న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : గోవాలో క్షేత్రస్థాయి అధికారులు అర్హులుగా గుర్తించిన 97 మంది ఓటర్లు ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) తర్వాత తుది ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారని ఒక వార్త వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ మోదీ ఆదేశాల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మొత్తం వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకుని, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా దెబ్బతిని, అపవిత్రం అయిపోయిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఐటీ విభాగం నియంత్రణలో ఉన్న ఎన్నికల సంఘానికి చెందిన కేంద్రీకృత ‘ఈసీఐనెట్’ వ్యవస్థ గతంలో తొలగింపునకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకునే వెసులుబాటును స్థానిక ఎన్నికల నమోదు అధికారులకు(ఈఆర్వో) కల్పించకపోవడం వల్ల 2026 నాటి తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి అర్హులని గుర్తించిన గోవాకు చెందిన 97 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చేరలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురువారం ఒక కథనాన్ని ప్రచురించింది. గోవా ప్రధాన ఎన్నికల అధికారి సంజయ్ గోయల్ రోల్‌బ్యాక్ సౌకర్యం కోరుతూ 7 రోజుల్లో 8 ఈమెయిల్స్ పంపినప్పటికీ, డిప్యుటీ ఎన్నికల కమిషనర్ ఆ సవరణను అమలు చేయమని ఐటీ విభాగాన్ని ఆదేశించినప్పటికీ తుది ఓటర్ల జాబితా ప్రచురించడానికి ముందు ఆ సౌకర్యం కల్పించలేదని పత్రికా కథనం పేర్కొంది. అయితే తొలగించిన ఓటర్ల గురించి మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించడానికి సంజయ్ గోయల్ నిరాకరించారు.