నల్లగొండ రూరల్, ఆగస్టు 15 : నల్లగొండ మండలంలోని కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని వైష్ణవికి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ జిల్లాపల్లి రేణుక రాజు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తాము గత పరీక్షల సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి రూ.25 వేల నగదు బహుమతి అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే పాఠశాలలో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహం అందించామన్నారు.
రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించి పాఠశాలలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమత, ఉప సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, మాజీ సర్పంచ్ నాగయ్య, వార్డు సభ్యులు పెరిక శంకర్, యాదవ రాజు, జాల నాగరాజు, శ్రీకాంత్, జానకి రాములు, స్వామి పాల్గొన్నారు.