Telangana | హడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నాలుగు పథకాలను తక్షణం ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ పల్లెల్లో నాలుగు పథకాలను వందశాతం అమలు చేస్తామన్నప్పటికీ.. రెండు నెలలు దాటినా ఆ పథకాలు ఇంకా ప్రొసీడింగ్స్ దశను దాటలేదు. సీఎం సొంత నియోజకవర్గం లోని చంద్రవంచ మొదలుకొని మంత్రుల సెగ్మెంట్లలోని పైలట్ గ్రామాల వరకు అన్నిచోట్లా ఒకే స్థితి! ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితి!
నారాయణపేట జిల్లా కొల్లూరుకు చెందిన ఈమె పాపనోళ్ల నీలమ్మ. గ్రామసభలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా నీలమ్మను ఎంపిక చేశారు అధికారులు. సీఎం జనవరి 26న గ్యారెంటీగా పథకం ప్రారంభిస్తారని చెప్పిన అధికారులు.. ఇల్లు కట్టుకోవడానికి జాగ ఖాళీ చేసుకుని రెడీగా ఉండాలని సూచించారు. దీంతో ఏండ్ల నాటి రేకుల ఇంటిని కూలగొట్టుకున్నది నీలమ్మ. రెండు నెలలు దాటింది. అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఇప్పుడు ఇలా తడకల కింద ఆ కుటుంబం తలదాచుకుంటున్నది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ గ్రామాల్లో ప్రారంభించిన నాలుగు పథకాల అమలు తీరు ఎండమావిని తలపిస్తున్నది. వందశాతం అమలు చేస్తామని చెప్పిన సర్కారు కేవలం మంజూరు పత్రాలతో సరిపెట్టడడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. స్వయంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పైలట్ గ్రామాలను పరిశీలించినా ఎక్కడా వందశాతం పథకాలు అమలవుతున్న దాఖలాల్లేవు.
ఆయా గ్రామాల్లో ఎవరిని తట్టినా ‘రుణమాఫీ కాలేదు’ అని ఓ రైతు.. ‘రైతు భరోసా పడలేదు’ అని మరో రైతు.. ‘రేషన్ కార్డు మంజూరు చేశారు కానీ నంబర్ కేటాయించలేదు’ అని ఓ లబ్ధిదారుడు.. ‘ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోసుకున్నం కానీ బిల్లులు వస్తాయా? అంటూ ఒకరు.. ‘నాకు గుంట భూమి లేకున్నా ఆత్మీయ భరోసా రాలేదు’ అంటూ ఒకరు.. ‘ఉన్న పింఛన్లు వస్తలేవు.. కొత్తవాటికి దిక్కులేదు’ అంటూ ఒకరు వాపోయారు.
ప్రభుత్వం తమ గ్రామాలను పైలట్ కింద ఎంపిక చేస్తే ఇక అన్ని పథకాలు అమలవుతాయనుకున్నామని, కానీ అశాభం గమే అయిందని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంజూరు పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, అనర్హులను ఎంపిక చేశారని చెప్తున్నారు. కొన్నిచోట్ల పునాదుల వరకు నిర్మించుకున్నవారు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడి పథకాలు అక్కడే ఆగిపోయాయని, తమను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందంటూ ఆగ్రహంతో ఉన్నారు.
