దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ నీతులు చెప్తున్నడు. నిరసన తెలిపే హకు ఏడో గ్యారెంటీ అని చెప్పిండు. ఇప్పుడు ఆడబిడ్డల చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు పట్టి లాగడమేనా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన?
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మహిళా శాసన సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ శాసన సభ్యులపై సోమవారం జరిగిన అక్రమ దాడి, దాష్టీకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ముమ్మాటికీ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా వారి చీరలు లాగ డం, గొంతులు పట్టుకోవడం, జుట్టు లాగుతూ దాడి చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా శాసనసభ్యులపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి, ఆయన పోలీసు బలగం ఎంత దుర్మార్గంగా, ఎంత కిరాతకంగా వ్యవహరించిందో రాష్ట్రం, దేశమంతా చూసిందని తెలిపారు. ఈ దమనకాండకు ముఖ్యమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణభవన్‌లో సోమవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే విజయుడుతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకొని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసన సభ్యులపై దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. రాహుల్‌గాంధీ రాజకీయాల్లోకి రాకముందే తమ మహిళా శాసనసభ్యులు అనేక పదవులు అలంకరించి, వాటికి వన్నెతెచ్చి, రాజకీయాల్లో అజాతశత్రువులుగా నిలిచారని గుర్తుచేశారు. అలాంటి మహిళా నేతలపైనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారని మండిడ్డారు. హోంమంత్రిగా పనిచేసిన సబితాఇంద్రారెడ్డి గొంతును ఒక మగ పోలీస్ పట్టుకోవడం రాష్ట్రమంతా చూసిందని చెప్పారు.
గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన సునీతాలక్ష్మారెడ్డితో కూడా దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. సమయానికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి అక్కడ లేకుంటే మాజీ మంత్రి గ్రిల్స్ మీద పడిపోయే ప్రమాదం ఉండేదని ఆందోళన వ్యకంచేశారు. మహిళా సభ్యులు కన్నీరు పెట్టుకొనే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకు సంబంధించి ఫొటోలను మీడియాకు చూపించారు. మహిళా శాసనసభ్యులకు జరిగిన అవమానం, దాష్టీకాన్ని చూసిన తర్వాత ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టుకుంటారని, ఈ దుశ్శాసన పర్వం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి తనకు తెలిసిన అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలను మొదలుపెట్టారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డికి మూడే తెలుసు
రేవంత్‌రెడ్డికి డిస్ట్రక్షన్ (విధ్వంసం), డిస్ట్రాక్షన్ (దృష్టి మళ్లించడం), డైవర్షన్ (పక్కదారి పట్టించడం).. ఈ మూడే తెలుసని కేటీఆర్ మండిపడ్డా రు. ఈ రోజు కూడా అసెంబ్లీ డైవర్షన్ డ్రామా మొదలుపెట్టారని ఆక్షేపించారు. అసలు జరిగిన దాడి, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అవమానంపై సమాధానం చెప్పకుండా తమ ఎమ్మెల్సీ తాతా మధుపై అనని మాటలను ఆపాదించి అంశాన్ని పకదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు ఉన్న నిరసన తెలిపే హకు మేరకు ఉదయం టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
ఇదే తరహా టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్‌గాంధీ కూ ర్చున్నప్పుడు వారిని ఎకడా అడ్డుకోలేదని గుర్తుచేశారు. లోక్‌భలో ఉన్న నిబంధనలే రాష్ట్ర శాసనసభలోనూ ఉంటాయని, కానీ తెలంగాణలో మాత్రం కొత్తగా కొన్ని నిబంధనలు వచ్చినట్టుగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ఏ రూల్ ప్రకారం.. అడ్డుకుంటున్నారని పోలీసు అధికారులను అడిగితే టీషర్టులపై అభ్యంతరకర నినాదాలున్నాయని చెప్పారని ఆక్షేపించారు.
‘స్పీకర్ ఆదేశాల మేరకే మిమ్మల్ని అడ్డుకుంటున్నం’ అంటూ పోలీసులు తమను అడ్డుకున్నారని, దాడిచేశారని విమర్శించారు. కేవలం 1,000 రోజుల కాంగ్రెస్ పాలనలోని హామీల వైఫల్యాన్ని, పరిపాలనా వైఫల్యాన్ని సభలో ఎండగడుతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని చెప్పారు. ఇందుకోసం పోలీసులతో దాడులు చేయించారని మండిపడ్డారు. ఏది కరెక్టో, ఏది కాదో నిర్ణయించేది పోలీసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ‘రాహుల్‌గాంధీకి ఒక రూలు.. మాకు మరోరూలు ఉంటుందా?’ అని నిలదీశారు. దీనిపై స్పీకర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ పక్షపాత వైఖరి వీడాలి
గతంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వనని గతంలో స్పీకర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావి స్తూ.. ముఖ్యమంత్రి కూడా సభలోని ఇతర సభ్యు ల మాదిరిగానే ఒక శాసనసభ్యుడేనని గుర్తించాలని చెప్పారు. సభానాయకుడైనప్పటికీ ఆయనకు ప్రత్యే క అధికారాలు ఏమీ ఉండవనే ప్రాథమిక విషయాన్ని స్పీకర్ గుర్తించాలని సూచించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ప్రశ్నించడం కోసమే ప్రజాప్రతిపక్షం ఉన్నదని చెప్పారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగుడుతూ బాకాలు ఊదుకోవచ్చని, అది తమకు అవసరం లేదని, కానీ ప్రజల తరఫున గొంతు వినిపించడం, వారి సమస్యలు, ఆవేదన, బాధను సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడమే తమ బాధ్యత అని చెప్పారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించడం తగదని, అందరి పక్షాన ఆయన నిలబడాలని, అందరి హక్కులను కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైకు ఇవ్వననే హక్కు స్పీకర్‌కు ఉండబోదని స్పష్టంచేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్‌పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.
వైఫల్యాలపై ఎండగడుతామనే కాంగ్రెస్ భయం
ఈ అసెంబ్లీ సమావేశాల్లో 1,000 రోజుల వైఫ ల్య పాలన, 420 గ్యారెంటీలు, హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని భయపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే ఇంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా, అరాచకంగా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ఈ దారుణానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఇది కేవలం బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులకు జరిగిన అన్యా యం కాదని, తెలంగాణ మహిళాలోకానికి జరిగిన అన్యాయంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. స్పీకర్ కూడా ప్రియాంకగాంధీకి ఒక రూలు, తమ మహిళా శాసనసభ్యులకు మరో రూలు ఉం టుందా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. ఏడో గ్యారెంటీగా నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పి, ఇలా అడ్డుకోవడమే ప్రజాస్వామ్యా మా? అని నిలదీశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు ఉన్న నిరసన తెలిపే హకు మేరకే టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నరు. ఇదే తరహా టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్‌గాంధీ కూర్చున్నప్పుడు వారిని ఎకడా అడ్డుకోలేదు. వారికో రూలు.. మాకో రూలా? లోక్‌సభలో ఉన్న నిబంధనలే శాసనసభలోనూ ఉంటయి. కానీ తెలంగాణలో కొత్తగా కొన్ని నిబంధనలు వచ్చినట్టున్నయ్.
– కేటీఆర్
మహిళా నేతల గురించి మాట్లాడే నైతిక హకు రేవంత్‌కు లేదు
గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాము స్వయంగా క్షమాపణ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. అదే తమ సంసారమని తెలిపారు. ఒకప్పుడు సోనియాగాంధీని బీజేపీ ముఖ్యమంత్రులు అడ్డగోలుగా మాట్లాడితే వారిని తూలనాడుతూ, సోనియాగాంధీని డిఫెండ్ చేసిన నాయకుడు కేసీఆర్ అని, అది తమ సంసారమని గుర్తుచేశారు.
రాహుల్‌గాంధీ పుట్టుకను బీజేపీ ముఖ్యమంత్రి అవమానిస్తే ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. అది కేసీఆర్ సంస్కారమని గుర్తుచేశారు. ఇవాళ కూడా మహిళా నేతలపై దాడిచేసి దాని నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు చెప్తే.. విచారం వ్యక్తం చేస్తున్నానని, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించారని చెప్పారు. ఇదీ తమ సంస్కారమని తెలిపారు. అయినా స్పీకర్‌కు మనస్తాపం కలిగితే తాను అనని మాటకు కూడా విచారం వ్యక్తం చేశానని తాతా మధు చెప్పారని, ఈ అంశంలో ఇక చెప్పాల్సింది ఏమీ లేదని చెప్పారు.
సంస్కారం ఉంటే సీఎం క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రికి సభను నడుపాలనే సంస్కారం ఉన్నదా? హూందాతనం ఉన్నాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సంస్కారం ఉంటే మహిళా శాసనసభ్యులపై దాడి చేయించిన ముఖ్యమంత్రి రేపు సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ సాఫీగా నడువాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలపై విసృ్తతంగా చర్చ జరగాలని, నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తమను సభలోకి రాకుండా అడ్డుకున్నదని ఆరోపించారు. తమపై పోలీసులు దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వయంగా తనపై దాడిచేశారని, గోర్లతో గీరారని చెప్పారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి గోరు లేచిపోయిందని, జగదీశ్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారని, బీపీ పడిపోతే కనీసం దవాఖానకు తీసుకుపోకుండా అడ్డుకున్నారని, డాక్టర్ సంజయ్, శంభీపూర్ రాజుకు గాయాలయ్యాయని, ఇందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జగదీశ్‌రెడ్డి, శంభీపూర్ రాజు, డాక్టర్ సంజయ్‌తోపాటు తనను, హరీశ్‌రావును కూడా పోలీసులు గాయపరుస్తూ, ఈడ్చుకుంటూ వెళ్లారని చెప్పారు.
దళితులపై రేవంత్ దొంగ ప్రేమ
దళితులపై రేవంత్‌రెడ్డి దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశాల్లోనే నేడు దళిత డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దళిత డిక్లరేషన్‌లో ఇచ్చిన ఎన్ని హామీలను అమలు చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన దళితబంధును ఎత్తివేసి అభయహస్తం ఇస్తామని, రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఇందిరమ్మ ఇంటికి రూ.6 లక్షలు ఇస్తామని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి ఒకటంటే ఒక హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. నిజంగా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ దళిత వ్యతిరేకమో తేలాలంటే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని, ఆ చర్చలో తాము పాల్గొని ప్రభుత్వాన్ని ఎండగడుతామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లో ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దళిత, గిరిజనుల నుంచి అసైన్డ్ భూములను గుంజుకుంటూ ఎకడికకడ కుంభకోణాలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
అసెంబ్లీ విలువలపై రేవంత్ మాట్లాడటమా?
అసెంబ్లీ విలువలు, సంప్రదాయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోనే మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీస్తానని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సభా విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. వలువలు విప్పుతానన్న రేవంత్‌రెడ్డి విలువల గురించి మాట్లాడటం దారుణమని నిప్పులు చెరిగారు.
శాసనసభలోనే కాకుండా శాసనసభ బయట కూడా అడ్డగోలుగా, నీచమైన బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో రేవంత్‌రెడ్డి ఒకడేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1,000 రోజులపాటు అన్ని రంగాల్లో సర్వభ్రష్ట పాలన అందించి, రాజ్యాంగాన్ని తుంగలో తొకి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే రాజీనామా చేయాల్సి వస్తే ప్రతిపక్షం అడిగినందుకు కాదని, తన పరిపాలనా వైఫల్యానికి, అవినీతి, అరాచకాలకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఫైర్ అయ్యారు.
బీఏసీని బహిషరించాం
రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిషరించినట్టు కేటీఆర్ తెలిపారు. మహిళా శాసనసభ్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన అనుచిత వైఖరికి, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చేయించిన దమనకాండకు నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిషరించామని చెప్పారు. మంగళవారం నుంచి అసెంబ్లీకి వస్తామని ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని స్పష్టంచేశారు. నెల రోజులపాటు సభను నడిపి అన్ని అంశాలపై చర్చించారని, 22ఏ, పాలిటెక్నిక్ విద్యార్థులతో చెలగాటం, ఫీజు రీయింబర్స్మెంట్, గోదావరి నీళ్లను ఎత్తిపోయకపోవడం వంటి అన్ని అంశాలపై చర్చించాల్సిందేనని డిమాడ్ చేశారు.
ఎన్‌హెచ్చార్సీకి కూడా వెళ్తాం..
తమ శాసన సభ్యులపై జరిగిన దాడిపై హైకోర్టును ఆశ్రయించామని కేటీఆర్ తెలిపారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. శాసనసభ్యులను పోలీసులు అడ్డుకునే హకు లేదని స్పష్టంచేసిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తమ దళిత ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని, జాతీయ మానవ హకుల కమిషన్ దృష్టికి, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టంచేశారు. మహిళా శాసన సభ్యులపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిపి తమపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు.
మా శాసనసభ్యులపై జరిగిన దాడి విషయంలో హైకోర్టును ఆశ్రయించినం. పోలీసులపై, దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఎమ్మెల్యేలను అడ్డుకునే హకు పోలీసులకు లేదని స్పష్టంచేసిన హైకోర్టుకు ధన్యవాదాలు. మా దళిత ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. జాతీయ మానవ హకుల కమిషన్ దృష్టికి, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ దృష్టికి కూడా తీస్కపోతం.
-కేటీఆర్
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తం..
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 97 జీవోను రియల్ఎస్టేట్ ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ అంశంపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని చెప్పారు.
సుమారు రూ.18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. అభయహస్తం.. ఎన్నికల తర్వాత భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వారిపై భారం మోపుతున్నదని ఆరోపించారు. రైతాంగం సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
నెలరోజులపాటు అసెంబ్లీ నిర్వహించాలి
రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై సమగ్ర చర్చ జరగాలంటే అసెంబ్లీ సమావేశాలను నెల రోజులపాటు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, అంగన్వాడీలు, సర్వేయర్ల సమస్యలతోపాటు ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు. 22-ఏ కింద ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులకు అక్రమంగా భూ కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాలపై కూడా సభలో నిలదీస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అవమానాలకు గురిచేసినా, వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు.
ఒక హామీ అమలుచేయని సర్కార్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చిందని, వెయ్యి రోజులు దాటినా ఒక హామీ కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా అవమానించినా, ప్రజల కోసం హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరి తరఫున అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం గన్పార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, సర్వేయర్లు తదితర వర్గాల సమస్యలను సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. అన్ని వర్గాల సమస్యలపై కూలంకషంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలు కొత్తేమీ కాదని చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఎన్నో పరిణామాలను చూశామని తెలిపారు.