రెండున్నరేండ్లు.. 4.14 లక్షల కోట్లు.. రుణ సేకరణలో రేవంత్ సరార్ కొత్త రికార్డులు
30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు అత్యంత వేగంగా అడుగులు వేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
- 30 నెలల్లోనే తెలంగాణ అప్పులు రూ. 4.14 లక్షల కోట్లు
- రోజుకూ రూ.454 కోట్ల అప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై రూ.1.18 లక్షల దాకా రుణ భారాన్ని మోపిన రేవంత్రెడ్డి సర్కార్
- తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎఫ్ఆర్బీఎం, నాన్ఎఫ్ఆర్బీఎం కలిపి అప్పు రూ.4.70 లక్షల కోట్లే
నిమిషం ముందు పుట్టిన పసిగుడ్డు మొదలు.. పండుటాకు వరకూ తెలంగాణలో ప్రతి ఒక్కరి నెత్తిపై సగటున రూ.1.18 లక్షల అప్పు ఉన్నదని తెలుసా? మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గడిచిన రెండున్నరేండ్ల వ్యవధిలో రేవంత్ ప్రభుత్వం అక్షరాలా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. వీటితో ఏదైనా బహుళార్ధక సాధక ప్రాజెక్టు కట్టిందా? కొత్తగా ఏదైనా సంక్షేమ పథకం ప్రవేశపెట్టిందా? అంటే అదీలేదు. మొత్తంగా కాళేశ్వరం వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను కట్టిచూపించిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పును.. రెండున్నరేండ్ల పాలనలోనే ప్రభుత్వం దాటడం ఆర్థికవేత్తలకూ విస్మయాన్ని కలిగిస్తున్నది.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): 30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు అత్యంత వేగంగా అడుగులు వేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. బడ్జెట్ పరిమితులకు లోబడి చేసిన అప్పుల కంటే, కార్పొరేషన్ల పేరిట తెచ్చిన బడ్జెటేతర అప్పులే ఇందులో ఎకువగా ఉండటం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితుల ద్వారా రూ.1.94 లక్షల కోట్లు సేకరించింది. దీనికితోడు, బడ్జెట్తో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్లు, ప్రత్యేక ప్రయోజన వాహకాల (ఎస్పీవీలు) ద్వారా మరో రూ.2.05 లక్షల కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకున్నది. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో మరో రూ.13,600 కోట్ల అప్పు కూడా రాష్ట్ర ఖాతాలో చేరింది. చివరికి 2026 ఏప్రిల్, మే రెండు నెలల్లోనే ఎఫ్ఆర్బీఎం కింద రూ.12,900 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రూ.14,000 కోట్ల చొప్పున మొత్తం రూ.26,900 కోట్ల అప్పు తెచ్చింది.
రెండున్నరేండ్లలోనే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్ల పాటుసాగిన బీఆర్ఎస్ పాలనలో మొ త్తం అప్పులు రూ.4.7 లక్షల కోట్లుగా ఉన్నా యి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన రుణాలు రూ.69,000 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ చేసిన బడ్జెటేతర అప్పులు కేవలం రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పులో సగానికన్నా ఎక్కువగా కాంగ్రెస్ 30 నెలల్లోనే తెచ్చేసింది. ఇక బడ్జెటేతర (నాన్-ఎఫ్ఆర్బీఎం) అప్పుల విషయానికి వస్తే.. గత ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన దానికి రెండింతల అప్పును కాంగ్రెస్ సర్కార్ ఈ రెండున్నరేండ్లలోనే చేసి చూపించింది. రాష్ట్ర అప్పుల భారం జీఎస్డీపీ నిష్పత్తిని వేగంగా పెంచుతున్నది. 2023-24లో జీడీపీలో 27 శాతంగా ఉన్న ప్రభుత్వ అప్పు, 2025-26 నాటికి 28 శాతానికి చేరింది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది 29 శాతానికి పెరుగుతుందని అంచనా. ఎఫ్ఆర్బీఎం అప్పులు ఇలా విపరీతంగా పెరుగడం వల్ల రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు పూర్తిగా దెబ్బతింటుందని, భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆస్తుల సృష్టి ఎకడ?