సంగారెడ్డి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం పుల్కల్ మండలంలోని పైలట్ గ్రామం ఇసోజిపేటలో 4 పథకాలు వందశాతం అమలుకు నోచుకోలేదు. దామోదర స్వయంగా పథకాలను ప్రారంభించినా అతీగతీ లేకుండా పోయా యి. గ్రామంలో 1138 మంది జనాభా ఉన్నారు. 317 మందికి ఆత్మీయ భరోసా పథకం అందాల్సి ఉంటే 30 మందికే వర్తించింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం 253 మంది దరఖాస్తు చేసుకోగా 123 మందిని అర్హులుగా గుర్తించారు. కేవలం 13 మందికే మంజూరు చేశారు. వీరిలో 8 మందే నిర్మాణం ప్రారంభించారు. బేస్మెంట్ వరకు పూర్తయినా బిల్లులు రాలేదు. మహాలక్ష్మి పథకంలో రూ.2500 ఎవరికీ రాలేదు.150 మందికిపైగా రూ.500కు గ్యాస్ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం 100 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా ఒక్కరికీ అందలేదు. కొత్త రేషన్ కార్డులు, పేర్ల చేర్పు కోసం 200 మంది దరఖాస్తు చేసుకోగా ఎవరికీ మంజూరు కాలేదు. 458 మంది రైతుల్లో 440 మందికే రైతుభరోసా అందింది. 314 మంది రైతుల్లో 197 మందికే రుణమాఫీ అయ్యింది.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్న సంతోషం లేకుండాపోయింది. మంజూరు కాంగనే రూ.2 లక్షల చొప్పున అప్పుచేసి బేసిమెంట్ వరకు కట్టుకున్నం. ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు.
ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని పైలట్ గ్రామం ముందిగొండ మండలం ఖానాపురంలో పథకాల అమలుపై గ్రామస్తులకు ఆశాభంగమే అయింది. ఇక్కడ జనాభా 800 మంది ఉండగా ఓటర్లు 538 మంది ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 194 మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడత 107 మందిని గుర్తించారు. లిస్టు-1 పేరుతో 19 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇల్లు లేకుండా ఇంటి స్థలం కలిగిన వారికి అవకాశం కల్పించారు. మంజూరైన 19లో 9 ఇండ్ల పనులే ప్రారంభానికి నోచుకున్నాయి. మిగతా 10 ఇండ్లకు సాంకేతిక కారణాలను చూపెడుతూ పెండింగ్‌లో పెట్టారు.
ఇక లిస్టు-2లో ఇల్లులేని వారు, స్థలంలేని వారిని ఎంపిక చేశారు. వీరిలో ఆరుగురు లబ్ధిదారులు ఉండగా ఇంటి స్థలం ప్రభుత్వమే చూపించాల్సి ఉండటంతో వారికి తొలి జాబితాలో చోటు కల్పించలేదు. లిస్టు-3లో 144 మందిని లబ్ధిదారులుగా చూపెట్టిన అధికారులు వీరందరూ పక్కా భవనంలో నివసిస్తున్నారని, వీరికి మూడో జాబితాలో అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. జనవరి 26న జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి స్వయంగా హాజరై తమకు ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఇండ్లు ఏవని అడిగితే ప్రభుత్వం ముఖం చాటేస్తున్నదని, మంజూరు పత్రం పొందిన మాలోజి కవిత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంజూరు పత్రం రావడంతో రూ.లక్ష అప్పు సైతం చేశామని, అయినా ఇల్లు మంజూరు కాలేదని వాపోయింది. కొత్త రేషన్‌కార్డులకు 104 మందిని లబ్ధిదారులుగా గుర్తించినా ఒక్కరికీ కార్డు రాలేదు.
మేము మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్లో ఉంటున్నా మాకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయలేదు. మా ఊరిని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, మంత్రి, అధికారులు చెప్పిండ్రు. మంత్రి స్వయంగా మాకు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండుమని చెప్పిండ్రు. కానీ.. ఇప్పుడు అధికారులు మీకు ఇల్లు రాలేదు తర్వాత వస్తదని చెప్తున్నరు. మా ఊరిలో 107 మందికి ఇండ్లు వచ్చాయని చెప్పి ఇప్పడు కొందరికే ఇచ్చిండ్రు. నేను, మా మరిది, అత్తమామలు అందరం కలిసి ఒకే ఇంట్ల ఉంటున్నం. వర్షం వస్తే ఇంట్లోకి నీళ్లొస్తున్నయి. ఇందిరమ్మ ఇల్లు వస్తే మంచిగ కట్టుకుందామనుకున్నం. మళ్లీ మాకు ఇల్లు ఎప్పుడిస్తారో ఎవరూ చెప్తలేరు.
