హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ ఫ్లైటెక్కారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ 28 నెలల్లో ఆయన 65 సార్లు ఢిల్లీకి వెళ్లారు. బడ్జెట్ సమావేశా లు జరుగుతున్న సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర్గేతో సమావేశమైన వారిలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళ, వెస్ట్‌బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ర్టాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వేళ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.
కేరళలో జరిగే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. తెలంగాణ నుంచే ఆర్థికంగా ఆధారపడినట్టు తెలుస్తున్నది. ఖర్గేకు పలు ఆర్థిక అంశాలపై ‘బ్రీఫింగ్’ ఇచ్చినట్టు సమాచారం. అనంతరం కేరళ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన వేం నరేందర్‌రెడ్డి.. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. కేరళ సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్‌ను వేం కలువడం చర్చనీయాంశమైంది.