హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ‘దమ్ముంటే అసెంబ్లీకీ రా? మీ పాలనపై, మా పాలనపై చర్చి ద్దాం.. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహిస్తాం’ అంటూ బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక ఆయన తోకముడిచారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను వారం రోజులునిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు మాత్రం కనీసం నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించేందుకు సర్కార్ జంకుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రజాసమస్యలపై చర్చిం చే దమ్ములేకనే సర్కార్ పలాయనం చిత్తగించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలన, ఎన్నికల హామీల ఎగవేత, 22ఏ నిషేధిత భూ ములు, పాలిటెక్నిక్ విద్యార్థులకు జరుగుతున్న అన్యా యం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఏపీ జలద్రోహంపై ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. దీంతో ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహిస్తే తమకు ఇబ్బందులు తప్పవని, కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల ముందు ఎండగడుతారనే భయం పాలకవర్గంలో నెలకొన్నట్టు తెలిసింది. అందుకే వీలైనంత తర్వగా సమావేశాలను ముగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.