కొల్లాపూర్, మార్చి 25: నాగర్‌కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం పసుపులను ప్రభుత్వం పైలట్ కింద ఎంపిక చేసింది. అనర్హులను ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాలకు ఎంపిక చేసినట్టు ఆరోపణలున్నాయి. 2,147 మంది జనాభా కలిగిన పసుపులలో 455 ఇండ్లున్నాయి. జనవరిలో మంత్రి జూపల్లి సమక్షంలో గ్రామసభ జరుగగా ఇండ్లకు 20 మందిని ఎంపిక చేసి తానే స్వయంగా పేర్లు ప్రకటించారు.
ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి మాత్రమే మంజూరయ్యాయి. 1,317 మంది రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా అందలేదు. పింఛన్లు, రేషన్ కార్డులు ఎవరికీ మంజూరు కాలేదు. ఉపాధి హామీ పని చేయని, వ్యవసాయ భూమి ఉండి ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ జాబ్ చేసే ఓ వ్యక్తికి ఆత్మీయ భరోసా వర్తించింది. కానీ దళిత కాలనీలో సొంత ఇల్లు, గుంట భూమి కూడా లేని ఒంటరి మహిళ శాంతమ్మకు వర్తించలేదు. ఉపాధి జాబ్ కార్డు ఉండి పనులు చేసినా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇంటి పథకానికి ఆమె నోచుకోలేదు.
బీఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన మరళినాయక్కు నేను పెద్దనాన్నను. అందుకే కాంగ్రెస్ నాయకులు మాకు ఏ పథకం ఇస్తలేరు. పని చేయ శాతగాక గొడ్డుకారంతో కాలం గడుపుతున్న. మా మీదక రాజకీయలు చేసుడు దేనికి మంచిది? మాకు పిల్లలు కూడా లేరు.
ఊర్లె పని లేక నాందేడ్‌లో మట్టిపని చేసుకొని బతుకుతున్నం. ఇండ్లు ఇస్తున్నరంటే ఊరికి వచ్చినం. మం త్రి మా గల్లీకి వచ్చిండు కానీ మమ్మ ల్ని గుర్తించలే. 20 ఏండ్ల కింద బేస్మెంట్ కట్టుకున్నం.
మేము 11 మందిమి. మా కు ఇల్లు వస్తదని సంబురపడ్డం. ఇల్లు రాలే. ఆత్మీయ భరోసా రా లే. నా కొడుకు కాంగ్రెస్ కోసం పనిచేసిండు. లీడర్లే ఇండ్లు పం చుకున్నరు.
ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గమైన పాలేరులోని ఖమ్మంరూరల్ మండలం ఆరెంపులను పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. తమ గ్రామం పైలట్ కింద ఎంపిక కావడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయినా అది ఎంతోకాలం నిలువలేదు. ఊరిలో మొత్తం జనాభా 3,100 కాగా ఓటర్ల సంఖ్య 1,768. ఇందిరమ్మ ఇండ్ల కోసం 529 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తొలివిడతగా 104 మందిని ఎంపిక చేశారు. రైతుభరోసా లబ్ధిదారులు 614 మందిలో 14 మందిని మినహాయించి మిగిలిన వారికి ఒక్క సీజన్‌కే ఎకరానికి రూ.6 వేలు ఖాతాలో జమ అయ్యాయి.
ఆత్మీయ భరోసా కింద ఎంపిక చేసిన 114 మందిలో 110 మందికే రూ.6 వేల చొప్పున జమయ్యాయి. రేషన్ కార్డులకు సంబంధించి 39 మందికి మంజూరు కాలేదు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ఇప్పటివరకు ఏ ఒక్క ఇల్లు కూడా పునాది బిల్లుకు సైతం నోచుకోలేదు. ఇండ్లకు 529 మంది దరఖాస్తు చేసుకోగా ఎల్-1 (రేకులు, మట్టి గోడలు, కిరాయి ఇంట్లో ఉండేవాళ్లు) 103 మంది, ఎల్-2 (పాత ఇండ్లు ఉండి నూతన ఇంటికి స్థలం లేని వాళ్లు) 69 మంది, ఎల్-3 (స్లాబ్ ఇండ్లు కలిగిన వాళ్లు) 399 అని మూడు రకాల జాబితాల తయారీలోనే అధికారులు నిమగ్నమయ్యారు తప్ప నేటి వరకు ఒక్కరికి కూడా కనీసం పునాది బిల్లు ఇప్పించలేదు. ఇక పాత ఇండ్లు కూల్చుకొని కొత్త ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్ల ఉంటున్నం. మా బాబు గణేశ్ పేరు మీద ఇల్లు మంజూరైంది. జెండా వందనం రోజు మంజూరు పత్రం ఇచ్చిండ్రు. ఇప్పుడు అడిగితే జాబితాలో పేరులేదు అంటున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ మండలం గుండ్లపల్లి పైలట్ గ్రామంగా ఎంపికైంది. ఇది జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్నది. ఊరిలో మొత్తం 332 ఇండ్లు ఉండగా జనవరి 26న నాలుగు పథకాలను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయి నోడల్ అధికారి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
కీలకమైన ఇందిరమ్మ ఇండ్ల కోసం తొలుత 181 మందిని ఎంపిక చేశారు. అదేరోజు వీరిలో 115 మందికి మంజూరు పత్రాలు అందించారు. తర్వాత వివిధ కారణాలతో ఆ సంఖ్యను భారీగా కుదించారు. ప్రస్తుతం 38 మందికే ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వగా వారిలో ముగ్గురే ముగ్గుపోసుకున్నారు. ఆత్మీయ భరోసా కింద 12 మంది నగదు అందాల్సి ఉండగా ఒక్కరికీ డబ్బులు జమ కాలేదు. 90 మందికి రేషన్ కార్డుల మంజూరు ఇవ్వగా వీరిలో ఎవ్వరికీ సరుకులు అందడం లేదు.
ఆత్మీయ భరోసాకు ఎంపికైనట్టు నా తో పాటు 12 మందికి పత్రాలు ఇచ్చిం డ్రు. ఏడాదికి రూ.12 వేలు పడుతయన్నరు. ఉపాధి కూలి పని చేసుకుంట బతుకుతున్నం. మా లాంటి వాళ్లకు ఆత్మీయ భరోసా ఆసరా అయితదనుకుంటే ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు.
మహబూబ్‌నగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు నుంచి 4 స్కీములు అమలు చేస్తున్నాం.. ఈ అర్ధరాత్రి నుంచి మీ అకౌంట్లో టకీటకీ మని డబ్బులు పడతాయి’ అంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 26న కొడంగల్ నియోజకవర్గంలోని పైలట్ గ్రామం చంద్రవంచలో చేసిన వాగ్దానమిది! దాదాపు 50 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పైలట్ గ్రామాల్లోనూ హామీలు అమలకు అతీగతీలేదని స్పష్టమవుతున్నది. అదే రోజున చంద్రవంచలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు సీఎం శంకుస్థాపన చేశారు.
పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. సీఎం వచ్చి వెళ్లాక ఈ ఊరికి ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. ఇక సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ‘పరువు పోవద్దు’ అన్న భయంతో ఇక్కడ 156 మందికి రేషన్ కార్డుల్లేకున్నా బియ్యం మాత్రం ఇస్తున్నారు. రైతు భరోసా కింద 737 మంది రైతులను ఎంపిక చేసి 724 మంది జాబితాను ట్రెజరీకి పంపారు. 660 మందికే డబ్బులు పడ్డాయి. చాలా మంది ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నా 33 మంది అకౌంట్లలోనే డబ్బులు జమయ్యాయి. 192 మందిని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేశారు. 70 మందే నిర్మాణాలను ప్రారంభించారు. అవీ బేస్మెంట్ లెవల్లోనే ఉన్నాయి. బిల్లులు ఇంకా రాలేదు.
సిద్దిపేట, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో అక్కన్నపేట మండలం కుందన్‌వానిపల్లి పైలెట్ గ్రామంగా ఎంపికైనా పథకాలు అరకొరగానే అమలవుతున్నాయి.గ్రామంలో ఇంకా 40 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వీరిలో లక్ష రూపాయల రుణం ఉన్న వారికీ మాఫీ వర్తించలేదు.
రైతు భరోసా సైతం మరో 50 మంది రైతులకు వర్తించలేదు. గ్రామంలో 206 మందికి జాబ్ కార్డులు ఉండగా ఆత్మీయ భరోసా 40 మందికే అందించారు. రేషన్ కార్డుల కోసం 76 మంది దరఖాస్తు చేసుకోగా నలుగురివి తొలగించి 9 మందికే ప్రొసీడింగ్స్ అందించారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 285 మంది దరఖాస్తు చేసుకుంటే 152 మందిని ఎంపిక చేసి కేవలం 40 మందికే మంజూరు పత్రాలు ఇచ్చారు.
మాకు ఆరెకరాల భూమున్నది. బ్యాంకుల రూ.2.30 లక్షల లోను తీసుకున్నం. కానీ రుణమాఫీ కాలే. రైతు భరోసా కూడా రెండు పసల్లు పడలే. మా కొడుకు అనంతరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలున్నరు. రేషన్‌కార్డు ఇప్పటికీ ఇయ్యలే.
వరంగల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ములుగు, నమస్తే తెలంగాణ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలోని పైలట్ గ్రామంలో పథకాల అమలు తీరు విచిత్రంగా ఉన్నది. ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలం లింగాపూర్ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తీరు విస్తుపోయేలా ఉన్నది. జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు కాలేదు. వేరే రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి వచ్చి ఉంటామని చెప్తున్నవారికి మొదటి దశలోనే మంజూరు చేశారు. వీరికి జాగ లేక ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. జాగ ఉన్న వారికి అవసరం ఉన్నా మంజూరు కాలేదు. ఊరిలో మొత్తం 433 మంది ఉన్నారు. 110 కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
ప్రభుత్వం ఈ ఊరికి 46 ఇండ్లు, 61 రేషన్ కార్డులను కొత్తగా మంజూరు చేసింది. ఆత్మీయ భరోసాకు 15 మందినే అర్హులుగా ప్రకటించింది. ఇందిరమ్మ ఇండ్లకు 46 మందిని ఎంపిక చేసినా వీరిలో 26 మందికి స్థలాలు లేక పెండింగ్‌లో పెట్టారు. 18 మంది ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకొని సొంత ఖర్చులతో పునాదులు తీస్తున్నారు. ఒకరు పెట్టుబడి ఖర్చులు లేవని ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. మరొకరు ఊరిలోని మరో ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటాననడంతో పెండింగ్‌లో ఉన్నది. ఎక్కువ మంది శిథిలావస్థకు చేరిన ఇండ్లలోనే ఉంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 26 మందికి జాగ లేదని, వీరిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల గిరిజనులని గ్రామస్తులు తెలిపారు.
ఊరు పొందిచ్చినప్పటి నుంచి నేను ఈ ఊర్లనే ఉంటున్న. అందరికీ ఇండ్లు వస్తయనుకుంటే జాగ లేనోళ్లు, ఊర్లో ఉండని వాళ్లకు మంజూరు చేసిండ్రు. మాకెందుకు రాలేదని మంత్రి సీతక్కను, అధికారులను అడిగితే తర్వాత వస్తదంటున్నరు. ఎప్పుడు కూలుతదో తెల్వని పెంకుటింట్ల ఉంటున్నం.
