హైదారాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆ పార్టీలోని చోటామోటా లీడర్ల నుంచి ముఖ్యమంత్రుల వరకు పోటీపడుతుంటారు. ఆయన దృష్టిలో పడేందుకు సేవా కార్యక్రమాలు చేసేవారికి లెక్కేలేదు. అదే కోవలో గురువారం రాహుల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు ‘బనకచర్ల’ వివాదాన్ని కారణంగా చూపుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. కానీ ఎప్పటిలాగే బర్త్‌డే విషెస్ చెప్పే అవకాశం రేవంత్‌కు దక్కలేదు. రాష్ట్ర ఎంపీ మల్లు రవి దర్జాగా వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులకు రాహుల్ అపాయింట్మెంట్ ఇచ్చినా..
యథాప్రకారం రేవంత్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. తెలంగాణ సీఎం ఢిల్లీలో దిగగానే బనకచర్ల వివాదంపై కేంద్రమంత్రులను కలిసేందుకు క్షణాల్లో అపాయింట్మెంట్ దొరికింది. కానీ సొంత పార్టీ నేతను కలిసేందుకు మాత్రం అనుమతి లభించలేదు. నిరుడు సైతం ఇదే పరిస్థితి. రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదు. దీంతో రేవంత్‌ను దూరం పెట్టారని ప్రచారం జరగగా, ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు ప్రదర్శించాల్సిన అవసరం లేదని వివరణ ఇస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆన్లైన్ వేదికగా మరోసారి అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి మాత్రం ఢిల్లీలోనే రోజంతా పడిగాపులు కాసినా అపాయింట్మెంట్ దొరకకపోవడంపై కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డి ఏడాదిన్నరగా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు సులభంగా దొరుకుతున్నాయి. కానీ ఎంత ప్రయత్నించినా రాహుల్‌గాంధీని కలిసే అవకాశం లభించడం లేదన్నది బహిరంగ రహస్యం. పథకాల ప్రారంభోత్సవాలకు పిలిచినా, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరకు ఆహ్వానించినా, చివరికి సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరినా రాహుల్ పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ముందు కులగణనపై ప్రజెంటేషన్ ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకున్నా, ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. దీంతో రాహుల్, రేవంత్ మధ్య దూరం ఎందుకు పెరిగిందనే చర్చ ఇంటా, బయట తీవ్రంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా రాహుల్ గాంధీని కలవాలని సీఎం డిసైడ్ అయినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అందుకే గురువారం రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి, శుభాకాంక్షలు చెప్పి, ఫొటో దిగి, సోషల్ మీడియాలో వైరల్ చేయాలని రేవంత్ భావించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గురువారం ఢిల్లీలో రాహుల్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఓ కాంగ్రెస్ కార్యకర్త
తమ ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నదనే ప్రచారాన్ని ఆపడానికి పుట్టినరోజే సరైన సమయమని భావించి 46వ ఢిల్లీ పర్యటనను ప్లాన్ చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుట్టిన రోజున అపాయింట్మెంట్ అడిగితే కాదు అనరని రేవంత్ భావించగా.. రాహుల్ మాత్రం కాదనేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలురాష్ర్టాకు చెందిన 24 మంది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలను రాహుల్‌గాంధీ కలిసినట్టు తెలిసింది. ఢిల్లీలో కీలక కాంగ్రెస్ నేత ద్వారా ప్రయత్నించినా రేవంత్‌రెడ్డికి మాత్రం నో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. తనకు పిలుపు అందుతుందని సీఎం గురువారం రాత్రి వరకు వేచి చూసినట్టు చెప్తున్నారు. ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కుటుంబంతో సహా కలిసినప్పుడు కూడా రేవంత్ ఢిల్లీలోనే ఉన్నా, రాహుల్ అనుమతించని సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ రాహుల్‌కు, తనకు గ్యాప్ లేదని దబాయించి చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎలా కవర్ చేసుకుంటారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డిపై బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే అపవాదు కాంగ్రెస్‌లో ఉన్నది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఏదో ఒక రకంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇటీవలే తాను టీడీపీ స్కూల్, బీజేపీ కాలేజీ అంటూ సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో మరోసారి ‘స్కూల్’ అంశం తెరమీదికి వచ్చినట్టు సమాచారం. గురువారం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదిలాబాద్ జిల్లా అంశాలపై ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్శంకర్తో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రిని కలిసేందుకు సీఎం , మంత్రి ఉత్తమ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ‘వాళ్లిద్దరు(ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్), నేను, జితేందర్‌రెడ్డి ఒకటే సూల్(టీడీపీ) నుంచి వచ్చాం’ అని ఖట్టర్‌కు చెప్పినట్టు సమాచారం. దీంతో ఖట్టర్‌తోపాటు అకడున్న నేతలంతా నవ్వుకున్నట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి.