ప్రత్యేక రాష్ర్టావిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేండ్లు భరోసాతో ఉన్న తెలంగాణ ప్రజలను ఇప్పుడు అభద్రతాభావం వెంటాడుతున్నది. రాష్ట్ర ప్రజానీకం తెలియని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే గుండెలవిసిపోతున్నాయి. నడిరోడ్లపైనే కత్తులతో వీరంగమాడుతూ విచక్షణారహితంగా నరుకుతుంటే, రక్తపుమడుగుల్లో బాధితులు హాహాకారాలు చేస్తుంటే.. చూసిన, విన్న ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు కమ్ముకుంటున్నాయి. పేరుమోసిన దొంగలు రాత్రుళ్లు ఇండ్లను లూటీ చేస్తుండగా, నగరాల్లో పట్టపగలే తుపాకులతో కాల్చుతూ ఉత్తరాది తరహాలో బరితెగిస్తున్నారు. మునుపెన్నడూలేని ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. గల్లీల్లో గంజాయి గుప్పుమంటున్నది. సైబర్ నేరగాళ్లు రూ.వందల కోట్లు కొట్టేస్తున్నారు. నిత్యం ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. మిస్సింగ్ కేసులు, ఆర్థిక నేరాలు, ఇతర కేసులు తారాజువ్వలతో పోటీ పడుతున్నాయి. వెయ్యి రోజులుగా ఇవన్నీ అనుభవిస్తున్న సామాన్య ప్రజల్లో ‘ఇది మన తెలంగాణేనా?’ అనే ప్రశ్న తలెత్తుతున్నది.
– హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)
తొమ్మిదిన్నరేండ్లలో దేశంలోనే అగ్రస్థానానికి
తెలంగాణ స్వప్నం నెరవేరిన తర్వాత.. అంతర్జాతీయంగా ప్రఖ్యాత కంపెనీలు, దేశ, విదేశీ పెట్టుబడులు భారీగా హైదరాబాద్‌కు తరలిరావడానికి ప్రధాన కారణాల్లో శాంతిభద్రతలు ఒకటి. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణవ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, దేశానికే తలమానికమైన, అత్యాధునికమైన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వాటిని పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించారు. పోలీస్ సిబ్బందికి వేలాది వాహనాలిచ్చారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానంతో ‘పోలీసులంటే మన రక్షకులు’ అనే భావనను తీసుకొచ్చారు.
వేలాది పెట్రోలింగ్ వాహనాలు, బైక్‌లను ఇచ్చి నిరంతరం తెలంగాణవ్యాప్తంగా గస్తీకాయించారు. ఆడబిడ్డల ఒంటిపై చెయ్యివేస్తే.. ఆ చేతులకు సంకెళ్లు వేసే షీ టీమ్స్‌ను తీసుకొచ్చారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డల నుంచి 18 ఏండ్లలోపు బాలికలను చెరిపే మృగాళ్లను భరోసా కేంద్రాల ద్వారా జైలు ఊచలు లెక్కించేలా చేశారు. కత్తిపట్టే రౌడీషీటర్లపై పీడీ యాక్టులు పెట్టి తాట తీయించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోతో (ప్రస్తుత ఈగల్ ఫోర్స్) గంజాయి మూలాలను పెకిలించేశారు. సైబర్ నేరాలను అడ్డుకొనేందుకు దేశంలోనే తొలిసారిగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. దోపిడీ ముఠాలకు ముకుతాడు వేశారు. ఉత్తరాది దొంగలు తెలంగాణ వైపు చూడాలంటేనే గడగడలాడేలా వ్యవస్థను రూపొందించారు. వెరసి.. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణ శాంతిభద్రతలకు నిలయంగా మారింది. దీంతో 2023 నాటికే దేశంలోనే తెలంగాణ నంబర్-1 పోలీసింగ్‌గా రూపాంతరం చెందింది.
రెండున్నరేండ్లలోనే తారుమారు
కేసీఆర్ తీసుకొచ్చిన అవే వ్యవస్థలు.. పోలీసులు కూడా వారే.. కానీ రెండున్నరేండ్లలోనే పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే శాంతిభద్రతలు ఆగమయ్యాయి. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణలో శాంతిభద్రతలు కుప్పకూలినట్టు ఎన్సీఆర్బీ-2024 క్రైమ్ నివేదిక తేటతెల్లం చేసింది. అన్ని నేరాల్లోనూ తెలంగాణ టాప్-10లో నిలిచిన అపకీర్తిని సొంతం చేసుకొన్నది. ముఖ్యంగా మహిళల భద్రత ప్రశ్నార్థకమైంది.
ఆడబిడ్డలను ఇబ్బందులు పెడితే తాటతీసి ఊచలు లెక్కించిన రోజుల నుంచి మహిళల పట్ల నేరాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్-1గా నిలిచింది. అక్కడితో ఆగలేదు.. సైబర్ నేరాల్లో, మావన అక్రమ రవాణాలో, ఆర్థిక నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్త క్రైమ్ రేట్లో 5వ స్థానంలో నిలిచి రాష్ట్రంలో శాంతిభద్రతలను వెక్కిరించేలా చేసింది. తీవ్రమైన నేరాల్లో 3వ స్థానంలో, రేప్ కేసుల్లో 9వ స్థానంలో, కిడ్నాప్ కేసుల్లో 8వ స్థానంలో, పిల్లల పట్ల నేరాల్లో 7వ స్థానంలో, పోక్సో కేసుల్లో 4వ స్థానంలో, వృద్ధుల పట్ల నేరాల్లో 4వ స్థానంలో నిలిచింది. ఉత్తరాది రాష్ర్టాలను మించిపోయేలా చేసింది. బీఆర్ఎస్ హయాంలో నేరాల నివారణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలోనే దారుణమైన దుస్థితికి దిగజారింది.
ఆడబిడ్డలకు రక్షణ కరువు

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు రక్షణ కవచంగా ఉంటే.. కాంగ్రెస్ పాలన మాత్రం భక్షణగా మారింది. 2024 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై 24,495 నేరాలు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్షమంది మహిళల్లో 128.6 మంది ఏదో ఒక విధంగా బాధితులు అవుతున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణాలో మహిళలే ఎక్కువగా ఉండగా, తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక-2024 తేల్చింది.
దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ట్రాఫికింగ్ కేసుల్లో దాదాపు 20% వాటా తెలంగాణదే. తెలంగాణలో మొత్తం 423 కేసుల్లో 814 మంది బాధితులు నమోదుకాగా, అందులో 792 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఇందులో వ్యభిచారం చేయించడం కోసం తెలంగాణ నుంచే 770 మంది మహిళలు అక్రమ రవాణాకు గురైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక కుండబద్దలు కొట్టింది. కనీసం రోజుకు ఇద్దరు చొప్పున మన రాష్ట్రం నుంచి వ్యభిచార కూపంలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. రేప్ కేసుల్లోనూ తెలంగాణ 9వ స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదికలు చెప్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది.
రోజుకు 70 మంది మిస్సింగ్.. 5.5 కోట్లు లూటీ
తెలంగాణలో అదృశ్యం కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో 2024లో సుమారు 25,554 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. అంటే రోజుకు 70 మంది చొప్పున అదృశ్యం అవుతున్నారు. గంటకు ముగ్గురు మిస్సింగ్ అవుతున్నట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. అందులో 4,614 మంది ఆచూకీ నేటికీ లభించలేదని వెల్లడించడం బాధాకరం. ఇది పోలీస్ శాఖ సమర్థతపై అనుమానాలు రేకెత్తిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. నేరగాళ్లు రోజుకు రూ.5.5 కోట్లు చొప్పున కొల్లగొడుతున్నారని పోలీస్ నివేదికలు స్పష్టం చేశాయి. నిత్యం సగటున 250 మంది బాధితులవుతున్నట్టు వెల్లడించాయి. ఇలా గత రెండేండ్లలో సైబర్ నేరగాళ్లు 96,407 మంది బాధితుల నుంచి రూ.1,319 కోట్లను కాజేసినట్టు చెప్తున్నారు.
దారుణంగా పెరుగుతున్న నేరాలు

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి అంటే 2023 నవంబర్‌కు, ఇప్పటికీ పోల్చితే నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. పోలీసుల క్రైమ్ నివేదిక ప్రకారం 2023 నవంబర్ నాటికి తెలంగాణలో మొత్తంగా నమోదైన అన్ని నేరాల సంఖ్య 2,13,121. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేవలం 11 నెలల్లో నమోదైన అన్ని నేరాలు 2,34,158. అంటే కేవలం 11 నెలల్లోనే 21,037 నేరాలు పెరిగాయి. 2023తో పోల్చితే 2024లో తెలంగాణలో ఏకంగా 9.87 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా ఏటా నేరాల సంఖ్య ఒక శాతమో, రెండు శాతమో, లేదా 4 శాతమో పెరిగేవి. కానీ.. 2024లో కేవలం 11 నెలల్లోనే సుమారు 10శాతం నేరాలు పెరుగడం రాష్ట్రచరిత్రలోనే మొదటిసారి. 2025లోనూ అదే స్థాయిలో 2,28,695 నేరాలు నమోదయ్యాయి.
ఈ ఏడాదిలో జూన్ నాటికి తెలంగాణలోనూ భారీగా నేరాలు పెరిగినట్టు తాజాగా పోలీస్ శాఖ విడుదల చేసిన అర్ధవార్షిక క్రైమ్ నివేదిక చెప్తున్నది. మొత్తంగా గత మూడేండ్లు కలుపుకొని.. తెలంగాణలో సుమారు 7.15 శాతం నేరాల రేటు నమోదైందని స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. అంటే ఏ స్థాయిలో నేరాలు పెరుగుతున్నాయో? శాంతిభద్రతలు ఎంతలా అదుపు తప్పాయో? హోమ్మంత్రికి తన శాఖపై ఎంత పట్టు తప్పిందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాది నేరాల సంఖ్య 3 లక్షలకు చేరుకొనే అవకాశాలు ఉన్నట్టు పోలీస్ వర్గాలే చెప్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 28న హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2023 జూలై నుంచి 2026 జూలై మధ్య నేరాల రేటు భారీగా పెరిగింది. 2023-24, 2025-26లో నమోదైన కేసుల ఆధారంగా తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకూ నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగినట్టు పోలీసు నివేదికలు వెల్లడించాయి. ఈ మూడేండ్లలోనే ప్రతి లక్షమంది జనాభాకూ నేరాలు 10.01 శాతం పెరిగాయి.
పల్లె పల్లెనా గంజాయి

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, ముందుచూపులేనితనం వల్ల తెలంగాణలో పల్లెపల్లెల్లోకి గంజాయి చొరబడింది. ఎక్కడచూసినా ఎంతోమంది యువత మత్తులో జోగుతున్నారు. అకృత్యాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలోని పట్టణాల్లో, గ్రామాల్లో, ప్రతి గల్లీలో గంజాయి, డ్రగ్స్ తిష్ట వేసిందనడానికి పోలీస్‌శాఖ ఇటీవల విడుదల చేసిన లెక్కలే నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయేనాటికి 11 నెలల్లో 1,360 కేసులే నమోదయ్యాయి. కాంగ్రెస్ పాలనలో 2025 నవంబర్ నాటికే 2,542 కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా పోలీస్ శాఖ విడుదల చేసిన అర్ధవార్షిక క్రైమ్ నివేదిక ప్రకారం 2025-26లో డ్రగ్స్ కేసులు 2,960కి పెరిగాయి. ప్రతి లక్ష జనాభాకూ డ్రగ్స్ నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది.
కమిషనరేట్ల వారీగా చూస్తే.. సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైంది. వరంగల్‌లో గడిచిన మూడేండ్లలో 142.31 శాతం పెరుగుదల నమోదైందని పోలీస్ నివేదికలు చెప్తున్నాయి. జిల్లాల్లో డ్రగ్స్ కేసుల నమోదును పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 57 నుంచి 219కు పెరిగాయి. నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరింది. నిజామాబాద్‌లో 62 నుంచి 123కు కేసులు పెరుగుతున్నాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ డ్రగ్స్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్లలో నారోటిక్ కేసుల్లో 46.10% పెరుగుదల నమోదైంది. ఇది పోలీస్ శాఖకు సవాల్‌గా మారిందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ నేరాల్లో 7.28% వృద్ధి
హోమ్‌మంత్రిగా రేవంత్‌రెడ్డి పోలీస్ శాఖపై ఉన్నతస్థాయిలో సమీక్షలు చేయకపోవడంతో తెలంగాణలో నేరాల సంఖ్య అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నది. ఎప్పుడో అమాస పున్నానికి పెట్టే సమీక్షలు ఏ మాత్రం ఫలితాలను ఇవ్వకపోవడం, పోలీస్ శాఖపై సీఎంకు పట్టు తగ్గిపోవడంతో సాధారణ నేరాలు కూడా తారాజువ్వలతో పోటీపడుతున్నాయి. 2023-24లో 2,59,201గా ఉన్న కేసులు.. 2025-26లో 2,78,069కు చేరాయి. గడిచిన మూడేండ్లలో సాధారణ నేరాల్లో 7.28 శాతం పెరుగుదల నమోదైంది. కమిషనరేట్ల వారీగా చూస్తే.. ఫ్యూచర్ సిటీలో 23.70 శాతం, సైబరాబాద్‌లో 17.32 శాతం, మలాజిగిరిలో 13.53 శాతం పెరుగుదల నమోదైంది.
జిల్లాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 70.88 శాతం, ఆదిలాబాద్‌లో 60.71 శాతం పెరుగుదల నమోదైంది. మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లోనూ సాధారణ నేరాల్లో పెరుగదల కనిపించడంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తీవ్రమైన నేరాలు 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా.. 2025-26లో 6,294కు తగ్గాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 11.21 నుంచి 10.88కి తగ్గింది. ములుగులో 44 నుంచి 88కి, నిర్మల్‌లో 66 నుంచి 102కు, ఆదిలాబాద్‌లో 96 నుంచి 140కి తీవ్రమైన నేరాలు పెరిగాయి. చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
2025 వార్షిక క్రైమ్ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ‘ప్రతిరోజూ’ ఇదే పరిస్థితి
పోక్సో కేసుల కలవరం

Pdk
తెలంగాణలో పోక్సో కేసులపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నది. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం మృగాళ్ల బారిన పడుతున్నారు. వారి కామవాంఛకు బలై.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణపేట, ములుగు జిల్లాల్లో అత్యంత దారుణంగా పోక్సో కేసుల్లో పెరుగుదల కనిపించినట్టు పోలీస్ నివేదికలు చెప్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఫ్యూచర్ సిటీలో ఈ కేసులు 790 నుంచి 994కు పెరిగాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో సైతం చిన్నారులకు రక్షణ లేదు. ఖమ్మం జిల్లా నుంచి ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలకు బాధ్యులుగా ముగ్గురు మంత్రులు ఉన్నా.. ఈ ఏడాది ఆరు నెలల నివేదికలో పోక్సో కేసుల్లో ఖమ్మం మొదటి స్థానంలో నిలిచింది. ఇది సిగ్గుపడాల్సిన విషయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మహిళలు, చిన్నారులపై నేరాల్లోనూ భారీగా పెరుగుదల నమోదైంది. 2025-26లో 31,108 నేరాలు నమోదయ్యాయి. 2023-24తో పోల్చితే కేసుల సంఖ్య 3.81 శాతం పెరుగడం గమనార్హం.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ట్రాఫిక్ నేరాలు వరుసగా పెరుగుతున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నా.. రోడ్డు ప్రమాదాల్లో ఏటా 7వేల మందికి పైగా మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం రావడమే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో కేవలం 11 నెలల్లో 7,056 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. అంటే రోజుకు సుమారు 21 మంది ప్రాణాలొదిలారు. ప్రతి 68 నిమిషాలకు ఒకరు ప్రాణాలు విడిచారు. అదే సమయంలో రోజుకు 65 మంది చొప్పున 11 నెలల్లో 21,664 మంది గాయపడ్డారు. 2025లో కూడా కేవలం 11 నెలల్లలో అదే స్థాయిలో 6,499 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోజుకు 19 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. అదే విధంగా ట్రాఫిక్ నేరాలు సైతం దారుణంగా పెరిగాయి. 2023-24లో 29,130 కేసులు ఉండగా.. 2025-26లో 31,891కు చేరాయి. మూడేండ్లలో 9.48 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సైబరాబాద్‌లో 2,882 నుంచి 3,677కు, మలాజిగిరిలో 3,213 నుంచి 3,673కు ఈ కేసులు పెరిగాయి. జిల్లాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 154 నుంచి 1,115కు చేరి 624.03 శాతం పెరుగుదల నమోదైంది. నిర్మల్‌లో 67.92 శాతం, నల్గొండలో 34.37 శాతం, ఆదిలాబాద్ లో 28.30 శాతం పెరిగాయి.
ఇటీవల సంచలనం సృష్టించిన దోపిడీ కేసులివే..