ఏ ఒక్క భారీ ప్రాజెక్టు కట్టకుండా, ఏ భారీ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుస్థాయిలో రుణ సమీకరణ చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం నాన్-ఎఫ్ఆర్బీఎం (ఆఫ్-బడ్జెట్) అప్పులు రూ.1.1 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ప్రభుత్వం 30 నెలల్లోనే దానికి రెట్టింపు అంటే రూ.2.20 లక్షల కోట్ల ఆఫ్-బడ్జెట్ అప్పులు చేయడం గమనార్హం. రూ.వేల కోట్ల అప్పులు తెస్తున్నా.. దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో ఎలాంటి శాశ్వత మూలధన ఆస్తులు సృష్టించడం లేదని, ఆర్థికాభివృద్ధి కనిపించడం లేదని విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరులు పెరుగకుండా, కేవలం అప్పులపైనే ఆధారపడి ఉచిత పథకాల పేరుతో పాలన సాగిస్తే.. రాబోయే రోజుల్లో ఈ అప్పులకు అసలు, వడ్డీ లు చెల్లించడానికే రాష్ట్ర బడ్జెట్ అంతా ఖర్చయిపోతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి శాశ్వత ఆస్తుల (రహదారులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు) సృష్టి జరుగదని హెచ్చరిస్తున్నారు.
రోజుకూ రూ.454 కోట్లు..
2023 డిసెంబర్ నుంచి 2026 మే వరకు (సుమారు 912 రోజులు) రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ.4,14,000 కోట్ల అప్పు చేసింది. ఈ భారీ మొత్తాన్ని విశ్లేషిస్తే, రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై కూడా రుణభారం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సగటున రోజుకు దాదాపు రూ.454 కోట్ల మేర కొత్త అప్పులు చేసుకుంటూ పోతున్నది. అంటే గంటకు రూ.18.91 కోట్లు, నిమిషానికి రూ.31.51 లక్షలు రుణ సమీకరణ చేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెకల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.50 కోట్లుగా ఉన్నది. ప్రభుత్వం తెచ్చిన రూ.4.14 లక్షల కోట్ల అప్పును రాష్ట్ర జనాభా అంతటికీ సమానంగా పంచితే, ఒకొకరి తలపై రూ.1,18,285 రుణభారం పడుతుంది. అంటే, గత 30 నెలల్లోనే ప్రతి సామాన్య పౌరుడిపై అదనంగా దాదాపు రూ. రూ.1.18 లక్షల అప్పు భారం పడింది.
బీఆర్ఎస్ పాలనలో అప్పులు ఇలా..
వ్యవధి: తొమ్మిదిన్నరేండ్లు
మొత్తం అప్పు : రూ.4.70 లక్షల కోట్లు
ఇందులో ఎఫ్ఆర్బీఎం రుణాలు: రూ.3.60 లక్షల కోట్లు
నాన్-ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న అప్పు: రూ.1.10 లక్షల కోట్లు
ఏడాదికి సగటున మొత్తం అప్పు: రూ. 49,473 వేల కోట్లు
నెలకు సగటున అప్పు: రూ. 4,122 కోట్లు
రోజుకు సగటున అప్పు: రూ. 137 కోట్లు
గంటకు సగటున అప్పు: రూ. 5.7 కోట్లు
కాంగ్రెస్ పాలనలో అప్పులు ఇలా
వ్యవధి: రెండున్నరేండ్లు
మొత్తం అప్పు: రూ. 4.14 లక్షల కోట్లు
ఇందులో ఎఫ్ఆర్బీఎం రుణాలు: రూ.1.94 లక్షల కోట్లు
నాన్-ఎఫ్ఆర్బీఎం కింద అప్పు: రూ.2.20 లక్షల కోట్లు
ఏడాదికి సగటున మొత్తం అప్పు: రూ. 1.65 లక్షల కోట్లు
నెలకు సగటున అప్పు: రూ. 13,750 కోట్లు
రోజుకు సగటున అప్పు:రూ. 458 కోట్లు
గంటకు సగటున అప్పు: రూ. 19.1 కోట్లు
తెలంగాణ ప్రస్తుత మొత్తం బకాయిలు
ఎఫ్ఆర్బీఎం అప్పులు: రూ.5.54 లక్షల కోట్లు
బడ్జెటేతర అప్పులు: రూ.3.30 లక్షల కోట్లు
హైదరాబాద్ మెట్రో స్వాధీనంతో అదనపు భారం: సుమారు రూ.13,600 కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