సూర్యాపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పరిధిలోని పైలట్ గ్రామం రఘునాథపాలెంలో పథకాల అమలు అధ్వానంగా ఉన్నది. గ్రామంలో 562 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే 339 మందికి మంజూరైనట్టు చెప్తున్నా ఎవరికీ రేషన్ సరుకులు అందడం లేదు.
ఆత్మీయ భరోసాకు గాను 164 మంది దరఖాస్తు చేసుకోగా 130 మందినే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,225 దరకాస్తులు రాగా ఇప్పటి వరకు అర్హుల జాబితాను ప్రకటించలేదు. రైతు భరోసా 1,547 మందికి వచ్చింది. ఆర్భాటంగా సమావేశాలు పెట్టి ఆగమేఘాల లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలిచ్చినా ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
ఉపాధి హామీలో పని చేస్తున్న. మాకు గుంట భూమి కూడా లేదు. ప్రభుత్వం ఆత్మీయ భరోసా కింద రూ.12వేలు ఇస్తానని చెప్పింది. మరి మాకు అర్హత ఉన్నా గుర్తించలేదు. మళ్లీ సర్వే చేసి నిజమైన లబ్ధ్దిదారులను గుర్తించి మాకు న్యాయం చేయాలి.
పెద్దపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం మంథని మండలంలోని అడవిసోమన్‌పల్లి పైలట్ గ్రామంగా ఎంపికైనా పథకాల అమలు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామంలో 1239 మంది ఉండగా రేషన్ కార్డుల కోసం 78 మంది దరఖాస్తు చేసుకున్నారు.
67 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీరిలో 20 మందికే సరుకులు ఇస్తున్నారు. 438 మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా 272 మందికి మంజూరు చేసి 163 మందికి గ్రౌండింగ్ చేశారు. 2 ఇండ్లు బేస్మెంట్ వరకు అయినా బిల్లులు రాలేదు. ఆత్మీయ భరోసా కింద 369 మందికి లబ్ధికలగాల్సి ఉంటే గుంట భూమి నిబంధనతో కేవలం 49 మందినే ఎంపిక చేశారు.
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూ రైంది. నా కొడుకు నేను కష్టపడి కట్టు కుంటున్నం. బెస్మెంట్ పూర్తయ్యింది. ఇంకా బిల్లు రాలే. త్వరగా జమచేస్తే ఇల్లు కట్టుకుంటం.
ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం మల్లేపల్లి పైలట్‌గా ఎంపికైంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఊరిది. మొత్తం జనాభా 960 మంది దాకా ఉండగా ఓటర్లు 780 మంది ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 100 మంది దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం 30 మందినే ఎంపిక చేసింది.
ఒక్క నిర్మాణం కూడా మొదలు కాలేదు. ఆత్మీయ భరోసా కింద మొత్తం 22 మందిని గుర్తించినా వారిలో నలుగురికి లబ్ధి చేకూరలేదు. కొత్త రేషన్‌కార్డులు 54 మందికి మంజూరు కాగా సరుకుల కోసం వెళ్తే పేర్లు ఆన్లైన్లో నమోదు కాలేదని అధికారులు చెప్తున్నట్టు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతుభరోసా కోసం 226 మందికి పత్రాలిచ్చినా అనేకమంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.
ఇందిరమ్మ ఇంటి కోసం ఎంతో హడావుడిగా మూడుసార్లు దరఖాస్తులు తీసుకున్నారు. ఇల్లు వస్తదని ఎంతో సంతోషపడ్డం. కానీ మాకు మంజూరు కాలేదు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఏదో చేస్తదనుకుంటే ఏమీ చేయడం లేదు.