చరిత్ర ఎప్పుడూ అధికారపు దర్బారుల్లో, చలువరాతి భవనాల నడుమ పురుడు పోసుకోదు. ఒక్కోసారి అది ఈ నేల గుండెల్లో గుచ్చుకున్న ముల్లులా, ఎడతెగని గాయమై రగులుతుంది. తరాల ఆక్రోశమై, కన్నీటి వరదై ఎగసిపడుతుంది. చివరకు కోట్లాది గొంతుల సమరనాదమై పచ్చని ఆకాశం కింద ఒక రాష్ర్టాన్ని సగర్వంగా ఆవిష్కరిస్తుంది. అచ్చంగా అదే మన తెలంగాణ మట్టి కథ. నెత్తుటి త్యాగాల వ్యథ. ఆ మహా సంగ్రామంలో, ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటాల నడుమ, ఢిల్లీ పీఠాన్ని కదిలించి నిలబెట్టిన ఒకే ఒక్క అజేయ శిఖరం కేసీఆర్.
కేసీఆర్‌ను అర్థం చేసుకోవడమంటే కేవలం ఒక రాజకీయ నాయకుడి జయాపజయాల లెక్కలు తేల్చడం కాదు. పల్లె పల్లెనా నివురుగప్పిన నిప్పులా దాగున్న ఆత్మగౌరవ మంటను రాజకీయ సంకల్పంగా ఎలా మలుచవచ్చో, పారే గోదారి సాక్షిగా, నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడును దేశ రాజ్యాంగ బద్ధమైన వాస్తవంగా ఎలా నిలబెట్టవచ్చో ప్రాణాలను పణంగా పెట్టి రుజువు చేసిన నాయకత్వ శిఖరమది. తెలంగాణ ఉద్యమమంటే పదవుల కోసమో, పైరవీల కోసమో సాగిన సగటు పంచాయితీ కాదు. మన కన్నీళ్లకు మనమే ఓదార్పు కావాలని, మన నీళ్లు మన చేలను తడపాలని, మన బొగ్గు మన పల్లెలను వెలిగించాలని, మన బతుకుల్ని మనమే ఏలుకోవాలన్న పరమ పవిత్రమైన ఆత్మగౌరవ పోరాటం. ఆ అస్తిత్వ ఆరాటానికి అసలుసిసలైన జెండాయై, గుండెల్లోంచి పుట్టిన ఎజెండాయై నిలిచిన ఏకైక నేత కేసీఆర్.
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరేసిన నాడు, ముందున్న దారంతా నిలువెల్లా ముళ్లబాట. తెలంగాణ మాటెత్తితేనే అహంకారంతో హేళన చేసిన గడ్డు కాలమది. ఢిల్లీ సామ్రాజ్యం దిగివస్తుందా? కొట్లాడితే మన రాజ్యం మనకొస్తుందా? గమ్యం ఎక్కడుందో, దారి ఎటుపోతుందో ఎవరికీ పాలుపోక పిడికెడు ఆశతో నిట్టూర్చిన సంక్షోభ సమయం. కానీ కేసీఆర్ గుండెల్లో ఉన్నది ఈ మట్టి రుణం తీర్చుకోవాలన్న అచంచల విశ్వాసం, చావుకెదురెళ్లే వెన్నుచూపని మొండితనం. మూలనపడ్డ తెలంగాణ నినాదాన్ని ఆయన ఊరూరా రచ్చబండల మీదికి తెచ్చారు. బస్తీల్లో, వాడకట్లలో, పల్లె ముంగిళ్లలో చైతన్యపు చిచ్చు పెట్టారు. పార్లమెంటు తలుపులు బద్దలుకొట్టారు, శాసనసభల్లో సింహంలా గర్జించారు, ఢిల్లీ పెద్దల రాయబారాల ఎత్తులను చిత్తు చేశారు. అవసరమైన వేళ తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ నిరాహారదీక్షతో చావు నోట్లోకి తలదూర్చి ఆ ఢిల్లీ పాలకుల మెడలు వంచారు. ఒక ఉద్యమానికి నిలువెత్తు రూపమై, కోట్లాది మంది గుండెల్లో కొండంత ధైర్యమై ముందుకు నడిచారు.
కేసీఆర్ బలం ఆయన గుండెల్లోంచి ఉబికివచ్చే తెలంగాణ భాష. ఆయన నోట మాట పెగలితే అందులో గోదావరి ఉరవడి, కృష్ణమ్మ పరవళ్లు, అమ్మ చేతి ముద్దలాంటి పల్లె పదాల సోయగం, సూటిగా గుచ్చుకునే సామెతలు, సమైక్యవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే పదునైన వ్యంగ్యం తొణికిసలాడేవి. ఆయన సభల్లో పొడిపొడి ఉపన్యాసాలు దంచికొట్టలేదు; పల్లెల్లో తాతలు, అవ్వలు, గల్లీల్లో యువకులు ఏండ్ల తరబడి ఎదలో దాచుకున్న రోదనకు అచ్చమైన మాటల రూపమిచ్చారు.
‘మన భాషను ఎగతాళి చేస్తారా?మన పండుగలను చిన్నచూపు చూస్తారా? మన బతుకును అవహేళన చేస్తారా?’ అంటూ ఆయన వేసిన ప్రశ్నలు ప్రతి తెలంగాణ బిడ్డ నరనరాల్లో నిద్రపోతున్న ఆత్మాభిమానాన్ని రగిలించాయి. ప్రజలు తమ ఆత్మగౌరవానికి ముప్పు వాటిల్లినప్పుడు పిడికిలి బిగిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ, బోనాలను ఉద్యమానికి జీవనాడిగా మార్చి, కేసీఆర్ సాంస్కృతిక శిఖరమై నిలిచారు.
2 జూన్ 2014: స్వప్నం సాకారమైన వేళచరిత్ర కొన్ని దశాబ్దాల కన్నీళ్లను ఒక్క రోజులో ముగిస్తుంది. తెలంగాణ గుండెపై అమృతవర్షం కురిసిన ఆ పవిత్ర దినమే 2 జూన్ 2014. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఆ ఒక్క రోజు వెనుక ఎంతటి వేదన దాగుంది! జై తెలంగాణ అంటూ ఉరికొయ్యలను ముద్దాడిన అమరులైన విద్యార్థుల బలిదానాలు ఉన్నాయి. లాఠీదెబ్బలకు నెత్తురోడిన బిడ్డల వీపుల గాయాలు ఉన్నాయి. పస్తులుండి రోడ్డెక్కిన సకల జనుల సమ్మె కష్టాలు ఉన్నాయి. ఆ సమస్త త్యాగాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిన నాడు, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. నిన్నటిదాకా నిప్పులు చెరిగిన ఉద్యమకారుడే, నేడు తన ఇంటిని తాను పేగుబంధంతో చక్కదిద్దుకోవాల్సిన పాలనా రథసారథి అయ్యారు. తెలంగాణ ఎందుకు రావాలి? అన్న నినాదం ముగిసి, తెలంగాణను ఎలా తీర్చిదిద్దాలి? అన్న మహత్తర కర్తవ్యం మొదలైంది.
రాష్ట్రం రావడం కేవలం సంబురాలు చేసుకోవడానికి కాదు, అది పల్లె కండ్లల్లోని కన్నీటి చుక్కను తుడువాలని కేసీఆర్ నమ్మారు. అందుకే ఆయన పాలన అంతా ఆ మట్టి మనుషుల చుట్టూనే తిరిగింది. ఎండిపోయిన గొంతులకు మిషన్ భగీరథ ద్వారా బిందెడు గంగను ఇంటింటికీ తెచ్చి దాహం తీర్చారు. ఎండి బీటలు వారిన నేలలను చూసి తాతల కాలం నాటి గొలుసుకట్టు చెరువులకు మిషన్ కాకతీయతో ప్రాణం పోశారు, భారీ నీటి ప్రాజెక్టులతో నీటి అవసరాలను తీర్చారు. అన్నంపెట్టే రైతన్న అప్పులపాలు కాకూడదని, తనువు చాలించకూడదని రైతుబంధు తీసుకొచ్చారు.
పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా తెచ్చి కన్నతండ్రిలా అండగా నిలిచారు. అవ్వాతాతలకు చేతికర్రలా ఆసరా అయ్యారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కన్నీళ్లు రాకూడదని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో మేనమామలా కానుకలిచ్చి భరోసా అందించారు. అర్ధరాత్రి కరెంట్ కోసం బావుల కాడ పాముకాట్లకు గురైన రైతన్నలకు నిరంతర ఉచిత వెలుగులు పంచారు. దళితులు, బీసీల పాలిటి ‘బంధువు’ అయ్యారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని కేవలం గెలుపోటములతోనో, కుర్చీల్లో కూర్చున్న కాలం లెక్కలతోనో కొలువలేం. చరిత్ర ఎప్పుడూ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది: ఒక మనిషి రాకతో ఈ నేల తలరాత మారిందా లేదా? కేసీఆర్ రాకతో తెలంగాణ ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ గడ్డ తనను తాను చూసుకునే తీరే మారిపోయింది. ఢిల్లీ ముందు చేతులు కట్టుకుని దేబిరించే దీనస్థితి నుంచి, దేశానికే అన్నం పెట్టే ధాన్యపు రాశిగా కాలర్ ఎగురేసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది. దేశ చిత్రపటంలోనే ఒక కొత్త రాష్ట్రపు సరిహద్దులను తన స్వహస్తాలతో లిఖించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. యాభై ఏండ్ల తర్వాత ఈ గడ్డమీద పుట్టబోయే బిడ్డలకు తెలంగాణ అనేది పోరాడి సాధించుకోవాల్సిన కల కాదు. గాలి పీల్చుకున్నంత సహజసిద్ధమైన స్వగృహం. ‘తెలంగాణ వస్తుందో రాదో’ అనే అభద్రత ఆ బిడ్డలకు ఉండవు. కానీ చరిత్రను వెనక్కి తిరగేసిన నాడు, ఇంత సహజంగా కనిపిస్తున్న ఈ తెలంగాణ వెనుక ఎంతటి రణం సాగిందో, ఎందరి తల్లుల కడుపుకోత దాగున్నదో ఆ పిల్లలకు బోధపడుతుంది.
అదొక ఆశయమై, ఆక్రోశమై, రక్తమోడిన మహోద్యమమై సాగిన వేళ… ఆ సమస్త ప్రయాణానికి మానవీయ స్వరూపమై నిలిచిన వ్యక్తిగా ఆ బిడ్డల గుండెల్లో కేసీఆర్ సూర్యుడిలా వెలుగుతారు. ఆ భావోద్వేగపు తలపుల్లోంచి ఆ బిడ్డల కేసీఆర్‌ను ‘తెలంగాణ జాతిపిత’ అని గుండెల నిండా ప్రేమతో తన గొంతుతో సగర్వంగా పిలుచుకుంటారు. అది ఎవరూ రాసిచ్చిన కాగితపు బిరుదు కాదు; ఒక జాతి విముక్తికి సారథ్యం వహించినందుకు చరిత్ర సమర్పించే పరమోన్నత గౌరవం.
పాలకులు మారుతారు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. రాజకీయ జయాపజయాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. కొత్త తరాలు వస్తాయి, కొత్త గొంతులు లేస్తాయి. కానీ ఎన్నికల ఫలితాలకు అందనంత ఎత్తులో కొన్ని చారిత్రక సత్యాలు కలకాలం నిలిచిపోతాయి. ఈ నేల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దాకా చాటిన పిడుగులాంటి కేకగా, కోట్లాది చేతులను ఒక్కతాటిపైకి తెచ్చిన ఉద్యమపథంగా, ఆకాంక్ష నుంచి అవతరణ వరకు, పోరాటం నుంచి పునర్నిర్మాణం వరకు… ఈ గడ్డపై తన జీవితాన్నే రంగరించి చెరుగని సంతకం చేసిన నాయకత్వ శిఖరంగా కేసీఆర్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. రాష్ట్రం మన విజయం. పోరాటం మన గుండెల్లో సజీవ జ్ఞాపకం. ఈ తెలంగాణ నేల మనకు దక్కిన ఆత్మగౌరవ వారసత్వం. ఆ మూడింటినీ తన తపస్సుతో, సంకల్పంతో ఏకం చేసి, తెలంగాణ ఉనికిని నిలిపిన అసలైన శిఖరం కేసీఆర్!
– పెండ్యాల మంగళాదేవి