హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 7 : విద్యార్థులకు రావాల్సిన రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్, బీసీ కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ స్వామి, బీసీ యువజన విభాగం కార్యదర్శి శ్రీనివాస్ నాయకత్వంలో సోమవారం హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి భారీ ఎత్తున విద్యార్థులు ‘చలో అసెంబ్లీ’కి ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో నారాయణగూడ పోలీసులు విద్యార్థుల ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.