Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): ఎన్నికలకు చివరి ఆరు నెలల ముందే పాలనపై చర్చ జరుగుతుందని, అప్పటి వరకు ఎవరూ పట్టించుకోరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నేత కేకేతో కలిసి సోమవారం మరో సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆయనతో సమావేశం అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా అనేక పథకాలు తీసుకొచ్చామని, ఇప్పుడు వీటిని గాడిలో పెట్టడంపై దృష్టిసారిస్తామని చెప్పారు. మావోయిస్టులు, కగార్ అంశంపై జానారెడ్డితో చర్చించినట్టు తెలిపారు. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
మావోయిస్టులతో శాంతి చర్చల్లో గతంలో ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించడంతో అధిష్ఠానంతో చర్చించి మరోమారు వారికే బాధ్యత అప్పగిస్తామని తెలిపారు. రాహుల్‌గాంధీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ విషయంలో బయట ఎవరేమనుకున్నా తాను పట్టించుకోబోనని స్పష్టంచేశారు. మరో 20 ఏండ్లు తాను రాజకీయాల్లో ఉంటానని, చట్ట ప్రకారమే నడుచుకుంటానని, కక్ష సాధింపు రాజకీయాలు చేయబోనని అన్నారు. తాను మాట ఇస్తే నెరవేరుస్తానని, అందుకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవే ఉదాహరణ అని చెప్పారు. కొందరు అధికారుల గురించి తెలిసినప్పటికీ వారిని కొనసాగించాల్సి వస్తున్నదని, వేరే మార్గం లేదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తానని సీఎం తెలిపారు.