ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తెలంగాణలో ఎన్టీఆర్‌కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్, బీఆర్ఎస్ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి.. బీఆర్సోళ్లు గద్దెలు దిగాలి.. ఊర్లల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి.. బీఆర్ఎస్ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. అప్పుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతాం. ఆ విధంగా మనం ముందుకుపోవాల్సిన అవసరం ఉన్నది’ అని టీడీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆదివారం ఖమ్మం జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ముందుగా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, వివిధ శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి, కూసుమంచిలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి, మున్నేరు – పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు.
మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, నర్సింగ్ కళాశాల భవనాలను ప్రారంభించారు. అనంతరం మద్దులపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ‘సంక్షేమ పథకాల అమలుతో పేదల గుండెల్లో ఇద్దరి పేర్లు శ్వాశ్వతంగా నిలిచిపోయాయి. వారిని మనం స్మరించుకోవాలి. ఇవాళ నందమూరి తారక రామారావు వర్ధంతి. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి.. వారి కండ్లలో ఆనందం చూడాలని రెండు రూపాయాలకే కిలో బియ్యం ఇచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో బియ్యం పథకాన్ని మేం కొనసాగిస్తున్నం..నాడు వైఎస్సార్ రైతులకు 7 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. వారి స్ఫూర్తితో నేడు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం’ అని చెప్పారు.
‘మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్‌రావుతో కలిసి వివిధ గ్రామాల్లో పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమాలు తీసుకెళ్లినం’ అని గుర్తుచేసుకున్నారు. బీజేపీ ఆనవాళ్లు ఖమ్మంలో లేవని, ఏకలింగం తోకలింగంను ఇక్కడికి రానివ్వలేదని, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీని నిషేధించారని తెలిపారు. తులసివనంలో గంజాయి మొక్కలాంటి బీజేపీని ఎక్కడైనా గెలిపిస్తే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు టీడీపీ అధికారంలో ఉన్నదని, 2004 నుంచి పదేండ్లపాటు రాజశేఖర్‌రెడ్డి పాలన కొనసాగిందని, 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, అలానే రానున్న పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారా?
‘కేసీఆర్ పాలించిన పదేండ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరికైనా ఇచ్చారా?.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్లకు తీరని అన్యాయం చేసింది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అవే అబద్ధాలు వల్లెవేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడి రూపంలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని శకుని మామలా పన్నాగాలు పన్నుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంత్రులపై ఆరోపణలు వస్తే నా వివరణ తీసుకోండి
సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో కుంభకోణం జరిగిందని, దాని వెనుకాల భట్టి విక్రమార్క హస్తం ఉన్నదని ఆంధ్రజ్యోతి దినపత్రిక కొత్త పలుకులో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘సింగరేణిలోకుంభకోణం జరిగింది.. బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నయి. నేను ఆ పత్రికలకు, టీవీలకు, సోషల్ మీడియా వాళ్లకు, రాజకీయ పార్టీ నాయకులకు చెప్పదలచుకున్నా. అనవసర ప్రచారాన్ని కల్పించి, అపోహాలు కల్పించి, ప్రతిపక్షాలు బలపడడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయితీలుంటే తలుపులు మూసి కొట్టుకోండి.. లేకపోతే ఒకరిపై ఒకరు బురద జల్లుకోండి.. ఆంబోతులు కొట్లాడితే లేగదూడల కాలు విరిగాయట.
యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి.. మా మంత్రులను బద్నాం చేయకండి.. లాగకండి. మీరు రాస్తున్న రాతలు, చూపులు శుక్రాచార్యుడికి, మారీచుడికి, సుబాహుడికి సహకారం అందించినట్టు ఉంటది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని, రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. మా మంత్రుల మీద ఏదైనా రాసే ముందు నా వివరణ అడగండి’ అని రుసరుసలాడారు. కార్యక్రమాల్లో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
ఫ్రస్ట్రేషన్‌తో అక్కసు
ప్రభుత్వంలో మంత్రుల మధ్య విభేదాలు కాస్తా రోడ్డున పడటం.. స్వయంగా మంత్రులే తనపై విమర్శలు చేస్తున్న క్రమంలో తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అదంతా ఎప్పటిలాగే బీఆర్ఎస్పై అక్కసు రూపంలో వెళ్లగక్కారన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్‌లో ఉండి కేంద్రంలో బీజేపీతో జతకట్టిన టీడీపీపై తన అభిమానాన్ని బహిరంగంగా చాటుకోవడాన్ని అసలు కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఖమ్మం సభలో ఎప్పటిలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై సీఎం రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు అంటూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ వల్లే తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైందని, బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చాలని టీడీపీ శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయ పరిచింది. స్వయానా హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం నోటి వెంట ప్రతిపక్ష బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చి వేయాలంటూ విధ్వంసకర పిలుపురావడం శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ‘నేను రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏండ్లకే.. ఎలాంటి అనుభవం లేకుండానే ముఖ్యమంత్రిని అయిన’ అంటూ వ్యాఖ్యానించడం బట్టిని ఉద్దేశించేనని కాంగ్రెస్ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ‘నేనేదో గాలికి రాజకీయాల్లోకి రాలేదు, 40 ఏండ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా’ అని భట్టి విక్రమార్క చెప్పిన అదే రోజున రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారన్న చర్చలు కొనసాగాయి. కాగా కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నంతసేపు టీడీపీ జెండాలు రెపరెపలాడటం గమనార్హం. ‘ప్రజా పాలనలో జర్నలిస్టులకు చోటు ఇవ్వండి సార్’ అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జర్నలిస్టు సభలో ప్లకార్డు ప్రదర్శించారు.