Haritha Haram | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశ పెట్టిన పథకాలను నామరూపాలు లేకుండా చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పలు పథకాలను అటకెక్కించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో హరితహారం కార్యక్రమాన్ని కూడా చేర్చారని మండిపడుతున్నారు.
2015లో కేసీఆర్ దార్శనికతతో అమల్లోకి తెచ్చిన ‘హరితహారం’ పథకానికి మంగళం పాడడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నదని విమర్శిస్తున్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రభుత్వ స్థలాలు కనిపించడం లేదంటూ ప్రభుత్వం సాకులు చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో కూడా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించకపోవడం సర్కారు పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శమని చెప్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏటా దాదాపు 35 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. కానీ ఈ సారి కేవలం 18 కోట్ల మొక్కలు నాటుతామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. కానీ 16 కోట్ల మొక్కలతో సరిపెట్టే అవకాశాలు ఉన్నట్టు మరికొందరు అధికారులు వాపోతున్నారు. పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం కోసమే కొంచెం కొంచెం లక్ష్యాన్ని తగ్గిస్తూ వస్తున్నారని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో వన మహోత్సవానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ‘హరితహారం’లో రూ.10,822 కోట్లు ఖర్చుపెట్టి 273.33 కోట్ల మొక్కలు నాటి దేశంలోనే ఘన చరిత్ర సృష్టించారు. అటవీ పార్కులు, ప్రభుత్వ స్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, రహదారుల పక్కన మొక్కలు నాటించారు. 10,822 నర్సరీలు, 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 1,00,691 కిలోమీటర్ల రహదారులతో పాటు 12,000 కిలోమీటర్ల మేర బహుళ రహదారి వనాలు పెంచారు. నేడు అవన్నీ ఏపుగా పెరిగాయి.
పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ పాలనకు ఆనవాళ్లుగా చెట్లు దర్శనమిస్తున్నాయి. కానీ హరితహారం, వనమహోత్సవం అంటే కేసీఆర్ పేరే ప్రజలకు గుర్తుకు వస్తుందని, కేసీఆర్కు పేరు రావొద్దనే ఉద్దేశంతోనే పథకాన్ని నీరుగారుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయకక్ష సాధింపుల కోసం పచ్చదనంపై పగబట్టడం సరికాదని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు.