Rythu Bharosa | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కారు రైతుభరోసా పంపిణీని మర్చిపోయింది. నెల రోజులుగా రైతుల ఖాతాల్లో నయా పైసా జమ చేయలేదు. గత నెల 12వ తేదీన మూడెకరాల రైతులకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రకటించిన సర్కారు… అక్కడితో పెట్టుబడి పంపిణీకి పుల్‌స్టాప్ పెట్టేసింది. మూడెకరాల కంటే ఎక్కువ భూములున్న రైతులకు భరోసా పంపిణీ గురించి ప్రభుత్వం ఊసెత్తడం లేదు. కనీసం ఎప్పడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంపై అన్నదాతలు మండిపడుతున్నారు.
మూడెకరాలు.. ఐదు విడతలు
వానకాలం రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు యాసంగి పెట్టుబడిసాయం పంపిణీలోనూ ఎగవేత ధోరణి అవలంబిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడెకరాల రైతులకు మాత్రమే రైతుభరోసా అందించింది. ఇందులో కూడా కొంతమందికి రైతుభరోసా అందలేదనే ఫిర్యాదులున్నాయి. ఇప్పటివరకు పంపిణీ చేసిన మూడెకరాలకు ఐదు వాయిదాల్లో జమచేయడం గమనార్హం. మిగతా రైతులకు రూపాయి కూడా జమ కాలేదు. అసలు ఇస్తారో, ఇవ్వరో కూడా తెలియడం లేదు.
కోతలు మొదలైనా…
బీఆర్ఎస్ సర్కారు పంటల సాగుకు ముందే రైతుబంధు అందించేది. తద్వారా రైతులకు పెట్టుబడులకు ఆసరాగా నిలిచేది. కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం నాట్ల సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసాను వరి కోతలు మొదలవుతున్నా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మరో వారం పది రోజుల్లో వరి కోతలు మొదలుకానున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టాక వచ్చిన గత యాసంగి సీజన్లోనూ కోతలు పూర్తయ్యేనాటికి సాయం పెంచకుండా పాత రైతుబంధునే జమ చేసింది. ఇక మొన్నటి వానకాలానికి సంబంధించి పూర్తిగా ఎగనామం పెట్టింది. ఇప్పుడు కోతలు ప్రారంభమవుతున్నా.. ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు.