హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల నీటి వినియోగం విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు పూర్తిగా లొంగిపోయినట్టు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ నాన్చుడు ధోరణిని ఆసరాగా తీసుకొని కృష్ణా రివర్ మేనేజర్ బోర్డు (కేఆర్ఎంబీ) సైతం నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రతి నీటి సంవత్సరం (జూన్ నుంచి మే 31 వరకు)లో ఉమ్మడి రిజర్వాయర్లలో నీటినిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లు సభ్యులుగా ఉంటారు. వీరు ప్రతి ఏటా సీజన్ల వారీగా సమావేశమవుతారు. కానీ ఈసారి నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునే వరకూ సమావేశం నిర్వహించలేదు.
ఇదు అదనుగా ఏపీ ప్రభుత్వం ఇండెంట్లు, ఆర్డర్లు లేకుండానే జలాలను మళ్లించుకుపోతున్నది. ఇప్పటికే తన వాటాకు మించి జలాలను తరలించుకుపోయిన ఏపీ, తాజాగా సాగర్ నుంచి మరో 10 టీఎంసీల జలాలు కావాలని ఇండెంట్ పెట్టింది. దీనిపై చర్చించేందుకు బోర్డు ఏప్రిల్ 30న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తరువాత ఏపీ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేసింది. తిరిగి ఈ నెల 5న బోర్డు 21వ సమావేశంలో నీటివాటాలపై చర్చించాలని నిర్ణయించినా భేటీ జరుగలేదు. ఆ తరువాత సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని బోర్డు కోరడం, 24గంటలు గడువకముందే 12వ తేదీన ఏర్పాటు చేయాలని ఏపీ ప్రతిపాదించడం, ఆ మేరకు నిర్ణయించడం జరిగిపోయాయి. దీనిని బట్టి బోర్డు ఏపీకి పూర్తిగా తలొగ్గినట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది.
బోర్డు భేటీ వద్దు.. త్రిసభ్య కమిటీ సమావేశానికి పట్టు
మరోవైపు బోర్డు సమావేశానికి బదులుగా త్రిసభ్య కమిటీ భేటీకి ఏపీ పట్టుబడుతున్నది. బోర్డు సమావేశంలో చైర్మన్, ఇరు రాష్ర్టాల సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. నీటివాటాలపై చర్చ వస్తుంది. అదే జరిగితే ప్రస్తుత నీటినిల్వల్లో ఏపీకి చుక్క నీరు కూడా దక్కబోదు. ఎందుకంటే ఈ ఏడాది తాత్కాలిక ఒప్పందం మేరకు 66 శాతం దాటి 75శాతం మేరకు జలాలను ఇప్పటికే మళ్లించుకుపోయింది. మరోవైపు తెలంగాణ తన కోటా 34 శాతం కంటే తక్కువగా 25 శాతం జలాలను మాత్రమే వినియోగించుకున్నది. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటినిల్వలన్నీ తెలంగాణ కోటాలోనివే. ఈ పరిస్థితుల్లో బోర్డు సమావేశం నిర్వహిస్తే ఈ నీటివాటాలపై చర్చించాల్సి వస్తుంది.
ఏపీకి నీళ్లు దక్కే అవకాశమే ఉండదు. అందువల్ల త్రీమెంబర్ కమిటీ సమావేశానికే ఒత్తిడి తీసుకువస్తున్నది. త్రీమెంబర్ కమిటీ సమావేశంలో చైర్మన్, సెక్రటరీలు ఉండరు. కేవలం బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు మాత్రమే ఉంటారు. నీటివాటాలపై చర్చ జరుగదు. రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటినిల్వలపైనే చర్చించి, అందులో ఎవరెన్ని వినియోగించుకోవాలన్న దానిపై నిర్ణయం జరుగుతుంది. ఏపీ డిమాండ్‌కు అనుగుణంగా బోర్డు తలూపుతున్నది. సాగర్‌లో ఉన్న కొద్దిమొత్తంలోని నీటినిల్వలకు ఎసరు పెట్టేందుకు ఏపీ స్కెచ్ వేసింది. ఏపీ కోరుతున్న 10 టీఎంసీల జలాలపై 14న జరుగబోయే బోర్డు సమావేశంలోనే చర్చించాలని తెలంగాణ కోరినా బోర్డు పట్టించుకోవడం లేదు. మంగళవారం త్రీమెంబర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు బోర్డు కరాఖండిగా తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. తెలంగాణ కోటా నీళ్లను ఏపీకి ధారాదత్తం చేసేందుకు బోర్డు సిద్ధమైంది.
ఏపీతో రేవంత్ సర్కార్ కుమ్మక్కు..!
ఏపీ ఒత్తిళ్లకు రేవంత్సర్కార్ సైతం తలొగ్గిందని తేలిపోతున్నది. కాంగ్రెస్ సర్కార్ లోపాయికారీగా ఇచ్చిన దన్నుతోనే బోర్డు బరితెగించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని స్పష్టమవుతున్నది. ఈ నీటి సంవత్సరంలో బోర్డు త్రీమెంబర్ కమిటీ ఊసే ఎత్తలేదు. ఇదేమని తెలంగాణ సర్కార్ నిలదీయలేదు. బోర్డు సమావేశంలో నీటి వాటాలపై చర్చించాలని తెలంగాణ ఇంజినీర్లు పేరుకే లేఖ రాస్తున్నారు తప్ప త్రీమెంబర్ కమిటీ సమావేశ ఏర్పాటును ఎక్కడా వ్యతిరేకించడం లేదు. బోర్డు చైర్మన్‌కు ఈఎన్సీ రమేశ్‌బాబు సోమవారం కూడా లేఖ రాశారు. నీటివాటాలకు సంబంధించిన అంశాలపై 14న నిర్వహించబోయే బోర్డు సమావేశంలో చర్చించే విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. త్రిసభ్య కమిటీ భేటీ విషయంలో తమ వైఖరిని కరాఖండిగా తేల్చి చెప్పలేదు.
అంటే బోర్డు ముందు తెలంగాణ ఎంతగా సాగిలపడుతున్నదో అర్థమైపోతున్నది. త్రిసభ్య కమిటీ భేటీకి మన ఈఎన్సీ హాజరు కాకపోతే సమావేశమే ఉండబోదు. నీటివాటాలపై నిర్ణయం జరగదు. తాము త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని బయ్‌కాట్ చేస్తామని స్పష్టంగా చెప్పకుండా కేవలం బోర్డు సమావేశంలో చర్చించే అంశాన్ని పరిశీలించాలని కేఆర్ఎంబీని ప్రాధేయపడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విజ్ఞప్తిని బోర్డు పట్టించుకోకుండా త్రిసభ్య కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు నిర్వహిస్తున్నట్టు తేల్చిచెప్తూ లేఖ రాయడం కొసమెరుపు. దీనినిబట్టి తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో రేవంత్ సర్కార్ ఏపీతో కుమ్మక్కైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.