక వంకర అన్నట్టే ఉంది. గతంలో రూ.
200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచినా ఒక్క రూపాయి పెంచలేదు. ఇప్పటివరకు ఒక్కో అవ్వతాతకు రూ.52,000 ప్రభుత్వం బాకీ పడింది’ అని చెప్పారు. ‘మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నాడు. ఎవరికైనా వచ్చిందా..? ఫ్రీ బస్సు అని మగోళ్లకు డబుల్ టికెట్ కొట్టి, ఆడవాళ్లకు తిప్పలు పెట్టారు. పువ్వు గుర్తు వాళ్ళు ఎన్నడైనా ఒక్క రూపాయి పని చేశారా..? అక్షింతలు పంచడం తప్ప ఏమైనా చేశారా..? యాదాద్రి నరసింహ స్వామి గుడి కట్టింది కేసీఆర్. గజ్వేల్ వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం, శివాలయం అద్భుతంగా కట్టించింది కేసీఆర్. పనిచేసే వాళ్లకు ఓటేద్దామా..? అక్షింతలు వేసే వాళ్లకు ఓటేద్దామా..? కేసీఆర్ ముస్లిం మైనార్టీ పిల్లల చదువు కోసం ఆలోచించి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. షాదీ ముబారక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాక మైనార్టీల కోసం ఒక్క రూపాయి పనిచేశారా..? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేదు. చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి’ అని హరీష్‌రావు మండిపడ్డారు.
‘రేవంత్‌రెడ్డీ నువ్వు కేసీఆర్‌ని తిడతావా..? నీ మొఖానికి పండిన వడ్లు కొనే తెలివిలేదు. దళితబంధు బంద్ పెట్టి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నావు. మన తెలంగాణను కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలి. ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారు. రెండేళ్లలో వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ గెలవాలి’ అని చెప్పారు.