Telangana | హైదరాబాద్ : మందుబాబులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహాయించి.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం పెంచనున్నట్లు సమాచారం. ప్రతి లిక్కర్ బాటిల్‌పై కనీసం రూ. 50 పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజ్ అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రెండు, మూడు విధానాల్లో లిక్కర్ ధరలను పెంచి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఏయే విధానం ద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుందో కూడా ఆ నివేదికల్లో వెల్లడిస్తారు. అధికారులతో సమీక్షించిన తర్వాత మరింత లోతైన అధ్యయనం చేసి ధరలు పెంపుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్నా రూ. 2000 కోట్లు అదనపు రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. బీర్ల ధరలను 15 శాతం వరకు పెంచుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ధరల పెరగడంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలను అధ్యయనం చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో 15 శాతం ధరలు పెంచుకోవచ్చని చెప్పింది.